వివాహం చేసుకోవడానికి మహిళ తిరస్కరించిందని.. ఆమె 5యేళ్ల కూతురి కిడ్నాప్..
వివాహిత తనను వివాహం చేసుకోవడానికి ఒప్పుకోలేదని ఆమె ఐదేళ్ల కూతురిని కిడ్నాప్ చేశాడో వ్యక్తి. ఈ ఘటన ముంబైలో వెలుగు చూసింది.

ముంబై : తాను పెళ్లి చేసుకోవాలనుకున్న మహిళ 5 ఏళ్ల కూతురిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్నారిని కిడ్నాప్ చేసి రైలులో పారిపోయేందుకు ప్రయత్నించిన ఆ వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఆ చిన్నారి తల్లి అయిన మహిళను ప్రేమిస్తున్నాడు. దీనికి ఆమె ఒప్పుకోలేదు. తిరస్కరించింది. అయినా అతను వదిలిపెట్టలేదు. ఆమెనే వివాహం చేసుకోవాలనుకున్నాడు.
5 ఏళ్ల చిన్నారి తన తల్లిదండ్రులు, అన్నయ్యతో కలిసి ముంబైలోని కమతిపురా ప్రాంతంలో నివసిస్తోంది. 28 ఏళ్ల గృహిణి అయిన మహిళ మంగళవారం ఉదయం నిద్ర లేచి చూడగా తన కూతురు కనిపించ లేదు. తనను పెళ్లి చేసుకోమని బలవంతం చేసిన వ్యక్తిపై అనుమానం ఉందని ఆమె మిస్సింగ్ ఫిర్యాదును పోలీసులకు తెలిపింది.
ఇండియా కూటమికి పెద్ద పరీక్ష.. నేడే 6 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు..
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. రోటిన్ ఘోష్ అనే పశ్చిమ బెంగాల్‌కు చెందిన 35 ఏళ్ల వ్యక్తి నిందితుడని గుర్తించారు. చిన్నారి, నిందితుడి కోసం పోలీసు అధికారులు పలు బృందాలను ఏర్పాటు చేశారు. నగరంలోని రైల్వే స్టేషన్ల మీదుగా పలు రైళ్లలో వారు తనిఖీలు చేశారు. అలా నిందితుడిని పట్టుకున్నట్టు జోన్ 3 డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) అక్బర్ పఠాన్ తెలిపారు.
"మేము మొదట అమృత్‌సర్ ఎక్స్‌ప్రెస్, హౌరా ఎక్స్‌ప్రెస్ అనే రెండు రైళ్లలో వెతికాం. కానీ నిందితుడు దొరకలేదు. అయితే, మా బృందాలు సీఎస్ఎంటీ, ఎల్ టీటీ స్టేషన్‌లలో మోహరించాయి. నిందితుడు పశ్చిమ బెంగాల్ వాసి కాబట్టి అతను షాలిమార్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఉండవచ్చని ఇన్‌పుట్ అందింది. వెంటనే ఆర్ఫీఎఫ్, స్థానిక పోలీసుల సహాయంతో చర్యలు చేపట్టాం”అని డీసీపీ తెలిపారు.
“రైలు బుల్దానాలోని షెగావ్ వద్దకు చేరుకున్న సమయంలో.. నిందితుడిని పట్టుకున్నాం. నిందితుడు బాత్రూమ్ లోపల, మైనర్ బాలికతో దాక్కున్నాడు. నాగ్‌పాడ పోలీసు బృందం చిన్నారిని సురక్షితంగా రక్షించిందని, నగర పోలీసు కమిషనర్ వివేక్ ఫన్సాల్కర్ ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారని ఆయన తెలిపారు.
ఐదేళ్ల చిన్నారిని నిద్రలోనే కిడ్నాప్ చేశారు. నిందితుడితో పరిచయం ఉండడం వల్ల ఆ చిన్నారి ఏడవడం, అరవడం చేయలేదని పోలీసులు అనుమానిస్తున్నారు. రోటిన్ ఘోష్‌ను పోలీసు కస్టడీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.