Assam: అత్యాచారాలు, హత్యలు వంటి ముఖ్యమైన కేసులపై న్యాయవ్యవస్థ మరింత దృష్టి సారించేందుకు వీలుగా ప్రభుత్వం చిన్న చిన్న కేసులను ఉపసంహరించుకోనుందని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ  శర్మ వెల్లడించారు.  

Assam chief minister Himanta Biswa Sarma: ఈశాన్య భార‌త రాష్ట్రమైన అసోం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఏకంగా ల‌క్ష కేసుల‌ను ఉప‌సంహ‌రించుకోవాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై భారం ప‌డ‌కుండా ఉండేందుకే ఈ నిర్ణ‌యం తీసుకుంది. వివ‌రాల్లోకెళ్తే.. దిగువ న్యాయవ్యవస్థపై భారం తగ్గించేందుకు సోషల్ మీడియా పోస్టులపై నమోదైన క్రిమినల్ కేసులు సహా చిన్న చిన్న నేరాలకు సంబంధించిన 100,000 కేసులను అసోం ప్రభుత్వం ఉపసంహరించుకోనున్నట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సోమవారం తెలిపారు. “న్యాయవ్యవస్థలో పరిస్థితి గురించి మేము ఆందోళన చెందుతున్నాము. ప్రస్తుతం అసోంలోని దిగువ న్యాయవ్యవస్థలో దాదాపు 450,000 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఫలితంగా, అత్యాచారం, హత్య వంటి అనేక ముఖ్యమైన కేసులను సకాలంలో విచారించడం లేదా నేరస్థులకు శిక్షలు పడటం లేదు”అని హిమంత బిశ్వ శర్మ గౌహతిలో జ‌రిగిన స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల్లో అన్నారు. 

“ఫేస్‌బుక్, ట్విటర్‌లో వ్యాఖ్యలు పోస్ట్ చేయడం గురించి 2022 ఆగస్టు 14 అర్ధరాత్రి వరకు నమోదైన దాదాపు 100,000 చిన్న కేసులను ఉపసంహరించుకుంటామని ఈ రోజు నేను ప్రకటిస్తున్నాను. తద్వారా న్యాయవ్యవస్థ.. అత్యాచారాలు, హత్యలు వంటి ముఖ్యమైన కేసులపై ఎక్కువ దృష్టి పెట్టగలదు. చిన్న చిన్న కేసుల్లో చాలా కాలంగా జైలులో ఉన్న ఖైదీలను విడుదల చేయడంపై కూడా నిర్ణయం తీసుకుంటాం' అని హిమంత బిశ్వ శ‌ర్మ‌ తెలిపారు. అలాగే, త‌న ప్ర‌సంగంలో హర్ ఘర్ తిరంగా ప్రచార విజయాన్ని ప్రస్తావిస్తూ.. స్వతంత్ర అసోం గురించి కలలు కన్న వేర్పాటువాద సమూహాలకు ఇది సందేశమని.. చర్చల కోసం చర్చా పట్టికకు రావాలని కోరారు. “స్వతంత్ర అసోం గురించి కలలు కనేవారికి గత మూడు రోజులు పెద్ద పాఠం అని నేను భావిస్తున్నాను. అసోంను దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఆత్మగౌరవం.. గౌరవంతో చర్చా వేదికపైకి రావాలని నేను భావిస్తున్నాను’’ అని సీఎం Himanta Biswa Sarma అన్నారు.

“గత మూడు రోజులలో రాష్ట్ర ప్రజలు ప్రదర్శించిన అపారమైన దేశభక్తి (త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం ద్వారా) మేము ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం లేదని చూపించింది. అసోం ఎల్లప్పుడూ భారతదేశం, దాని సంస్కృతిలో విడదీయరాని భాగం”బ‌అని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శ‌ర్మ అన్నారు. ఈ ప్రాంతానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధులు చేసిన కృషిని ఆయ‌న‌ గుర్తుచేసుకున్నారు. "ఈ సంవత్సరం అండమాన్‌లోని సెల్యులార్ జైలును సందర్శించడానికి అసోం నుంచి 1,000 మంది యువకులను పంపాలని మేము నిర్ణయించుకున్నాము. తద్వారా వారు అక్కడ ఖైదు చేయబడిన మన స్వాతంత్య్ర‌ సమరయోధుల జీవితాలను చూడగలుగుతారు.. వారి నుంచి ప్రేరణ పొందగలుగుతారు" అని Himanta Biswa Sarma అన్నారు. గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ ఒక చెట్టును నాటాలని, వాటిని తమ పిల్లలలాగా సంరక్షించాలని కూడా పిలుపునిచ్చారు. దాదాపు 4,000 ప్రభుత్వ పాఠశాలల్లో బోధనా మాధ్యమంగా అస్సామీ, ఇంగ్లీషు రెండింటినీ ప్రవేశపెడుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ పాఠశాలల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ₹ 10,000 కోట్లను ప్రతిపాదించారు.