తనకు, తన కుటుంబ సభ్యులకు కీడు చేసేందుకు భార్య చేతబడి చేస్తోందని బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారవేత్త పోలీసులను ఆశ్రయించాడు. ఈ చేతబడికి భార్య తల్లిదండ్రుల కూడా సహకరిస్తున్నారని ఆరోపించారు. దీనిపై త్వరగా విచారణ జరపాలను ఆయన పోలీసులను కోరారు.
కర్ణాటక రాజధాని బెంగళూరు పోలీసులకు ఓ విచిత్ర ఫిర్యాదు అందింది. తనకు, తన కుటుంబ సభ్యులకు హాని కలిగించేందుకు తన భార్య, ఆమె తల్లిదండ్రులను చేతబడికి పాల్పడుతున్నారని ఓ 38 ఏళ్ల వ్యాపారవేత్త ఆరోపించారు. దీనికి పలు కారణాలను కూడా పోలీసుల ముందు ఉంచారు. దీంతో కబ్బన్ పార్క్ పోలీసులు కర్ణాటక అమానవీయ దుర్మార్గపు పద్ధతులు, బ్లాక్ మ్యాజిక్ నివారణ, నిర్మూలన చట్టం, 2017 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం ప్రకారం.. చర్చ్ స్ట్రీట్ సమీపంలోని రెస్ట్ హౌస్ రోడ్‌లోని అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న సంజయ్ (పేరు మార్చాం) 2022 జూన్ 1వ తేదీన 35 ఏళ్ల డాక్టర్ కల్పన (పేరు మార్చాం)ను వివాహం చేసుకున్నాడు. అతడు వ్యాపార పనుల నిమిత్తం వేరే ప్రదేశానికి వెళ్లి ఈ ఏడాది ఫిబ్రవరి 22వ తేదీన ఇంటికి చేరుకున్నాడు. అయితే ఆ రోజు భార్య ప్రవర్తన అతడికి విచిత్రంగా కనిపించింది. ఆమె తన రెండు బొటనవేళ్లకు గాయం చేసుకొని బాత్‌రూమ్‌లో వేసిన బూడిద, కర్పూరం, కొబ్బరికాయలపై రక్తాన్ని చల్లుతుండగా గమనించాడు. అక్కడక్కడా నిమ్మకాయ ముక్కలు కనిపించడంతో పాటు బాత్‌రూమ్‌లో, ఇంటి మూలల్లో పూజలు జరుగుతున్నట్లు గుర్తించారు.
దీంతో అతడికి అనుమానం వచ్చింది. అసలేం జరుగుతోందో పరిశోధించడానికి ఒక డిటెక్టివ్ ఏజెన్సీని నియమించాడు. దీంతో ఏజెన్సీ పని మొదలుపెట్టింది. కొంత కాలం తరువాత ఆ ఏజెన్సీ షాకింగ్ రిపోర్టును అతడికి అందించింది. అందులో సంజయ్ భార్య, ఆమె తల్లిదండ్రులు అత్తిగుప్పేకు చెందిన ఓ జ్యోతిష్యుడిని, స్మశాన వాటికలో పూజాదికాలు నిర్వహించే వ్యక్తిని కలిశారని పేర్కొన్నారు.
కాగా.. జూన్ 22వ తేదీన డాక్టర్ కల్పతన తన తల్లిగారింటికి వెళ్లింది. తన అత్తగారింటికి వచ్చిన తరువాత ఇంట్లో వంట మనిషి తయారుచేసిన ఆహారంలో వివిధ నూనెలు, బూడిద, ఏవో లాలాజలం వేసింది. ఆ ఆహారాన్ని భర్త, అతడి కుటుంబ సభ్యులకు వడ్డిచ్చింది. ఆమె ప్రవర్తనతో సంజయ్ కు, తల్లిదండ్రులకు భయం వేసింది. దీంతో ఆమెను పుట్టింటికి పంపించాలని నిర్ణయించుకున్నారు. పలు కారణాలను చెబుతూ సంజయ్ తల్లి ఆమెను పుట్టింట్లో జూలై 5వ తేదీన వదిలేసి వచ్చింది.
అయితే దీనిపై సంజయ్ శనివారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తండ్రి గత కొన్ని రోజులుగా మంచం పట్టాడని, కొన్ని నెలల క్రితమే తన కుక్క చనిపోయిందని ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొననారు. చేతబడి వల్లే ఇంట్లో ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ చేపడుతామని అధికారులు తెలిపారు.
