తన భర్త వేరే మహిళతో మాట్లాడితేనే ఏ భార్య తట్టుకోలేదు. అలాంటిది ఓ భార్య తన భర్త అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళతో వివాహం జరిపించింది. వివరాల్లోకి వెళితే.. ఒడిషాలోని మల్కన్‌గిరి జిల్లాలోని మత్తిలి సమితిలోని కుమార్‌పల్లి గ్రామానికి చెందిన రామ కావసికి కొన్నేళ్ల క్రితం గాయత్రి అనే యువతితో పెళ్లి జరిగింది. పిల్లలు పుట్టడంతో పాటు ఎలాంటి సమస్యలు లేకుండా హాయిగా సాగిపోతోన్న వీరి జీవితంలో ఇటీవలి కాలంలో చిన్న కుదుపు వచ్చింది.

రామ కావసికి కొద్దిరోజుల క్రితం ఐత మడకామి అనే యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి, వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని రామ కావసిపై ఐత ఒత్తడి తీసుకొచ్చింది. తనకు గతంలోనే వివాహం జరిగిందని, ఇప్పట్లో పెళ్లి చేసుకోలేనని రామ కావసి తేల్చి చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఐత మత్తిలి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

also Read: ఫినాయిల్ సాయి రెడ్డి అంటూ విజయసాయి రెడ్డిపై బుద్ధ వెంకన్న ఘాటు విమర్శలు

ఈ విషయం ఆ నోటా ఈ నోటా రామ కావసి భార్య గాయత్రికి తెలిసింది. తన భర్త జైలు పాలైతే కుటుంబం పరువు పోవడంతో పాటు పిల్లల భవిష్యత్తు నాశనమవుతుందని ఆమె భయపడింది. ఈ సమస్యకు పరిష్కారంగా తన భర్తకు, ఐతకు పెళ్లి చేయాలని నిర్ణయించింది. అనుకున్నదే తడవుగా ఈ విషయాన్ని అత్తమామలకు, కుటుంబసభ్యులకు, గ్రామస్తులకు చెప్పి వారిని ఒప్పించింది.

ఒక మంచి ముహూర్తం చూసి గత గురువారం గ్రామంలోని సిద్ధి ఈశ్వర్ మందిరంలో వారి వివాహానికి స్వయంగా ఏర్పాట్లు చేసి, గ్రామస్తులను, బంధుమిత్రులను ఆహ్వానించింది. ఐత మెడలో రామ కావసి మూడు ముళ్లు వేయడంతో పోలీసులు సైతం కేసును కొట్టివేశారు. తమ కుటుంబం పరువు పోకుండా సమస్య ఇక్కడితో ముగిసిపోవడంతో గాయత్రి ఊపిరి పీల్చుకుంది. 

Also Read:బీజేపీ ‘‘మహా’’ ప్లాన్ వెనుక మాస్టర్ మైండ్ ఇతనే