ఆక్సిజన్ తరలించే వాహనాలను అడ్డుకుంటే ఉరి తీస్తాం. ఈ మాట అన్నది స్వయానా ఢిల్లీ హైకోర్టు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో పాటు స్థానిక అధికారులకు ఈ హెచ్చరిక జారీ చేసింది. ఢిల్లీలోని ఆసుపత్రుల్లో తీవ్ర ఎద్దడి నెలకొంది.

అయితే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీకి బయల్దేరిన ఆక్సిజన్ ట్యాంకర్లను ఆయా ప్రాంతాలకు చెందిన కొంతమంది అధికారులు అడ్డుకుంటున్నారన్నది ఢిల్లీ ప్రభుత్వ ఆరోపణ. దీంతో అటువంటి ఒక్క ఘటనపై తమకు వివరాలు ఇస్తే.. అడ్డుకున్న వ్యక్తిని ఉరి తీస్తామని వ్యాఖ్యానించింది ఢిల్లీ హైకోర్టు.

ఈ విషయంలో ఎవ్వరిని ఉపేక్షించేది లేదని హెచ్చరించింది. ఆక్సిజన్ ట్యాంకర్లను అడ్డుకుంటున్న అధికారులపై కేంద్ర ప్రభుత్వానికి కూడా సమాచారం ఇవ్వాలని సూచించింది.

Also Read:ఢిల్లీ ఆస్పత్రుల్లో తీవ్ర ఆక్సీజన్ కొరత.. జైపూర్ గోల్డెన్ హాస్పిటల్ లో 20 మంది రోగులు మృతి... !

మరోవైపు ఢిల్లీకి రోజుకు 480 టన్నుల ఆక్సిజన్ ఇస్తామన్న కేంద్రం ఆ మాట ఎందుకు నిలబెట్టుకోవడం లేదని ప్రశ్నించింది హైకోర్టు. తమకు రోజుకు 380 టన్నుల ఆక్సిజన్ మాత్రమే అందుతోందని ఢిల్లీ సర్కార్ చెప్పడంతో ఈ వ్యాఖ్యలు చేసింది ఉన్నత న్యాయస్థానం. 

కాగా, తీవ్రమైన ఆక్సిజన్ కొరతతో ఢిల్లీలోని జైపూర్ గోల్డెన్ హాస్పిటల్ లో ఒక్కరాత్రిలో కనీసం ఇరవై మంది రోగులు మృత్యువాత పడ్డారు. దీనిమీద జైపూర్ గోల్డెన్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ డి కె బలూజా మాట్లాడుతూ ఆక్సీజన్ కొరత తీవ్రంగా ఉందని, దీనిమీద ఉదయం నుంచి పోరాడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఆసుపత్రిలో 200 మందికి పైగా రోగులు ఉన్నారని, ఉదయం 10:45 గంటలకు వారికి అరగంట ఆక్సిజన్ మాత్రమే ఉందని బలూజా చెప్పారు. అనేక గంటల ఎదురుచూపుల తరువాత అర్థరాత్రికి గానీ ఆక్సీజన్ రీఫిల్ కాలేదని ఇదే నష్టానికి దారి తీసిందని తెలిపారు.