తాగి వేధిస్తున్నాడని భర్తని చంపేసిన భార్య.. మూడు రోజులు ఇంటిలోనే డెడ్ బాడీ
ఒడిశాలో ఓ వ్యక్తి మద్యానికి బానిసై భార్యను వేధించాడు. వేధింపులు తాళలేక ఆమె భర్తను హతమార్చింది. మూడు రోజులపాటు డెడ్ బాడీని ఇంటిలోనే పెట్టుకుంది. నలుగురు పిల్లలతో కలిసి అదే ఇంటిలో ఉంది. ఈ ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది.

భువనేశ్వర్: ఒడిశాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ గిరిజన మహిళ తన భర్తను ఇనుప రాడ్‌తో కొట్టి చంపింది. తాగి తరచూ తనను వేధిస్తున్నాడని ఆగ్రహంతో చంపేసింది. భర్త డెడ్ బాడీని మూడు రోజులు ఇంటిలోనే ఉంచుకుని నలుగురు పిల్లలతో అదే ఇంటిలో గడిపింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరి పరిశీలించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒడిశాలోని కియొంజర్ జిల్లా కోడిపస గ్రామంలో ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది.
తూరా, సునీత జువాంగలు దంపతులు. వారికి నలుగురు పిల్లలు ఉన్నారు. తూరా మద్యానికి బానిసయ్యాడు. తాగొచ్చి ఇంటిలో రోజూ గొడవ పెట్టుకునేవాడు. భార్యను వేధించేవాడు. తీవ్రంగా దూషించేవాడు. అయితే, ఆదివారం ఆయన ప్రవర్తన శృతి మించింది. ఆయన వేధింపులను తాళలేని స్థితికి వెళ్లాయని సునీత జువాంగ పోలీసులకు తెలిపింది. అందుకే పట్టరాని కోపంతో ఓ ఇనుప రాడ్ తీసుకుని కొట్టానని ఒప్పుకుంది.
Also Read : కస్టడీలోని నిందితుడు హర్యానా పోలీసు కారుతో పరార్.. కొద్ది దూరం తర్వాత కారు వదిలాడు.. కానీ, తాళం చెవులు మాయం!
తూరా మరణించిన తర్వాత కూడా ఆ డెడ్ బాడీని ఇంటిలోనే దాచింది. నలుగురు పిల్లలతో కలిసి అదే ఇంటిలో నిందితురాలు సునీత జువాంగ జీవించిందని కియోంజర్ టౌన్ పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఇంచార్జీ సునీల్ కార్ తెలిపారు. ఈ ఘటన కు సంబంధించి కేసు నమోదు చేసినట్టు చెప్పారు.