ఉత్తరప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. చికిత్సలో భాగంగా నోట్లో వేసిన పైపు పేలడంతో మహిళ మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. ఓ మహిళ విషం తాగడంతో కుటుంబసభ్యులు ఆమెను హుటాహుటిన ఆమెను అలీఘడ్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు.

ఈ క్రమంలో చికిత్స ప్రారంభించిన డాక్టర్లు... విషాన్ని బయటకు తీయడానికి బాధితురాలి నోటిలో పైపు వేశారు. అయితే ఆ కొద్దిసేపటికే అది పేలడంతో సదరు మహిళ మృత్యువాత పడింది. అయితే ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.

దీనిపై ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ.. సల్ఫ్యూరిక్ యాసిడ్ లాంటి ద్రావణం తాగి వుంటుందని అందువల్లే నోట్లో పైప్ పెట్టగానే అందులోని ఆక్సిజన్‌తో రసాయనిక చర్య జరిగి పేలుడు సంభవించి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. దీనికి గల కారణాన్ని లోతుగా పరిశీలిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపారు.