ఝార్ఖండ్ లో ఓ మహిళ ఒకే కాన్పులో ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. అది కూడా నార్మల్ డెలివరీ ద్వారా కావడం విశేషం. 

ఝార్ఖండ్ : ఒకే కాన్పులో కవలలు.. లేదా ట్రిపులెట్స్ ఇంకా ఎక్కవ అంటే నలుగురు పిల్లలు పుట్టడం సాధారణంగా చూస్తుంటాం. కానీ జార్ఖండ్లో దీనికి విరుద్ధంగా ఓ మహిళకు ఒకే కాన్పులో ఐదుగురు శిశువులు జన్మించారు. అంతేకాదు.. ఏడో నెలలోనే ఆమెకు ప్రసవం వచ్చింది. సోమవారం నాడు స్థానిక రిమ్స్ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. ఐదుగురు శిశువులు అందరూ బాలికలే. తక్కువ బరువుతో ఉన్నారు.

దీంతో వీరందరిని నియోనాటల్ ఐసియూలో ఉంచినట్లుగా రిమ్స్ వైద్యులు తెలిపారు. సాధారణంగా ఇలాంటి ప్రసవాల్లో ఆపరేషన్ ద్వారానే పిల్లలను బయటికితీస్తుంటారు. కానీ, ఝార్ఖండ్లోని రిమ్స్ వైద్యుడు శశిబాలసింగ్ నేతృత్వంలోని వైద్యుల బృందం.. ఆ మహిళకు సాధారణ ప్రసవం అయ్యేలా చేసింది. ఆ మహిళ ఛత్రజిల్లాలోని ఇత్కోరీ ప్రాంత నివాసి. ప్రసవానంతరం తల్లి పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. 

బెంగళూరులో భారీ వర్షాలు : కొట్టుకుపోయిన రూ.రెండున్నర కోట్ల బంగారు నగలు..

ఇదిలా ఉండగా, మార్చి 28న తెలంగాణ లోని సిరిసిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఓ మహిళ ఒకే కాన్పులో ఏకంగా నలుగురు పండంటి బిడ్డలకు జన్మనిచ్చింది. అయితే, ఈ కేసులో ప్రసవం ఆపరేషన్ ద్వారా జరిగింది. ఈ అరుదైన ఆపరేషన్ కు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పీపుల్స్ హాస్పిటల్ వేదికయ్యింది. 

గంభీరావుపేట మండలం సముద్ర లింగాపురం గ్రామానికి చెందిన కిషన్, లావణ్య దంపతులకు మొదట కొడుకు ఉన్నాడు. రెండోసారి గర్భంధాల్చిన లావణ్య వైద్యం కోసం పీపుల్స్ హాస్పిటల్ కు వెళ్లింది. అక్కడ ఆమె కడుపులో ఒక్కరు కాదు నలుగురు శిశువులు ఉన్నట్లుగా డాక్టర్లు గుర్తించారు. నెలలు నిండడంతో ఆమెకు ఆపరేషన్ చేసిన డాక్టర్లు ఓ ఆడ, ముగ్గురు మగ శిశువులను బైటికి తీశారు. మొత్తం నలుగురు బిడ్డలకు ఒకే కాన్పులో జన్మనిచ్చింది లావణ్య. 

ఒక్కో శిశువు కిలో బరువుతో పుట్టినట్లు వైద్యం చేసిన డాక్టర్లు శంకర్, అఖిల తెలిపారు. పదిలక్షల మందిలో ఏ ఒక్కరికో ఇలా అరుదుగా నలుగురు బిడ్డలు జన్మిస్తారని ఈ సందర్భంగా డాక్టర్లు తెలిపారు.