అతనికి ఇటీవలే పెళ్లి కుదిరింది. పెళ్లి ఏర్పాట్లు ఘనంగా సాగుతున్నాయి. మండపానికి వరుడు ఉత్సాహంగా ఊరేగింపుగా వెళ్తున్నాడు. సడెన్ గా అతని గుండె ఆగినంత పనైంది. ఎందుకుంటే.. ఊరేగింపుకి ఎదురుగా అతని మొదటి భార్య వచ్చింది. ఆమె ఒక్కతే రాలేదు. తనతోపాటు పోలీసులను కూడా వెంట తీసుకువచ్చింది. ఇంకేముంది.. పెళ్లి కాస్త ఆగిపోయింది. ఈ సంఘటన కాన్పూర్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... యూపీలోని మంగళపూర్ పోలీస్ స్టేషన్ ప‌రిధిలోగ‌ల‌ లాల్జీ కా పూర్వా గ్రామంలో నివసిస్తున్న మన్వేంద్ర సింగ్ యాదవ్ సీఆర్‌పీఎఫ్‌లో కానిస్టేబుల్‌గా ప‌నిచేస్తున్నాడు. 2015లో మ‌న్వేంద్ర సింగ్ ఒక యువ‌తితో ఫేస్‌బుక్ ద్వారా ప‌రిచ‌యం ఏర్ప‌రుచుకున్నాడు. 

2018లో వారు ఆర్యస‌మాజ్‌లో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు మరో యువ‌తితో మ‌న్వేంద్రసింగ్ వివాహానికి సిద్ధ‌మ‌‌య్యాడు. ఈ విష‌యం తెలు‌సుకున్న మ‌న్వేంద్ర సింగ్ తొలి భార్య అత‌నిని పోలీసుల‌కు రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టించింది.

ఆ యువ‌కుడు త‌న‌ను ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకున్నాడని, త‌న‌ను శారీరకంగా వేధింపులకు గురిచేశాడని, గర్భస్రావం కూడా చేయించాడ‌ని ఆమె ఆరోపించింది. మొదటి భార్య ఉండ‌గా, రెండ‌వ పెళ్లి ఎలా చేసుకుంటాడ‌ని నిల‌దీసింది. ఆమె ఫిర్యాదు మేర‌కు పోలీసులు వరుడిని పోలీస్‌స్టేషన్‌కు త‌ర‌లించారు. పెళ్లి ఊరేగింపు ఆగిపోగా, పెళ్లికి వ‌చ్చిన‌వారంతా ఈ ఘ‌ట‌న‌తో విస్తుపోయారు