రాహుల్ గాంధీకి 2019నాటి డిఫమేషన్ కేసులో రెండేళ్ల జైలు శిక్ష విధించిన న్యాయమూర్తిపై ఓ కాంగ్రెస్ నేత నోరుపారేసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ న్యాయమూర్తి నాలుక కోస్తామని బెదిరించాడు. ఆ నేతపై కేసు ఫైల్ అయింది.
చెన్నై: తమిళనాడులో ఓ కాంగ్రెస్ నేత జడ్జీపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష వేసిన న్యాయమూర్తి నాలుక తెగ్గోస్తామని బెదిరింపులు చేశాడు. ఈ వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేతపై కేసు నమోదైంది.
2019లో కర్ణాటకలో రాహుల్ గాంధీ మోడీ ఇంటి పేరును పేర్కొంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఆయన ఎంపీ పదవికే ఎసరు పెట్టాయి. మోడీ ఇంటి పేరున్న వారిని, ఒక వర్గాన్ని రాహుల్ గాంధీ అవమానించారని గుజరాత్‌లోని సూరత్ కోర్టులో కేసు ఫైల్ అయింది. ఆ కేసు విచారించి రాహుల్ గాంధీని సూరత్ కోర్టు దోషిగా తేల్చింది. రెండేళ్ల జైలు శిక్ష వేసింది. పార్లమెంటులో సభ్యత్వం కోల్పోవడానికి కనీసం రెండేళ్ల శిక్ష ఉంటే సరిపోతుంది. దీంతో ఆ నిబంధన మేరకు రాహుల్ గాంధీ ఎంపీ పదవిని కోల్పోయారు.
రాహుల్ గాంధీని పార్లమెంటు సభ్యత్వంపై వేసిన అనర్హత వేటును నిరసిస్తూ తమిళనాడులోని దిండిగల్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్సీ ఎస్టీ వింగ్ నిరసనలు చేసింది. ఆ నిరసనలో కాంగ్రెస్ పార్టీ జిల్లా హెడ్ మణికందన్ మాట్లాడారు. మార్చి 23న సూరత్ కోర్టు న్యాయమూర్తి రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిందని గుర్తు చేశారు. ‘జస్టిస్ హెచ్ వర్మ వినండి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నీ నాలుక కోసేస్తాం’ అని మణికందన్ అన్నారు.
మూడు సెక్షన్ల కింద మణికందన్ పై కేసు నమోదైంది. దిండిగల్ పోలీసులు ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించారు.
