ఇటీవలికాలంలో ప్రేమ పేరుతో మోసాలు ఎక్కువైపోతున్నాయి. మ్యాట్రిమోని వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ద్వారా పెళ్లి కానీ యువతి, యువకులను టార్గెట్ చేసుకుని కేటుగాళ్లు భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు. తాజాగా గుజరాత్‌లో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది.

వివరాల్లోకి వెళితే.. అహ్మాదాబాద్‌ నగరంలోని నరోనా ప్రాంతానికి చెందిన జయేశ్ ఓ వస్త్ర కర్మాగారంలో టైలర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అప్పటికే 32 ఏళ్ల వయసు రావడం, సొంతిల్లు లేకపోవడంతో అతనికి సంబంధాలు రావడం లేదు.

Also Read:రమ్మీ, కాసినోకు బానిస: ఖాతాదారుల సొమ్ము కొట్టేసిన పీఎన్‌బీ క్యాషియర్

బంధువులు సైతం పిల్లనివ్వడానికి వెనుకాడారు. అయితే అతని ఆశలు ఫలించి కొందరు  బంధువులు వేరే కులానికి చెందిన కళావతి అనే అమ్మాయిని వెతికారు. ఇద్దరు ఇష్టపడటంతో ఇరు కుటుంబాల్లోని పెద్దలు పెళ్లి  చేయడానికి నిశ్చయించారు.

అయితే వివాహం తమకు అంగీకారమే  కానీ, పెళ్లి ఖర్చులకు డబ్బులు లేవని వధువు తరపు వారు చెప్పడంతో జయేశ్ కంగారుపడ్డాడు. ఇప్పుడు పెళ్లికాకపోతే జీవితంలో మళ్లీ వివాహం జరగదని భావించి... తాను దాచుకున్న రూ.1.55 లక్షలను అప్పుగా ఇచ్చాడు.

Also Read:తలకు విగ్గుపెట్టుకొని అందంగా ముస్తాబై.. ఫేస్ బుక్ లో..

ఐదు నెలల్లోనే బాకీ తీరుస్తానని వధువు సోదరుడు సంజిత్ సైతం హామీ ఇచ్చాడు. ఈ క్రమంలో గతేడాది ఆగస్టులో జయేశ్, కళావతిల వివాహం జరిగింది. అయితే పెళ్లయిన నెల రోజులకే కళావతి అత్తగారింట్లో నుంచి పారిపోయింది.

దీంతో ఈ విషయాన్ని జయేశ్... సంజిత్ దృష్టికి తీసుకెళ్లాడు. అంతేకాకుండా అప్పుగా ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి ఇవ్వమని కోరగా సంజిత్ నిరాకరించాడు. బాకీ తీర్చే ప్రసక్తే లేదని, మరోసారి డబ్బులు అడిగితే చంపేస్తామని బెదిరించాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన జయేశ్.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.