పెళ్లి తర్వాత జీన్స్ వేసుకోవద్దని భర్త వారించాడు. కానీ, ఆమె అందుకు ససేమిరా అన్నది. శనివారం రాత్రి ఓ ఫెయిర్‌కు వెళ్లేటప్పుడు జీన్స్ ధరించే వెళ్లింది. తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లో దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ గొడవలోనే ఆమె భర్తను కత్తితో పొడిచింది. ఈ ఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. 

న్యూఢిల్లీ: తమ జీవిత భాగస్వాములు ఇలా ఉండాలి.. ఇలాగే ఉండాలి అని కోరుకునే వారు కోకొల్లలు. కానీ, ఆ విషయంపై పట్టువిడుపులు ఉంటాయి. పేచీ పెట్టుకుంటే గొడవ తప్పదు. ఎదుటి వారి అభిప్రాయాలనూ గౌరవించాలని కొందరు సర్దుకు పోతారు. మరికొందరు కచ్చితంగా పాటించాల్సిందేనని ఆజ్ఞాపిస్తారు. జార్ఖండ్‌లోని ఓ వ్యక్తి తన భార్య జీన్స్ వేసుకోవడాన్ని జీర్ణించుకోలేదు. పెళ్లి తర్వాత జీన్స్ వేసుకోవద్దని పలుమార్లు చెప్పాడు. కానీ, ఆమె అందుకు అంగీకరించలేదు. ఈ విషయమై ఇద్దరి మధ్య వివాదం ముదిరింది. మాటా మాటా పెరిగి ఏకంగా దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఆ వాదంలోనే భార్య ఓ కత్తి తీసుకుని భర్తను పొడిచేసింది. దీంతో ఆయన హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించాడు.

జార్ఖండ్‌లోని జంతారా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. జంతార పోలీసు స్టేషన్ పరిధిలోని జోర్భితా గ్రామంలో తుడు, పుష్ప అనే దంపతులు ఉన్నారు. పుష్ప జీన్స్ వేసుకోవడం తుడుకు నచ్చదు. వద్దని వారించినా పుష్ప ఒప్పుకునేది కాదు. శనివారం రాత్రి ఆమె గోపాల్‌పూర్‌లో జరిగిన ఓ ఫెయిర్‌కు జీన్స్ ధరించి వెళ్లింది. ఈ విషయం తుడుకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఆమె ఇల్లు చేరగానే జీన్స్ ధరించడంపై వాగ్వాదం జరిగింది. పెళ్లి తర్వాత కూడా జీన్స్ ఎందుకు ధరిస్తున్నావని భార్యపై ఆగ్రహించాడు.

ఆయన ప్రశ్నలతో పుష్ప తీవ్ర అసహనానికి గురైంది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు కోపోద్రిక్తులపై మాటలు సంధించుకున్నారు. ఆ తర్వాత పుష్ప తన భర్తను కత్తితో పొడిచేసింది. దీంతో భర్త తీవ్ర గాయానికి లోనయ్యాడు.

ఆయన కుటుంబ సభ్యులు వెంటనే ధన్‌బాద్‌లోని పీఎంసీహెచ్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడే తుడు మరణించాడు. తుడు తండ్రి కర్ణేశ్వర్ తుడు మాట్లాడుతూ, తన కొడుకు, కోడలుకు మధ్య జీన్స్ ధరించడంపై గొడవ జరిగిందని వివరించాడు. ఆ గొడవలోనే తన కొడుకును కోడలు కత్తితో పొడిచిందని తెలిపాడు.

పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకునే పనిలో ఉన్నారు. 

ఈ ఘటన గురించి తమకు సమాచారం వచ్చిందని, జంతారా స్టేషన్ హౌజ్ ఆఫీసర్ అబ్దుల్ రెహమాన్ వివరించారు. కత్తి పోటుకు గురైన ఆ వ్యక్తి ధన్‌బాద్‌లో చికిత్స పొందుతూ మరణించాడని, తాము ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తెలిపారు. ఈ కేసును ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.