పశ్చిమ బెంగాల్‌లో ఓ మహిళ టాయిలెట్‌లో మగ శిశువును ప్రసవించింది. ఆ శిశువు ఏడవడం మొదలుపెట్టగానే మహిళ భయంతో కిటికీలో నుంచి బయటకు విసిరేసింది. ఆ మరుసటి రోజు శిశువు మరణించింది. తాను గర్భం దాల్చిన విషయమే అవగాహనలో లేదని ఆ మహిళ చెప్పడం గమనార్హం. 

కోల్‌కతా: ఓ మహిళ టాయిలెట్‌లో ప్రసవించింది. మగ శిశువుకు జన్మనిచ్చింది. ఆ వెంటనే టాయిలెట్‌ కిటికీలో నుంచి బయటకు విసిరేసింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లో కోల్‌కతాలోని కాస్బా ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు సోమవారం వెల్లడించారు. 

ఏప్రిల్ 22న శిశువు ‘హత్య’ జరిగిందని పోలీసులు తెలిపారు. టాయిలెట్‌లో మగ శిశువుకు జన్మనిచ్చిన తర్వాత ఆ శిశువు ఏడవగానే భయంతో కిటికీలో నుంచి బయటకు విసిరేసిందని వివరించారు. ‘అసలు తాను గర్భిణి అనే విషయమే తనకు తెలియదని మహిళ చెప్పింది. గత కొన్ని నెలల నుంచి ఆమెకు రెగ్యులర్‌గా పీరియడ్స్ అవుతున్నాయని, అందుకే గర్భం దాల్చిన అవగాహన లేదన్నది. తాను టాయిలెట్ వెళ్లినప్పుడే ప్రసవించింది. ఆ శిశువు ఏడుపు వినిపించగానే భయంతో కిటికీ వైపు బలంగా విసిరేసింది. ఆ శిశువు గ్లాస్‌ను పగులగొట్టుకుని బయట పడింది’ అని పోలీసులు వివరించారు. 

Also Read: పెద్ద కొడుకు ఎంపీ, చిన్న కొడుక్కి ఎమ్మెల్యే టికెట్.. ఇది వారసత్వ రాజకీయం కాదా?: యెడియూరప్ప షాకింగ్ ఆన్సర్

ఆ మహిళకూ విపరీతమైన రక్తస్రావం జరిగింది. దీంతో ఆమెను, శిశువును హాస్పిటల్‌లో చేర్చారు. మరుసటి రోజు ఆ శిశువు మరణించింది.

ప్రాథమిక విచారణలో ఆమె మానసికంగా ఆరోగ్యంగా లేదని తెలిసింది. జూన్ 2022 నుంచి లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వ్యక్తిని అదే ఏడాది నవంబర్‌లో పెళ్లి చేసుకుంది. భర్త తాగుబోతు. అతను, వారి కుటుంబ సభ్యులకు కూడా ఆమె గర్భం దాల్చినట్టు తెలియదని చెప్పినట్టు పోలీసులు పేర్కొన్నారు. అయితే పోలీసులు కేసు పెట్టి ఘటనను దర్యాప్తు చేస్తున్నారు.