ఏ ముఖం పెట్టుకొని ఓట్లడుగుదాం - రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్
రాష్ట్రంలో జరిగిన అవినీతిపై ఇంకా విచారణ జరగడం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో ఏ ముఖం పెట్టుకొని ప్రజలను ఓట్లు అడుగుదామని రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ అన్నారు. ప్రస్తుత సీఎం, మాజీ సీఎం ప్రజలకు ఇచ్చిన హామీలను ఇంకా నెరవేర్చలేదని ఆరోపించారు.
కాంగ్రెస్ నాయకుడు, రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ సోమవారం ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేలపై మరోసారి విరుచుకుపడ్డారు. వారిద్దరూ ప్రజలకు ఇచ్చిన హామీలను నేటికీ నెరవేర్చలేదని, ఇలాంటి పరిస్థితుల్లో ఏ ముఖంతో ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడుగుదామని ఆయన ప్రశ్నించారు.
ఝున్ ఝును, జైపూర్ లలో బహిరంగ కార్యక్రమాల షెడ్యూల్ కారణంగా పైలట్.. రాజస్థాన్ ఏఐసీసీ ఇంచార్జ్ సుఖ్ జిందర్ సింగ్ రాంధవా, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతాస్రాతో జరగాల్సిన సమావేశానికి గైర్హాజరయ్యారు. అయితే సోమవారం ఝున్ ఝును జిల్లాలోని తిబా గ్రామంలో అమరవీరుల విగ్రహావిష్కరణ అనంతరం జరిగిన సభలో పైలట్ మాట్లాడుతూ.. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ముఖంతో ప్రజల వద్దకు వెళ్లి ఎన్నికల సమయంలో ఓట్లు అడుగుతామన్నారు.
‘‘ఒక వేళ నేను నిరసన తెలిపితే.. దానిని బహిరంగానే చేస్తాను. కానీ నేను భాషపై నియంత్రణను కోల్పోను. నా నోటి నుంచి వచ్చే మాటలను వెనక్కి తీసుకోను. సైద్ధాంతికంగా, రాజకీయంగా, పాలనాపరంగానే ఎప్పుడైనా నిరసన తెలిపాను. వీధుల్లోకి వచ్చానని, ధర్నాలు చేశానని, జైలుకు వెళ్లానని, నిరాహారదీక్ష చేశాను. కానీ ఎప్పుడూ తప్పుడు పదాలు వాడలేదు.’’ అని అన్నారు.
విషాదం.. రైస్ మిల్ బిల్డింగ్ కూలి ఇద్దరు కార్మికులు మృతి.. శిథిలాల కింద మరో 20 మంది..? ఎక్కడంటే ?
‘‘వసుంధర రాజే రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆమె నాకంటే పెద్దది, కానీ రాజకీయ ఘర్షణ జరిగినలో అందరూ సమానమే. మేము ఆమెను ఓడించాము, కానీ నేను ఎప్పుడూ అసభ్యకరమైన పదాలు లేదా చెడు భాషను ఉపయోగించలేదు. భవిష్యత్తులో నేను అలా చేయను’’ అని అన్నారు. ప్రసంగాలు చేసేటప్పుడు తాను ఎప్పుడూ పరిమితిని దాటనని పైలట్ అన్నారు.
‘‘చిన్నప్పటి నుంచి నాకున్న విలువలు పెద్దలను గౌరవించడం నేర్పాయి. నేను ఎప్పుడూ పెద్దలను గౌరవిస్తాను. నేను ఇంతకు ముందు సమస్యలు, సిద్ధాంతాలు, వాగ్దానాలతో రాజీపడలేదు, భవిష్యత్తులో కూడా అలా చేయను.’’ అని తెలిపారు. ‘‘నేను ఏ సమస్యలు లేవనెత్తానో లిఖితపూర్వకంగా ఇచ్చాను. అవినీతి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. ఈ రాష్ట్ర యువత స్వచ్ఛమైన రాజకీయాలను కోరుకుంటోంది. బీజేపీ పాలనలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఒక రోజు నిరాహార దీక్ష చేశాను. వారం రోజులు గడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదు’’ అని పైలట్ పేర్కొన్నారు.
వానర సాయం.. పాడుబడిన బావిలో పడిపోయిన పిల్లి.. అల్లాడిపోతూ కాపాడిన కోతి.. వీడియో వైరల్
రాష్ట్ర ప్రజలను దోచుకున్న వారిపై విచారణ జరిపి జైలుకు పంపాలని పైలట్ అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలిపారు. ప్రజలు తమను నమ్మి ఓటేశారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ సన్నద్ధమవుతున్న తరుణంలో గెహ్లాట్ ప్రభుత్వం అవినీతి కేసుల్లో నిష్క్రియాపరత్వం ప్రదర్శిస్తోందని పైలట్ విమర్శించారు.