Asianet News TeluguAsianet News Telugu

ఒడిషా రైలు ప్రమాదం.. నష్టపరిహారం కోసం బతికున్న భర్తను చంపేసింది, బండారం బయటపడిందిలా..?

ఒడిషాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా సొమ్ము కొట్టేయడానికి కొందరు నీచానికి దిగజారుతున్నారు. ఓ మహిళ బతికున్న భర్తను చనిపోయినట్లుగా నాటకం ఆడి దొరికిపోయింది. 
 

woman from Odisha fakes husband's death in Balasore train crash for ex gratia money ksp
Author
First Published Jun 7, 2023, 10:34 PM IST

ఒడిషాలోని బాలేశ్వర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం ఘటనలో 270 మంది ప్రాణాలు కోల్పోగా.. 900 మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటన వందలాది కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిలిస్తే.. ఇంకొందరు అంగవైకల్యం పొంది జీవచ్చవల్లా మిగిలారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రభుత్వాలు ఎక్స్‌గ్రేషియా  ప్రకటించాయి. అయితే ప్రభుత్వం ప్రకటించిన సొమ్ముకు ఆశపడి కొందరు నకిలీ కుటుంబ సభ్యులు పుట్టకొస్తున్నారు. 

తాజాగా ఓ మహిళ బాగోతం బయటపడింది. వివరాల్లోకి వెళితే.. ఆదివారం కటక్‌కు చెందిన ఓ మహిళ.. బాలాసోర్‌లో రైలు ప్రమాద మృతుల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక మార్చురీ వద్దకు వచ్చింది. రైలు ప్రమాదంలో తన భర్త చనిపోయాడని చెబుతూ.. మృతదేహాలను చూపమని అక్కడి సిబ్బంది కోరింది. దీంతో వారు ఎన్నో మృతదేహాలను చూపుతూ వెళ్లారు. ఈ క్రమంలో ఓ మృతదేహం వద్ద ఆగిపోయిన ఆ మహిళ ఇది తన భర్తదేనని చెప్పింది. 

అయితే అధికారిక లాంఛనాలు పూర్తి చేసి మృతదేహాన్ని అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న బికాస్ కుమార్ పాలే అనే సబ్ ఇన్స్‌పెక్టర్‌‌కు ఆ మహిళపై అనుమానం వచ్చింది. ఆమె మొహంలో భర్తను కోల్పోయానన్న బాధ కానీ, దిగులు కానీ కనిపించకపోగా.. చాలా హాయిగా కూర్చొంది. దీంతో బికాస్ వెంటనే ఆమెను కొన్ని వివరాలు అడిగారు. అనంతరం ఆమె చెప్పిన వివరాల ఆధారంగా బరాంబా పోలీసులు ఆరా తీశారు. 

Also Read: చనిపోయాడని భావించి మృతదేహాల గదికి.. కాపాడిన తండ్రి.. ఒడిశా ప్రమాదంలో వెలుగులోకి మరో ధీన గాథ

ఎంక్వైరీలో సదరు మహిళ భర్త బతికే వున్నట్లు తేలింది. దీంతో పోలీసులు ఆమెను మందలించడంతో కిలాడీ లేడీ పారిపోయింది. ప్రభుత్వం అందించే సొమ్ము కోసం కొందరు ఇదే తరహాలో ప్లాన్ వేసే అవకాశం వుందని .. అందువల్ల సిబ్బంది అప్రమత్తంగా వుండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎక్స్‌గ్రేషియాను కాజేయాలని ఆ మహిళ నకిలీ పత్రాలను రూపొందించినట్లు పోలీసుల స్క్రూట్నీలో తేలింది. దీనిపై ఆమె భర్త సైతం ఘాటుగా స్పందించారు. తనకు చాలా అవమానంగా వుందని.. ఇలాంటి మహిళల పట్ల జాగ్రత్తగా వుండాలని ఆయన కోరారు. 

ఇదిలావుండగా.. బాలాసోర్ రైలు ప్రమాద ఘటనలో 288 మరణించినట్లు ఒడిషా ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ పీకే జెనా మాట్లాడుతూ.. తొలుత 275 మంది మరణించినట్లుగా ధ్రువీకరించామని అయితే కొత్తగా పలువురి మృతదేహాలను గుర్తించిన తర్వాత వీటి సంఖ్య 288కి పెరిగిందన్నారు. మరోవైపు ఈ ప్రమాదంలో మరణించిన 39 మంది ఒడిషా వాసులకు నష్టపరిహారం చెల్లించేందుకు గాను సీఎం నవీన్ పట్నాయక్ రూ.1.95 కోట్లను మంజూరు చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని ఒడిషా ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి ఈ మొత్తం అందజేస్తామని తెలిపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios