ఒమిక్రాన్ వేరియంట్ భయాల నేపథ్యంలో టీకా తయారీదారు సీరం సంస్థ సీఈవో అదర్ పూనావాలా కీలక ప్రకటన చేశారు. మరో ఆరు నెలల్లో చిన్న పిల్లలకు నోవోవాక్స్ టీకాను అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. ఇప్పటికే ఈ టీకా అత్యవసర వినియోగ అనుమతులు ఇవ్వాలని డీజీసీఐకి దరఖాస్తు పెట్టారు. నిపుణుల కమిటీ ఈ టీకాకు సంబంధించి అదనపు సమాచారాన్ని కోరింది.

ముంబయి: కరోనా(Corona Virus) భయాలు ఇంకా పోలేవు. ఈ మహమ్మారి (Pandemic) కొత్త కొత్త రూపాల్లో తరుచూ ప్రజలను వణికిస్తున్నది. మాటు వేసి కాటేస్తున్నది. ఇప్పుడు ఒమిక్రాన్ (Omicron) రూపంలో విజృంభిస్తున్నది. దక్షిణాఫ్రికాలో ఈ వేరియంట్ పిల్లల్లో(Children)నూ ఎక్కువగా కనిపిస్తుండటంతో ఆందోళనలు పెరుగుతున్నాయి. గతంలోనూ థర్డ్ వేవ్ (Third Wave) వస్తే దాని ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉంటుందని నిపుణులు పలుమార్లు హెచ్చరించారు కూడా. అదీగాక, ఈ వేరియంట్ వ్యాక్సిన్ (Vaccine) సామర్థ్యానికే సవాలు విసురుతుండటంతో అదనపు టీకాలు, బూస్టర్ టీకాలపైనా చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే పిల్లలకు టీకా అందించాలనే అభిప్రాయాలు బలపడుతున్నాయి. ఈ సందర్భంలో పూణెకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా(Adar Poonawalla) కీలక ప్రకటన చేశారు. ఆరు నెలల్లో పిల్లలకు కరోనా టీకా తెస్తామని వెల్లడించారు.

ఆరు నెలల్లో పిల్లల కోసం కరోనా టీకా నోవోవాక్స్‌ను అందుబాటులోకి తెస్తామని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) సీఈవో అదర్ పూనావాలా చెప్పారు. ఈ టీకా మూడు సంవత్సరాలు పైబడిన పిల్లల్లో ఆశాజనకమైన ఫలితాలను ఇచ్చిందని ఆయన వివరించారు. ఈ నోవోవాక్స్ తయారు చేసిన టీకాను ఎస్ఐఐ కోవోవాక్స్ అని పిలుస్తున్నది. మూడేళ్లు పైబడిన పిల్లల కోసం కోవోవాక్స్ పంపిణీ చేయడానికి ఎస్ఐఐ ఇటీవలే సెంట్రల్ డ్రగ్ అథారిటీకి దరఖాస్తు పెట్టుకుంది. దీనిని నిపుణుల కమిటీ పరిశీలిస్తున్నది. ఇందుకోసం అదనపు సమాచారం కావాలని ఎస్ఐఐని నిపుణుల కమిటీ కోరింది. అంతేకాదు, ఈ టీకా అభివృద్ధి చేసిన దేశంలోనే ఇంకా ఆమోదం పొందలేదు అనే విషయాన్ని పేర్కొంది.

Also Read: కోవిషీల్డ్‌తో గందరగోళం.. భారతీయ విద్యార్ధులకు బాసటగా సీరమ్ అధినేత, రూ.10 కోట్ల సాయం

మన దేశంలోనూ ఈ టీకా ప్రయోగాలు చిన్నపిల్లలపై జరుగుతున్నాయి. ఈ టీకా రెండో ఫేజ్ ట్రయల్స్ ఫలితాలను పూణెకు చెందిన టీకా తయారీదారు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. వీటితోపాటు అమెరికా, యూకేలో నిర్వహించిన మూడో దశ ట్రయల్స్ మధ్యంతర ఫలితాలనూ అందించింది.

అమెరికాకు చెందిన టీకా తయారీదారు నోవోవాక్స్ ఈ టీకాను అభివృద్ధి చేసింది. ఈ సంస్థ భారత్‌కు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇండియాతోపాటు పేద దేశాలు, మధ్యదశ ఆర్థిక అభివృద్ధి గల దేశాల్లో టీకా విక్రయాలకు సంబంధించి ఈ రెండు దేశాల మధ్య ఒప్పందం ఉన్నది. ఈ ఒప్పందం మేరకు మన దేశంలో కోవోవాక్స్ టీకా తయారు చేయడానికి సీరం సంస్థకు డీజీసీఐ మే 17న అనుమతులు ఇచ్చింది. అప్పటి నుంచి సీరం సంస్థ ఈ టీకాలను ఉత్పత్తి చేస్తూనే ఉన్నది.

Also Read: భారత్‌లో వ్యాక్సినేషన్‌... 2, 3 నెలల్లో కష్టమే, మూడేళ్లు పక్కా : పూనావాలా సంచలన వ్యాఖ్యలు

ఇటీవలే మన దేశంలో సీరం సంస్థ తయారు చేసిన సుమారు రెండు కోట్ల కోవోవాక్స్ టీకాలను ఇండోనేషియాకు ఎగుమతి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. అయితే, ఈ టీకాకు మన దేశం ఇంకా అత్యవసర వినియోగ అనుమతులు ఇవ్వలేదు. ఈ సందర్భంలోనే సీరం సంస్థ సీఈవో అదర్ పూనావాలా మరో ఆరు నెలల్లో పిల్లల కోసం నోవోవాక్స్ టీకాను అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు.