కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ 23 మంది అభ్యర్థులో రెండో జాబితాను ఈ రోజు రాత్రి విడుదల చేసింది. నిన్న 189 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తొలి జాబితాలోనూ పలువురు సిట్టింగ్‌లకు టికెట్ దక్కకపోవడంతో పార్టీలో తిరుగుబాట్లు వచ్చాయి. 

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది. బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ 23 మంది అభ్యర్థులతో రెండో జాబితాను ఈ రోజు రాత్రి ప్రకటించింది. తొలి జాబితాను బీజేపీ నిన్న విడుదల చేసింది.

కాగా, రెండో జాబితాలో నలుగురు సిట్టింగ్‌లకు బీజేపీ మొండిచేయి చూపించింది. వారికి షాక్ ఇస్తూ టికెట్లు వేరే ఆశావహులకే కేటాయించింది. ఎమ్మెల్యేలు నింబన్నవర్, ఎంపీ కుమారస్వామి, నెహ్రూ ఓలేకర్, మదల్ విరూపాక్షప్పలకు టికెట్లు ఇవ్వలేదు. విరూపాక్షప్ప ప్రస్తుతం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

189 మంది అభ్యర్థులతో నిన్న బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులకూ టికెట్లు ఇవ్వలేదు. దీంతో కర్ణాటక బీజేపీలో తిరుగుబాటు గాలులు వీచాయి. వేలాది మంది కార్యకర్తలూ పార్టీని వీడినట్టు సమాచారం. సీనియర్ నేతలకూ టికెట్లు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. 

ఈ తిరుగుబాటుల నేపథ్యంలోనే బీజేపీ ఈ రోజు రాత్రి రెండో జాబితాను విడుదల చేసింది.

కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 సీట్లు ఉన్నాయి. ఇందులో తొలి జాబితాలో 189 మంది అభ్యర్థులను ఖరారు చేయగా.. రెండో జాబితాలో 23 మంది అభ్యర్థుల పేర్లను బీజేపీ ప్రకటించింది. ఇంకా 12 సీట్లలో క్యాండిడేట్లను ఇంకా ఖరారు చేయలేదు.

తొలి జాబితాలో పేరు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కర్ణాటక మాజీ సీఎం జగదీశ్ షెట్టార్ పేరు రెండో జాబితాలో ఉంటుందని ఆశపడ్డారు. తన అసంతృప్తిపై సీనియర్ నేతలతో ఆయన మాట్లాడారు. రెండో జాబితాలో ఆయన పేరు ఉంటుందని విశ్వాసం ఇచ్చారు. కానీ, తాజాగా విడుదలైన రెండో జాబితాలోనూ ఆయన పేరు లేదు. అయితే, ఆయన హుబ్బలీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెండో జాబితాలో హుబ్బలి నియోజకవర్గాన్ని పేర్కొనలేదు. 

హుబ్బలి నుంచి మళ్లీ పోటీ చేయాలని ఆరాటపడుతున్న బీజేపీ ఎమ్మెల్యే జగదీశ్ షెట్టార్ ఇప్పటికే పార్టీకి వార్నింగ్ ఇచ్చారు. తనకు టికెట్ ఇవ్వకుంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని తిరుగుబాటు సంకేతాలు పంపారు.

రెండో జాబితాలో ఇద్దరు మహిళా అభ్యర్థులు ఉన్నారు.