దేశ వ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టింస్తోంది. వైరస్ బారిన పడి అనేకమంది ఆక్సీజన్ అందక, ఆస్పత్రుల్లో బెడ్లు దొరకక మృత్యువాత పడుతున్నారు. ఇలాంటి విషాద సంఘటనలు రోజుకు కోకొల్లలుగా బయటపడుతున్నాయి. 

ఇలాంటి ఓ హృదయవిదారక ఘటన గురువారం ఢిల్లీలో జరిగింది. నోయిడాలోని ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ఓ ఆసుపత్రి పార్కింగ్ లో 35 ఏళ్ల కోవిడ్ పేషంట్ మృత్యువాతపడింది. 

ఆమెను ఆస్పత్రికి తీసుకువచ్చిన వ్యక్తి బెడ్ కోసం వేడుకుంటున్న సమయంలో ఆ మహిళ తుదిశ్వాస విడిచింది. నోయిడాలోని ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న జిమ్స్ ఆసుపత్రి బయట కారులో దాదాపు మూడు గంటల పాటు బెడ్ కోసం వేచిచూసిన జగృతి గుప్తా చివరికి ప్రాణాలు వదిలారు. 

గుజరాత్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం: 18 మంది కోవిడ్ రోగుల దుర్మరణం...

ఆమె ఢిల్లీలో ఒంటరిగా నివసిస్తున్నారు. ఆమె భర్త, ఇద్దరు పిల్లలు మధ్యప్రదేశ్‌లో నివసించారు. ఆమె గ్రేటర్ నోయిడాలో ఇంజనీర్‌గా పనిచేస్తోంది. ఈ సంఘటన ప్రత్యక్ష సాక్షి సచిన్ మాట్లాడుతూ ‘ఆమె (జాగృతి గుప్తా) ఇంటి యజమాని సహాయం కోసం అందర్నీ అడుగుతున్నాడు. నేను అక్కడే నిలబడి ఉన్నాను. కాని ఎవరూ అతని మాట వినిపించుకోలేదు. మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో ఆమె కుప్పకూలింది. యజమాని రిసెప్షన్‌కు పరిగెత్తి విషయం చెప్పడంతో.. అప్పుడు సిబ్బంది బయట పరుగెత్తి ఆమె చనిపోయినట్లు ప్రకటించారు "అని చెప్పారు.

దేశమంతా కరోనా సెకండ్ వేవ్ తో పోరాటం చేస్తున్న నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గత వారం తన రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదని, ఆసుపత్రిలో బెడ్ల సంఖ్యను పెంచామని దీంతో ఈ సమస్యను అధిగమించామని తెలిపారు. కానీ వాస్తవంలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. 

ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాలో ఆస్పత్రుల్లో బెడ్లు దొరకక కోవిడ్ రోగులు రోడ్డుపైనే చనిపోతున్నారు. ఈ కొరతతో మరణాలతో బెంబెలెత్తుతున్న ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న నగరాలు, గ్రామాల్లోని కుటుంబాలు ఢిల్లీలోని తమ వారిని స్వస్థలాలకు వచ్చేయమని ఒత్తిడి తెస్తున్నారు. 

కరోనా కేసుల్లో భారత్ ప్రపంచ రికార్డ్.. ఒక్కరోజే 4 లక్షల కొత్తకేసులు.. !...

నోయిడా అధికారుల ఆన్‌లైన్ బెడ్ ట్రాకర్‌లో 2,568 పడకలు ఉన్నాయి, వాటిలో ఆక్సిజన్ పడకలు, ఐసియు పడకలు ఉన్నాయి, కానీ వీటిల్లో ఏ ఒక్కటీ అందుబాటులో లేదు. బెడ్ కావాలంటూ నోయిడా హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేస్తే.. నోయిడా, గ్రేటర్ నోయిడాలో ఎక్కడా బెడ్లు ఖాళీలేవని సమాచారం వచ్చింది. బెడ్ కోసం ఎంతసేపు వేచి ఉండాలని అడిగితే  ఆపరేటర్.. చెప్పలేను. చాలా కష్టంగా ఉంది అని చెప్పుకొచ్చాడు. 

ఒక్కరోజులో 8,200 కి పైగా యాక్టివ్ కేసులు, 212 మంది మరణాలతో రాష్ట్రంలోనే అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఉంది. 

ఇదిలా ఉండగా కరోనా కేసుల్లో భారత్ కొత్త ప్రపంచరికార్డు సొంతం చేసుకుంది. గత 24 గంటల్లో 4,01,993 తాజా కేసులు నమోదవ్వడంతో ప్రపంచ రికార్డును సాధించింది. 24 గంటల్లో 3,523 మంది మృతి చెందారు. ప్రపంచంలోనే అతిపెద్ద టీకా డ్రైవ్ మూడవ దశ ఈ రోజు ప్రారంభమైంది. కాగా అనేక రాష్ట్రాలు వ్యాక్సిన్ కొరత నేపథ్యంలో చేతులెత్తేశాయి.  

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona