పదేళ్ల క్రితం కనిపించకుండా పోయిన భర్త.. ఆస్పత్రి వెలుపల బిచ్చగాడిగా కనిపించడంతో..
జీవితంలో ఎప్పుడూ ఏం జరుగుతుందో చెప్పలేం. కానీ కొన్ని ఘటనలు జరిగినప్పుడు మాత్రం ఆశ్చర్యపోవడం జరుగుతుంది.

జీవితంలో ఎప్పుడూ ఏం జరుగుతుందో చెప్పలేం. కానీ కొన్ని ఘటనలు జరిగినప్పుడు మాత్రం ఆశ్చర్యపోవడం జరుగుతుంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళ జీవితంలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పదేళ్ల క్రితం అదృశ్యమైన మహిళ భర్త తాజాగా ఆమెకు కనిపించాడు. అయితే అతడు బిచ్చగాడిగా ఆమెకు కనిపించడంతో తీవ్ర ఆవేదనకు గురైంది. అతని వద్దకు చేరుకుని కన్నీరు పెట్టుకుంది. వివరాలు.. బల్లియాలోని సుఖ్‌పురా ప్రాంతంలోని దేవ్‌కలి గ్రామానికి చెందిన మోతీచంద్ వర్మ, జానకితో 22 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే పెళ్లయిన 12 ఏళ్ల తర్వాత వర్మ కనిపించకుండా పోయాడు.
జానకి అతని కోసం బల్లియా, బీహార్‌లోని సమీప ప్రాంతాలలో గాలింపు చేపట్టింది. కానీ ఆమె ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఆమె కుటుంబ అవసరాలను తీర్చడానికి.. పొలాల్లో పనులు చేయసాగింది. ఇటీవల జానకి.. అనారోగ్య సమస్యతో బల్లియాలోని ఆస్పత్రికి వచ్చింది. అయితే అక్కడ కనిపించిన దృశ్యం ఆమెను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆసుపత్రి గేటు వద్ద కూర్చున్న వ్యక్తిని నిశితంగా పరిశీలించిన ఆమె.. పొడవాటి జుట్టు, పెరిగిన గడ్డంతో ఉన్న వ్యక్తి పదేళ్ల క్రితం కనిపించకుండా పోయిన తన భర్త అని గుర్తించింది.
వెంటనే అతడి వద్దకు చేరుకుని యోగక్షేమాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. అతనికి ఆహారం, నీటిని అందజేస్తూ భావోద్వేగానికి లోనైంది. ఆ వ్యక్తి మాత్రం ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు. జానకి వెంటనే తన ఇంటికి ఫోన్ చేసి విషయం చెప్పింది. వెంటనే బట్టలు తీసుకురమ్మని చెప్పింది. దీంతో అక్కడికి వచ్చిన ఓ యువకుడు ఆ మహిళను, ఆమె భర్తను తీసుకెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.