అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్దమైన మహిళా డిప్యూటీ కలెక్టర్.. రాజీనామా ఆమోదం కోసం పాదయాత్ర.. చివరకు..
ఒక మహిళా డిప్యూటీ కలెక్టర్ తన రాజీనామాను ఆమోదించాలని పాదయాత్ర చేపట్టింది. తాను రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్నానని.. అందుకే తన రాజీనామాను ఆమోదించాలని ఆమె కోరుతుంది.

ఒక మహిళా డిప్యూటీ కలెక్టర్ తన రాజీనామాను ఆమోదించాలని పాదయాత్ర చేపట్టింది. తాను రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్నానని.. అందుకే తన రాజీనామాను ఆమోదించాలని ఆమె కోరుతుంది. అయితే ఈ క్రమంలోనే ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. ఛతర్‌పూర్ జిల్లా డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న నిషా బాంగ్రే ఈ ఏడాది జూన్‌లో రాజీనామాను సమర్పించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు నిషా రాజీనామమాను అంగీకరించలేదని ఆమె సన్నిహితులు తెలిపారు.
అయితే ఆమె రానున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా.. అక్కడ నవంబర్ 17న ఎన్నికల జరగనుండగా, డిసెంబర్ 3 ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదల కంటే ముందుగానే తన రాజీనామాను ఆమోదించాలనే డిమాండ్‌తో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. నిషా నేతృత్వంలో సెప్టెంబర్ 28న బేతుల్ జిల్లా నుంచి పాదయాత్ర ప్రారంభమైంది.
ఈ పాదయాత్ర సోమవారం సాయంత్రం భోపాల్‌కు చేరుకుంది. అయితే ఈ పాదయాత్రలో పాల్గొన్నవారు. ఈ క్రమంలోనే నిషాను అడ్డుకున్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అయితే శాంతిభద్రతలకు విఘాతం కలిగించారనే ఆరోపణలపై నిషాను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పాదయాత్రలో పాల్గొన్నవారు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నివాసం వైపు వెళ్లడం ప్రారంభించిన తర్వాత నిషాను అరెస్టు చేసినట్లు చెప్పారు.
నిషాను అరెస్టు చేసిన అనంతరం ఆమెను స్థానిక కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం జైలుకు తరలించారు. జైలులోని మహిళల వార్డులో నిషాను ఉంచినట్లు భోపాల్ సెంట్రల్ జైలు అధికారి సరోజ్ మిశ్రా తెలిపారు. ఇదిలా ఉంటే, నిషాను పోలీసులు అరెస్ట్ చేసే సమయంలో ఆమె ప్రతిఘటించిందని.. ఈ సమయంలో ఆమె దుస్తులు చిరిగిపోయాయని కాంగ్రెస్ నేత ఒకరు చెప్పారు. అయితే ఈ ఆరోపణలను పోలీసులు ఖండించారు.
ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నిషా.. బేతుల్ జిల్లాలోని తన స్వగ్రామంలో మతపరమైన కార్యక్రమంలో పాల్గొనేందుకు సెలవు మంజూరు చేయకపోవడంతో సర్వీసుకు రాజీనామా చేసినట్లు ఆమె బంధువులు చెప్పారు. ఆమె బేతుల్ జిల్లాలోని ఆమ్లా నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారని తెలిపారు. అయితే జూన్ 22 నుంచి ఆమె రాజీనామాను ఆమోదించడం లేదని చెప్పారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 28 నుంచి శాంతియుతంగా పాదయాత్రను చేపట్టారని తెలిపారు.