రష్యా నుంచి భారత ప్రభుత్వం చౌకగా చమురును దిగుమతి చేసుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నదనే వార్తల నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం సీరియస్ అయింది. రష్యా నుంచి భారత్ అదనపు చమురును దిగుమతి చేసుకోరాదని, లేదంటే ఆ తర్వాతి పరిణామాలను భారత్ ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఒక క్వాడ్ సభ్య దేశం ఇలా వ్యవహరిస్తుందనుకోలేదని ప్రెసిడెంట్ బైడెన్ అన్నారు. రష్యాలోని తమ చమురు ప్రాజెక్టులను యథావిధిగా కొనసాగిస్తామని శుక్రవారం క్వాడ్ దేశం జపాన్ కూడా పేర్కొంది. భారత్‌ను హెచ్చరించినట్టే అమెరికా.. జపాన్‌కు కూడా వార్నింగ్ ఇస్తుందా?
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేస్తున్నందున అమెరికా దానిపై ఆర్థిక ఆంక్షలు విధించింది. ముఖ్యంగా రష్యా నుంచి చమురు ఎగుమతులపై ప్రధానంగా ఆంక్షలు విధించింది. అందుకే భారత్ సహా ఇతర దేశాలు రష్యా నుంచి చమురు దిగుమతులను పెంచుకోవద్దని వార్నింగ్ ఇచ్చింది. ఇటీవలే భారత్ పర్యటించిన అమెరికా డిప్యూటీ ఎన్ఎస్ఏ(నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్) కూడా ఈ హెచ్చరికలు చేసి వెళ్లాడు. అంతేకాదు, ఏకంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా భారత్‌పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. రష్యా ఆఫర్ చేస్తున్న చౌక చమురును కొనుగోలు చేయడానికి భారత్ సిద్ధంగా ఉన్నదన్న వార్తలు వస్తున్న తరుణంలో యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ రియాక్ట్ అయ్యారు. ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనపై భారత్ వైఖరిని ప్రశ్నించారు. క్వాడ్ కూటమి భాగస్వామ్య దేశం భారత్ వైఖరి అస్పష్టంగా ఉన్నదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికా కేవలం క్వాడ్ పార్ట్‌నర్ అయిన భారత్‌పైనే ఆగ్రహం చూపిస్తుందా? లేక మరో క్వాడ్ పార్ట్‌నర్ అయిన జపాన్‌నూ విమర్శించగలదా? అనే చర్చ మొదలైంది. ఎందుకంటే.. జపాన్ ప్రభుత్వం స్వయంగా తాము రష్యాలోని చమురు
ప్రాజెక్టులను కొనసాగిస్తామని ప్రకటించింది.
జపాన్ వాణిజ్య మంత్రి కోయిచి హగియుదా నిక్కె ఏషియా న్యూస్ ఏజెన్సీతో శుక్రవారం మాట్లాడుతూ ఈ సంచలన ప్రకటన చేశారు. రష్యాలోని చమురు, ద్రవ సహజ వాయువు అభివృద్ధి ప్రాజెక్టుల నుంచి తాము ఉపసంహరించుకోబోమని ప్రకటించారు. జపాన్‌లోని దిగ్గజ ఎనర్జీ కంపెనీలు రష్యాలోని సాఖలిన్-1, సాఖలిన్-2, ఆర్క్‌టిక్ ఎల్‌ఎన్‌జీ 2 (ఆర్క్ 2)లలో పెట్టుబడులు పెట్టాయి. జపాన్ ఇంధన అవసరాలకు ఈ ప్రాజెక్టులను ముఖ్యమైనవిగా ప్రభుత్వం భావిస్తున్నట్టు ఆయన వివరించారు.
‘ఆ ప్రాజెక్టులతో తమకు ప్రయోజనాలు ఉన్నాయి. వాటికి తాము దీర్ఘకాలిక హక్కుదారులం. ఇప్పటి పరిస్థితుల్లో ఉన్నపళంగా చమురు ధరలు పెరిగినా.. తాము మార్కెట్ ధరల కంటే కూడా తక్కువకే చమురును పొందగలం. ఇంధన భద్రతకు ఇది మాకు చాలా ముఖ్యమైన విషయం’ అని జపాన్ మంత్రి హగియుదా తెలిపారు.
జపాన్ కంపెనీలు ఎంఈటీఐ, ఇటోచు, జపాన్ పెట్రోలియం ఎక్స్‌ప్లొరేషన్ కంపెనీ, మరుబేని అండ్ ఇన్‌పెక్స్‌లు సాఖలిన్-1 ప్రాజెక్టులకు నిధులు సమకూర్చాయి. కాగా, మిత్సుయి, మిత్సుబిషి సహా పలు జపాన్ కంపెనీలు సాఖలిన్-2 ప్రాజెక్టులో నిధులు పెట్టాయి. కాగా, మిత్సుయి, జపాన్ ఆయిల్ గ్యాస్ అడ్ మెటల్స్ నేషనల్ కార్పొరేషన్‌లు ఆర్క్ 2 ప్రాజెక్టుకు ఫండింగ్ ఇచ్చాయి. ఆర్క్‌టిక్ ప్రాజెక్టు ఎల్ఎన్‌జీ నుంచి జపాన్ వెనుదిరగబోదని జపాన్ వాణిజ్య మంత్రి స్పష్టం చేశారు.
కాగా, నిక్కె ఏషియా న్యూస్ ఏజెన్సీతో ఉక్రెయిన్ మాజీ ప్రధాని అర్సెనియ్ యత్సెన్యుక్ మాట్లాడుతూ, రష్యా చమురు, సహజ వాయువు దిగుమతులపై జపాన్ నిషేధం విధించాలని, ఇది జపాన్ దేశానికే కలిసి వస్తుందని వివరించారు. రష్యా చమురుపై ఆధారపడటాన్ని జపాన్ మానుకోవడం మంచిదని తెలిపారు.
ఆసియా రీజియన్‌లోని చైనాకు చెక్ పెట్టే లక్ష్యంగా అమెరికా ఇక్కడ భారత్, ఆస్ట్రేలియా, జపాన్‌లతో కలిసి కూటమి ఏర్పాటు చేసింది. దాన్నే క్వాడ్‌గా వ్యవహరిస్తున్నారు.
