Asianet News TeluguAsianet News Telugu

బీజేపీతో పొత్తు నిర్ణయంపై జేడీఎస్‌లో విభేదాలు.. కర్ణాటక పార్టీ అధ్యక్షుడు ఇబ్రహీంపై వేటు..

బీజేపీతో పొత్తు పెట్టుకోవాలన్న జేడీఎస్ అధినాయత్వం నిర్ణయాన్ని పార్టీలోని కొందరు నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీలో విభేదాలు తలెత్తాయి.

JDS Deve Gowda removes CM Ibrahim as Karnataka president ksm
Author
First Published Oct 19, 2023, 4:58 PM IST

బెంగళూరు: జేడీఎస్‌లో విభేదాలు తారాస్థాయికి చేరాయి. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలన్న జేడీఎస్ అధినాయత్వం నిర్ణయాన్ని పార్టీలోని కొందరు నేతలు వ్యతిరేకిస్తున్నారు. జేడీఎస్ కర్ణాటక అధ్యక్షుడు సీఎం ఇబ్రహీం కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలన్న పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఈ పరిణామం చోటుచేసుకున్న కొద్దిరోజులకే ఆయనపై వేటు పడింది. పార్టీ రాష్ట్ర విభాగాన్ని రద్దు చేస్తూ జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ ఆదేశాలు జారీ చేశారు. తన కుమారుడైన మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామిని తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించారు.

విలేకరుల సమావేశంలో దేవెగౌడ మాట్లాడుతూ.. కుమారస్వామి నాయకత్వానికి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందన్నారు. కుమారస్వామిని జేడీఎస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగాలని మేమంతా నిర్ణయించుకున్నామని ఆయన చెప్పారు. మరో రౌండ్ సంప్రదింపుల తర్వాత కొత్త రాష్ట్ర యూనిట్‌కు ఇతర ఆఫీస్ బేరర్‌లను నియమించనున్నట్టుగా ప్రకటించారు. 

కుమారస్వామి గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘పార్టీని బలోపేతం చేయడానికి మా జాతీయ అధ్యక్షుడు ఈ రోజు పాత యూనిట్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. నా నాయకత్వంలో తాత్కాలిక కమిటీని ప్రకటించారు. సహజంగా, అది తనకు (ఇబ్రహీం) తెలియజేయబడుతుంది. పార్టీని బలోపేతం చేయడం నా బాధ్యత.. నా ఏకాగ్రత నా పార్టీని అభివృద్ధి చేయడం’’ అని పేర్కొన్నారు. 

ఇక, ఎన్డీయేలో జేడీఎస్ చేరాలనే నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఇబ్రహీం సోమవారం సారూప్యత కలిగిన పార్టీ నేతలతో సమావేశమయ్యారు. బీజేపీతో జేడీఎస్ చేతులు కలపకూడదని, తన వర్గమే అసలైనదని మెమోరాండం సమర్పించడానికి కోర్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక, గతంలో కాంగ్రెస్‌లో ఉన్న ఇబ్రహీం 2022 మార్చిలో ఆ పార్టీని వీడి జేడీఎస్‌లో చేరారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios