18 వ అంతస్తు నుండి  దూకి 47 ఏళ్ల మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ముంబైలోని తూర్పు శివారు భందుప్‌లో చోటుచేసుకుంది.  

క్షణికావేశంలో నిండు ప్రాణాలు తీసుకునే ఘటనలు ఇటీవల పెరిగాయి. పిల్లల విషయానికి వస్తే.. తల్లిదండ్రులు మందలించాడనో.. టీచర్ కొట్టాడనో ప్రాణాలు తీసుకుంటారు. ఇక యువత విషయానికి వస్తే.. ప్రియురాలు తన ప్రేమను తిరస్కరించిందనో.. ఉద్యోగం రాలేదనో.. పెళ్లి కావడం లేదనో.. తనువు చాలించుకుంటున్నారు.

ఇక వివాహితుల విషయానికి వస్తే.. భర్త తిట్టాడని భార్య, భార్య కాపురానికి రావడం లేదని భర్త, అత్తింట్లో వేధిస్తున్నారని కోడళ్లు, చేసిన అప్పులు తీర్చలేక కొందరు, అనారోగ్యం కుంగదీస్తున్నదని మరికొందరూ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తమ జీవితాలకు వారే పుల్ స్టాప్ పెట్టుకుంటున్నారు.

చనిపోయడానికి చేసిన ధైర్యంలో .. బతకడానికి ప్రయత్నిస్తే.. వారి సమస్యలు వాటంతట అవే మానసిపోతాయని అర్థం చేసుకోవడం లేదు. తాజాగా ముంబైలోని తూర్పు శివారు ప్రాంతమైన భందుప్‌లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. 

వివరాల్లోకెళ్తే.. ముంబైలోని తూర్పు శివారు ప్రాంతమైన భందుప్‌లో ఓ మహిళ ఆదివారం ఎత్తైన భవనంపై నుంచి దూకి తన జీవితాన్ని ముగించుకుంది. ఈ ఘటనపై సమాచారం ఇస్తూ రీనా సోలంకి అనే 47 ఏళ్ల మహిళ 18వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు. బాధితురాలు రీనా సోలంకి గత మూడు నెలలుగా అస్వస్థతలతో బాధపడుతోందని, దీంతో మానసికంగా కుంగిపోయిందని పోలీసులు తెలిపారు.

22 అంతస్థుల త్రివేణి సంగం హౌసింగ్ సొసైటీలో ఉదయం ఈ ఘటన చోటుచేసుకుందని, ఆ మహిళ కుర్చీపై నిలబడి 18వ అంతస్తులోని అపార్ట్‌మెంట్ కిటికీలోంచి దూకిందని తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే రీనా సోలంకిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. అక్కడ వైద్యులు ఆమె మరణించినట్లు ప్రకటించారని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. ప్రాథమిక సమాచారం ఆధారంగా.. ప్రమాదవశాత్తు మరణంగా కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.