Asianet News TeluguAsianet News Telugu

బీజేపీ-ముక్త్ భారత్ కోసం కేసీఆర్ ప్రయత్నాలు ఫలిస్తాయా?.. గత అనుభవం ఏం చెబుతుంది?

జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కొనేందుకు విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నాలు ముమ్మురం చేశారు. ఈ క్రమంలోనే ఆయన బుధవారం (ఆగస్టు 31) రోజున బీహార్ వెళ్లి.. ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎ తేజస్వీ యాదవ్‌లను కలిశారు. అయితే తాను చేస్తున్న ప్రయత్నాల్లో కేసీఆర్ విజయం సాధిస్తారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Will KCR bring the opposition parties together against BJP
Author
First Published Sep 1, 2022, 5:33 PM IST

జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కొనేందుకు విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నాలు ముమ్మురం చేశారు. ఈ క్రమంలోనే ఆయన బుధవారం (ఆగస్టు 31) రోజున బీహార్ వెళ్లి.. ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎ తేజస్వీ యాదవ్‌లను కలిశారు. అయితే తాను చేస్తున్న ప్రయత్నాల్లో కేసీఆర్ విజయం సాధిస్తారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే నితీష్ కుమార్‌తో కేసీఆర్ తాజా భేటీ, విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను ఒకసారి చూద్దాం.. 

బుధవారం పాట్నాలో నిర్వహించిన నితీష్ కుమార్, కేసీఆర్ విలేకరుల సమావేశానికి సంబంధించిన వీడియో క్లిప్‌ను బీజేపీ నేతలు షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది. ఆ వీడియోను హైలెట్ చేస్తున్న విపక్షాల వైరుధ్యానికి ఉదాహరణగా అర్థం చేసుకోవచ్చని బీజేపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. అందుకు కారణం.. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం ప్రతిపక్ష పార్టీల పొత్తు, ప్రధాని అభ్యర్థి గురించి విలేకరులు కేసీఆర్‌ను అడిగారు. అయితే ఆ ప్రశ్న అడిగిన సమయంలో నితీష్ కుమార్ తిరస్కరించి ప్రెస్ మీట్ ముగించాలని చూశారు. కానీ అదే సమయంలో కేసీఆర్ ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వసాగారు. 

ఇక, 2024లో ప్రధాని పదవికి పోటీదారుగా నితీష్ కుమార్‌పై అభిప్రాయాన్ని తెలియజేయాలని కూడా కేసీఆర్‌ను విలేకరులు అడిగారు. దీనిపై స్పందించిన కేసీఆర్.. ‘‘ఇది చెప్పడానికి నేను ఎవరు? నేను ఇలా చెబితే.. ఎవరైనా అభ్యంతరం చెప్పవచ్చు. మీరు ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారు? మేము కూర్చుని మాట్లాడుకుంటాం’’ అని న్నారు. ఈ ప్రశ్న అడిగిన సమయంలో నితీష్ కుమార్, తేజస్వీ యాదవ్‌లను వారి సీట్లలో నుంచి లేచి వెళ్లిపోయేందుకు సిద్దమయ్యారు. విలేకరుల సమావేశం ముగిసిందని కూడా నితీష్ కుమార్ నవ్వుతూ చెప్పబోగా.. కేసీఆర్ మాత్రం ఆయనను కూర్చోవాల్సిందిగా కోరారు. 
.
ఉమ్మడి ప్రతిపక్షాలకు రాహుల్‌గాంధీ ప్రధాని అవుతారా అని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నావు?’’ నితీష్‌ కుమార్‌ అన్నారు. ఈ ప్రశ్నకు కేసీఆర్ సమాధానం చెప్పడం ప్రారంభించడంతో.. నితీష్ కుమార్ మళ్లీ లేచి.. ఇలాంటి వాటిలో పడిపోవద్దని కేసీఆర్ కోరారు. 

ఈ పరిణామాలపై స్పందించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు అమిత్ మాలవీయా.. ‘‘ఇలా అవమానం పొందడానికే  కేసీఆర్ పాట్నా యాత్రకు వెళ్లారా?. ఒక ప్రెస్ ఇంటరాక్షన్‌లో కేసీఆర్ అభిప్రాయాన్ని పూర్తి చేసే ప్రాథమిక మర్యాదను కూడా అతనికి నితీష్ కుమార్ ఇవ్వలేదు. తాను ముగించాలని కేసీఆర్ చేసిన విజ్ఞప్తిని నితీశ్ తోసిపుచ్చారు’’ అని ట్వీట్ చేశారు. 

మరోవైపు బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ ట్వీట్ చేస్తూ.. ‘‘ప్రధానమంత్రి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసేందుకు నితీశ్ కుమార్ కేసీఆర్‌కు ఫోన్ చేశారు. కానీ కేసీఆర్ ఆయన పేరు కూడా తీసుకోలేదు. నితీశ్‌ లేచి వేదికపై నుంచి వెళ్లేందుకు ప్రయత్నించగా.. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ పేరును జపించారు. . ఇంతకంటే అవమానకరం ఏముంటుంది?’’ అని ఎద్దేవా చేశారు. 

అయితే నితీష్ కుమార్ ఇటీవలో బీజేపీతో విడిపోయిన తర్వాత.. జేడీయూ, కాంగ్రెస్, ఇతర పక్షాలతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి 2024లో ప్రధానమంత్రి అభ్యర్థిగా నితీష్ కుమార్‌ పేరు చర్చల్లోకి వచ్చింది. నితీష్‌ను ఆయన పార్టీ నాయకులు విపక్షాల ప్రధాని అభ్యర్థి అని అంచనా వేస్తున్నారు. ఇలాంటి సమయంలో నితీష్, కేసీఆర్‌ల సమావేశం ముఖ్యమైనదనే చెప్పాలి. అయితే విపక్షాల పార్టీలలో కీలక నేతలుగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, కేసీఆర్‌ల కంటే.. నితీష్ కొంత మొగ్గు కలిగి ఉంటారనే రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. ఒకవేళ ఆయన విపక్షాల ప్రధాని అభ్యర్థిగా ఉంటే.. కాంగ్రెస్ కూడా మద్దతిచ్చేందుకు అంగీకరించవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ లేకుండా విపక్ష పార్టీలు ఐక్యత కష్టమేనని టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే తమిళనాడు, జార్ఖండ్, బిహార్‌లలో.. అధికార పక్షానికి  కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉన్న సంగతి తెలిసిందే. కానీ కేసీఆర్ ఇప్పటివరకు చేస్తున్న ప్రయత్నాలు గమనిస్తే.. ఆయన బీజేపీయేతర, కాంగ్రెసేతర ప్రత్యామ్నాయ వేదిక కోసం కృషి చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది. మరి ఆ ప్రయత్నాల్లో ఎంతవరకు విజయం సాధిస్తారో వేచి చూడాల్సిందే.

ఇక, మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఢీకొట్టేందుకు థర్డ్ ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాల్లో దూసుకుపోవాలని కేసీఆర్ ప్రయత్నాలు చేయడం ఇదే తొలిసారి కాదు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా ఆయన డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి, కేరళ సీఎం పినరయి విజయన్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, సమాజ్ వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్‌లతో కలిసి చర్చలు జరిపారు. అయితే ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. 

తాజాగా 2024 ఎన్నికలే లక్ష్యంగా జాతీయ స్థాయిలో వివిధ ప్రతిపక్ష నేతలను కలుస్తున్న కేసీఆర్.. ‘‘బీజెపి-ముక్త్ భారత్’’ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తానని చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు ఆయన చేసిన ప్రయత్నాలను ఒక్కసారి పరిశీలిస్తే.. 

2021 డిసెంబర్ 15- తమిళనాడు పర్యటనకు వెళ్లిన తెలంగాణ సీఎ కేసీఆర్.. చెన్నైలో ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్‌తో సమావేశమయ్యారు. 

2022 జనవరి 9- హైదరాబాద్‌లో సీపీఎం, సీపీఐ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులతో కేసీఆర్ విడివిడిగా సమావేశాలు నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడిగా పోరాడేందుకు అవసరమైన కార్యచరణపై కేసీఆర్ వారితో చర్చించారు. 

2022 జనవరి 12- రాష్ట్రీయ జనతాదళ నాయకుడు తేజస్వీ యాదవ్ హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు జాతీయ రాజకీయాలపై చర్చించారు. 

2022 ఫిబ్రవరి 20- జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా భావసారూప్యత కలిగిన వివిధ పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా కేసీఆర్ అప్పటి మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే‌ను ముంబైలో కలిశారు. ఠాక్రే ఆహ్వానం మేరకు మహారాష్ట్ర సీఎం అధికారిక నివాసం వర్షకు వెళ్లిన కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ బృందం.. ఉద్దవ్‌తో పాటు శివసేన నేతలతో చర్చలు జరిపారు. అనంతరం ముంబైలోనే ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను కూడా కలిశారు. కేసీఆర్‌తో భేటీ అనంతరం.. దేశం ఎదుర్కొంటున్న ఆకలి, పేదరికం, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం వంటి వివిధ సమస్యలను పరిష్కరించడానికి భావసారూప్యత ఉన్న పార్టీలన్నీ చేతులు కలపాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. 

2022 మార్చి 4- జార్ఖండ్ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో కేసీఆర్ భేటీ అయ్యారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై ఈ సందర్భంగా వారు చర్చించారు. 

2022 మే 22- ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేసీఆర్‌ను న్యూఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో కలిశారు. ప్రస్తుత రాజకీయ, విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల కేంద్రం అనుసరిస్తున వైఖరి సహా పలు అంశాలపై చర్చించినట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి.

2022 మే 26-  బెంగళూరులోని జేడీ(ఎస్) అధినేత హెచ్‌డీ దేవెగౌడను ఆయన నివాసంలో కలిసిన కేసీఆర్ పలు అంశాలపై చర్చించారు. 

2022 జూలై 29- బీజేపీయేతర  పార్టీలను ఏకం చేసే ప్రయత్నాల్లో భాగంగా కేసీఆర్ సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో సమావేశమయ్యారు. 

Follow Us:
Download App:
  • android
  • ios