బెంగళూరులో భారీ వర్షాలు : కొట్టుకుపోయిన రూ.రెండున్నర కోట్ల బంగారు నగలు..
బెంగళూరులో కురుస్తున్న వర్షాలకు అక్కడి మల్లీశ్వర్ లోని ఓ బంగారు దుకాణంలో 80శాతం నగలు కొట్టుకుపోయాయి. వీటి విలువ సుమారు రెండున్నర కోట్లు ఉంటుందని అంచనా.

బెంగళూరు : వరదల్లో కోట్ల రూపాయల బంగారం కొట్టుకుపోయిన విచిత్ర ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. షాపులోని 80 శాతం నగలు వరదల్లో కొట్టుకుపోయాయి. దీంతో దాదాపు రూ. రెండున్నర కోట్ల నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. యాజమాన్యం ఇది చూసి గగ్గోలు పెడుతున్నారు.
కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత రెండుమూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో నగరం మొత్తం అతలాకుతలం అవుతోంది. భారీవర్షం, వరద ముంచెత్తడంతో బెంగళూరు మల్లేశ్వరంలోని ఓ నగల దుకాణాన్ని ఒక్కసారిగా వరద ముంచెత్తింది. దీంతో షాపు షెటర్లు మూయలేకపోయారు.
అప్పటికే వరదనీరు ఎక్కువగా చేరడంతో భయపడి.. షాపునుంచి వెళ్లిపోయారు. కాగా ఈ దుకాణంలో ఉన్న నగలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. వరద నీరు ఒక్కసారిగా ముంచెత్తడం.. కరెంట్ షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశాలున్నట్టుగా అనుమానించడంతో దుకాణంలో ఉన్న సిబ్బంది, యాజమాన్యం తమ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నంలో అక్కడి నుంచి ఉన్నఫళానా తప్పించుకున్నారు.
ఆ తరువాత చూస్తే.. నగల దుకాణంలో డబ్బాల్లో ఉన్న నగలు కూడా కొట్టుకుపోయాయి. ఇలా కొట్టుకుపోయిన నగల విలువ సుమారు రెండున్నర కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. బెంగళూరు మల్లీశ్వర్ లోని 9వ క్క్రాస్ లోని ఓ బంగారం దుకాణం వరద నీటిలో చిక్కుకుంది. ఒకసారిగా దుకాణంలోకి భారీగా వరద నీరు చేరడంతో.. షాపులోని నగలన్నీ కొట్టుకుపోయాయి.
అయితే ఈ నష్టానికి దుకాణం సమీపంలో జరుగుతున్న పనులే కారణమని.. బంగారు దుకాణ యజమాని ఆరోపిస్తున్నారు. వర్షం కారణంగా షాపులో ఉన్న బంగారు ఆభరణాలన్నీ తడిసిపోయాయి. తమకు సహాయం కావాలని కార్పొరేషన్ కు ఫోన్ చేశామని.. సహాయం చేయమని కోరామని అయినా అధికారులు స్పందించలేదని.. దీంతో తమ దుకాణంలోని 80% నగలు మాయమయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తమకు సహాయం కావాలని కార్పొరేషన్ కు ఫోన్ చేశామని.. సహాయం చేయమని కోరామని అయినా అధికారులు స్పందించలేదని.. దీంతో తమ దుకాణంలోని 80% నగలు మాయమయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గత రెండు రోజులుగా బెంగళూరును భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతుండడంతో నగరంలో ఎక్కడికిక్కడ.. వ్యర్ధాలు పేరుకుపోయాయి. భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నగర వ్యాప్తంగా పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు మున్సిపల్ కార్మికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. భారీ వర్షాలు, ఈదురుగాలులు, రాలిన ఆకులు, కూలిన చెట్లతో నగరం బీభత్సంగా మారింది.
అనేకచోట్ల చెట్లు కూలిపోయాయని.. వరద నీరు నిలిచిపోయిందంటూ ఫిర్యాదులు నగరపాలక సంస్థకు అందుతున్నాయి. అలా ఇప్పటివరకు దాదాపు 600 వరకు ఫిర్యాదులు అందాయి. అయితే వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుండడంతో.. వ్యర్థాలను, చెత్తను తొలగించడానికి మున్సిపల్ అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది.