ఢిల్లీ హైకోర్టు కీలక విషయాలు తెలిపింది. మహిళలు, తమ భర్తపై, భర్త కుటుంబంపై వేసే అవాస్తవ కేసుల విషయంలో అధికారులు జాగ్రత్తగా ఉండాలని జడ్జీ తెలిపారు. ఇలా నకిలీ కేసులు దాఖలైతే సమాజంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయని వివరించారు. 

న్యూఢిల్లీ: భర్త, ఆయన కుటుంబ సభ్యులు అందరిపై మహిళలు వేసే ఫేక్ కేసుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. ఆ కేసులను వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని, తద్వార సమాజంలో సంబంధాలను కాపాడాలని వివరించింది. లేదంటే ఈ తీరు చట్టాన్ని దుర్వినియోగ పరిచే అవకాశంగా మారుతుందని హెచ్చరించింది. 

ఓ నకిలీ కేసు విచారిస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. వరకట్న వేధింపుల కేసు కింద ఆ మహిళ కుటుంబ సభ్యులు ఆమె భర్త, భర్త కుటుంబ సభ్యులపై కేసు పెట్టారు. సదరు మహిళ ఆత్మహత్య చేసుకున్నట్టూ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసు కారణంగా భర్తను నిర్బంధంలోకి తీసుకున్నారు. 

అయితే, వాస్తవానికి ఆ మహిళ ఆత్మహత్య చేసుకోలేదు. ఆమె సజీవంగా ఉన్నది. కానీ, ఆత్మహత్య చేసుకున్నట్టు కుట్ర పన్ని ఓ కేసు పెట్టించింది. తన భర్త, భర్త కుటుంబ సభ్యులపై ఆమె కేసు పెట్టించింది. వరకట్న నిషేధ చట్టం కింద పలు నేర ఆరోపణలతో భర్త, ఆయన కుటుంబంపై కేసు నమోదైంది. కాగా, ఆ వ్యక్తి తల్లి కూడా ఆ మహిళ కుటుంబ సభ్యులపై కేసు పెట్టింది. ఆ మహిళ ఆత్మహత్య చేసుకున్నట్టు అబద్ధాలు చెప్పి తన కుటుంబంలో కలిసి ఓ పథకం ప్రకారం మెట్టినింటి నుంచి అదృశ్యమైందని ఆ కేసులో వ్యక్తి తల్లి ఆరోపణలు చేసింది. 

అయితే, ఈ కేసు వివరాలను పైపైన పరిశీలించిన ఎన్నో డొల్ల విషయాలు కనిపిస్తాయని హైకోర్టు తెలిపింది. ఆమె ఆత్మహత్య చేసుకున్నదన్న విషయం అవాస్తవం అని తేలిందని వివరించింది. కేవలం స్పష్టత లేని ఓ లక్ష్యం కోసం వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారని తెలిపింది. అబద్ధపు ఆత్మహత్య, ఇతర పరిణామాలకు సంబంధించిన వివరాలపై మీడియాలోనూ కవర్ కావడంతో ఆ కుటుంబం అవమానానికి గురవ్వడమే కాకుండా ఆమె భర్త అకారణంగా నిర్బంధానికి గురయ్యాడని హైకోర్టు తెలిపింది.

అంతేకాదు, ఈ కేసు నేపథ్యంలో ఇలాంటి నకిలీ కేసుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని జడ్జీ సూచించారు. ఆమెకు అరెస్టు నుంచి రక్షణ కావాలన్న వాదనను తోసిపుచ్చుతూ ఇప్పటికే వారికి యాంటిసిపేటరీ బెయిల్‌ రద్దు చేసినట్టు గుర్తు చేశారు.