నేను బతికున్నంత కాలం ‘బీజేపీ’కి మిత్రుడిగానే.. : ఇండియా కూటమి కీలక నేత నితీశ్ కుమార్
తాను జీవించినంత కాలం బీజేపీ నేతలతో స్నేహం కొనసాగుతూనే ఉంటుందని నితీశ్ కుమార్ అన్నారు. బిహార్‌లోని ఓ యూనివర్సటీలో స్నాతకోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ ఇండియా కూటమి కీలక నేత నితీశ్ కుమార్ పై వ్యాఖ్యలు చేశారు.
పాట్నా: బిహార్ సీఎం, విపక్ష ఇండియా కూటమి కీలక నేత నితీశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మోతిహారిలోని యూనివర్సిటీ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ బీజేపీ నేతలతో తన సాన్నిహిత్యాన్ని ప్రస్తావించారు. బీజేపీ నేతలతో తన స్నేహం చిరకాలం సుస్థిరంగా ఉంటుందని వివరించారు.
యూనివర్సిటీ పనుల గురించి మాట్లాడుతూ.. మిగిలిన పనులూ పూర్తి చేయడంలో అందరి సహకారం ఉంటుందని ఆశిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా హాజరయ్యారు. ఆమె వైపు చూస్తే ’మీరు ఇక్కడికి వచ్చినందుకు సంతోషంగా ఉన్నది. మీరు మరిన్ని సార్లు ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను‘ అని అన్నారు.
అదే కార్యక్రమానికి హాజరైన బీజేపీ ఎంపీలు రాధామోహన్ సింగ్, ఇతర బీజేపీ నేతలను ఉద్దేశిస్తూ కూడా నితీశ్ కుమార్ మాట్లాడారు. ‘వీరంతా మంచి మిత్రులు. వీరంతా ఎక్కడున్నారు? ఏ పార్టీలో ఉన్నారు? ఇవేవీ పట్టించుకోవద్దు. ఒక విషయాన్ని స్పష్టం చేయాలనుకుంటున్నాను. మీరేమీ ఖంగారు పడకండి. మా స్నేహం చిరకాలం కొనసాగుతుంది.’ అని నితీశ్ కుమార్ అన్నారు.
Also Read: బీజేపీతో పొత్తు నిర్ణయంపై జేడీఎస్‌లో విభేదాలు.. కర్ణాటక పార్టీ అధ్యక్షుడు ఇబ్రహీంపై వేటు..
మళ్లీ బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమిలోకి నితీశ్ కుమార్ వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని పలుమార్లు వార్తలు వచ్చాయి. ఆ కథనాలను నితీశ్ కుమార్ కొట్టిపారేశారు. ఇప్పటికీ ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి. వీటిపై స్పందిస్తూ తాను మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశమే లేదని స్పష్టం చేశారు. ఇప్పుడు తన దృష్టి అంతా ఇండియా కూటమిని బలపరచడం మీదే ఉన్నదని వివరించారు.