ఉత్తర్‌ప్రదేశ్‌లో పెళ్లైన 10 రోజుల్లోనే భార్య లవర్‌తో పారిపోగా, భర్త మాత్రం హనీమూన్ కి తీసుకుని వెళ్లి చంపేయలేదు కదా అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బదౌన్ జిల్లా ఇటీవల ఒక వింత సంఘటనకు వేదికైంది. మే 17న జరిగిన వివాహం పదో రోజులు కూడా గడవక ముందే కంచికి చేరింది. సునీల్ అనే యువకుడికి అతని కుటుంబ సభ్యులు ఓ యువతిని ఇచ్చి వివాహం చేశారు. పెళ్లి తాలూకూ సాంప్రదాయాలు ముగిశాక నవ వధువు తన అత్తింట్లో తొమ్మిది రోజుల పాటు ఉంది.ఈ క్రమంలోనే వరుడు కూడా తమ హనీమూన్ కి వివిధ రకాల ప్లాన్లు వేసుకుంటూ రెడీ అవుతున్నాడు.
తొమ్మిది రోజులు కుటుంబంతో…
ఆ తొమ్మిది రోజులు కుటుంబంతో బాగానే గడిపినట్లు కనిపించిన ఆమె, పుట్టింటికి వెళ్ళిన మరుసటి రోజే అనూహ్యంగా ఎవరికీ కనిపించకుండా పోయింది.భార్య గురించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో సునీల్ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించి భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు.
పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే వధువు ఈ విషయం గురించి తెలుసుకోని ఆమెనే స్వయంగా స్టేషన్‌కు వచ్చి తనకు ఏమి జరగలేదని చెప్పింది. అసలు విషయం అక్కడే బయటపడింది. తాను ఎవరూ కిడ్నాప్ చేయలేదనీ, ప్రేమించిన యువకుడితో స్వచ్ఛందంగా వెళ్లిపోయానని చెప్పింది. ఇక మిగతా జీవితాన్ని అతనితో గడపాలనుకుంటున్నానని స్పష్టంగా ప్రకటించింది.
హనీమూన్‌కు వెళ్లాలని …
ఈ మాటలు విన్న సునీల్ షాక్‌కు గురయ్యాడు. కానీ ఆమె నిర్ణయాన్ని గౌరవించాడు. నువ్వు అతనితో సంతోషంగా ఉండాలనుకుంటే వెళ్లిపోమని పంపించేశాడు. ఈ విషయంలో మీడియాతో మాట్లాడిన సునీల్, "మేము ఇద్దరం కలిసి నైనిటాల్‌కు హనీమూన్‌కు వెళ్లాలని ప్లాన్ చేశాం. కానీ ఇప్పుడు ఆమె లవర్‌తో వెళ్లిపోయింది. అయినా సరే, నేను బతికిపోయాననేందుకు చాలా అదృష్టవంతుడిని," అని చెప్పాడు. ఇదే విషయాన్ని చెప్తూ, ఇటీవల మెఘాలయలో జరిగిన హనీమూన్ మర్డర్ ఘటనను గుర్తు చేశాడు. తన భార్యకు తనపై ఆసక్తి లేకపోయినప్పటికీ చంపేయకుండా నేరుగా వెళ్లిపోయిందని, అది తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపాడు.
ఈ ఘటనతో సంబంధిత రెండు కుటుంబాలు మొదట ఆశ్చర్యానికి గురయ్యాయి. కానీ అనంతరం పరస్పరంగా పరస్పర అంగీకారంతో మామూలుగానే సమస్యను పరిష్కరించుకున్నాయి. పెళ్లి సమయంలో వరుడి ఇంటి వారు ఇచ్చిన నగలు, బహుమతులన్నీ కూడా వధువు తరపు వారు తిరిగి ఇచ్చారు. ఎలాంటి వివాదాలు లేకుండా పోలీసుల సమక్షంలో ఈ బంధం ముగిసిపోయింది. దీంతో ఈ వ్యవహారం అక్కడితో ముగిసింది.
ఒకవైపు ఈ యువతిని తిట్టేవారు ఉన్నా, మరోవైపు ఆమె ముందుగానే వెళ్లిపోయినందుకు ఇది మంచి పని అయ్యిందన్న అభిప్రాయాలు కూడా వినిపించాయి. ఎందుకంటే ఆమె తన భావాలను చెప్పకుండా ఉంటే, భవిష్యత్‌లో మేఘాలయ ఘటన లాగా మరో మర్డర్ జరగేదని కొందరు భావిస్తున్నారు.
ఇటీవలి కాలంలో పెళ్లి తర్వాత భార్యలు భర్తలను చంపుతున్న ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. కొంతకాలం క్రితం జరిగిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు ఇంకా ప్రజల మనసుల్లో నుంచి తొలగిపోలేదు. ఆ కేసులో భార్య తన ప్రియుడితో కలిసి భర్తను చంపించిందని పోలీసులు గుర్తించారు. ఇదే తరహాలో ఛత్తీస్‌గఢ్‌లో మరో యువతి భర్తను విషం ఇచ్చి చంపిన ఘటన జరిగిన సంగతి తెలిసిందే.
చంపేయకుండా, ప్రేమించిన వాడితో…
ఇలాంటి సందర్భాలలో ఈ బదౌన్ ఘటన కొంత భిన్నంగా నిలిచింది. ఇక్కడ భార్య చంపేయకుండా, ప్రేమించిన వాడితో పారిపోయిందని మాత్రమే బయటపడింది. భర్త కూడా పెద్ద మనసుతో ఆమె నిర్ణయాన్ని గౌరవించి పంపించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఇటువంటి సంఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో, ప్రేమ, నమ్మకం, సంబంధాలపై ప్రజల్లో ఆత్మ పరిశీలన జరగాల్సిన అవసరం ఉందని మానసిక నిపుణలు అంటున్నారు.
మేఘాలయా సంఘటనలో ఏం జరిగిందంటే..
మేఘాలయలో అదృశ్యమైన ఇండోర్ జంట కేసు తెరపైకి కొత్త నిజాలు వెలుగులోకి వచ్చాయి. మే 11న వివాహం చేసుకున్న రాజా రఘువంశీ, సోనమ్ అనే దంపతులు మే 20న హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు. మే 22న వారు మౌలాకియాత్ గ్రామానికి బైక్‌పై వెళ్లినట్లు అక్కడి అధికారులు తెలిపారు. అక్కడ బైక్‌ను పార్క్ చేసి ప్రసిద్ధ లివింగ్ రూట్ వంతెన చూడటానికి వెళ్లిన తరువాత నుంచి వారు కన్పించలేదు.
అదృశ్యమైన 11 రోజుల తరువాత, జూన్ మొదటివారంలో రఘువంశీ మృతదేహం సోహ్రా వద్ద ఓ లోతైన లోయలో లభ్యమైంది. అతడి శరీరంపై తీవ్ర గాయాలు ఉండటంతో ఇది మర్డర్ కేసుగా పోలీసులు భావించారు. అదే సమయంలో అతడి భార్య సోనమ్ కనిపించకపోవడం అనుమానాలకు దారి తీసింది.
దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు, సోనమ్ ఉత్తరప్రదేశ్‌లోని గాజీపుర్‌లో లొంగిపోవడంతో ఆమెను అరెస్టు చేశారు. ఆమె విచారణలో రఘువంశీని చంపేందుకు తానే సుపారీ ఇచ్చినట్టు అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. రాజ్ కుశ్వాహ అనే వ్యక్తితో తనకు సంబంధం ఉండడం వల్లే ఈ మర్డర్ చేయించినట్లు తెలిసింది.ఆమెతో పాటు ఈ మర్డర్లో పాల్గొన్న మరో ముగ్గురిని కూడా అరెస్టు చేశారు.
పోలీసుల ప్రాథమికంగా వెల్లడించిన సమాచారం ప్రకారం, సోనమ్ తన భర్తను చంపించేందుకు కాంట్రాక్ట్ కిల్లర్లను నియమించింది. ప్రస్తుతం ఈ కేసులో ఇంకా ఇతర వ్యక్తులు కూడా ప్రమేయం ఉన్నట్టు అనుమానించడంతో దర్యాప్తు కొనసాగుతోంది.ఈ కేసుపై స్పందించిన మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా, పోలీస్ శాఖను ప్రశంసించారు. త్వరితగతిన కేసును ఛేదించినందుకు పోలీసులను అభినందించారు. కేసులో ఇంకా నిందితులు ఉండొచ్చని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయని చెప్పారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రాజ్ కుశ్యాహా మృతుడు రఘువంశీ అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నాడని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మర్డర్ కేసులో మృతుడి భార్య సోనమ్‌తో సహా మరో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ క్రమంలో రఘువంశీ అంత్యక్రియల్లో కుశ్యాహా కూడా పాల్గొన్న వీడియోను మృతుడి సోదరి ఒకరు సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. రఘువంశీ మృతదేహం దొరికిన తర్వాత దాన్ని ఇండోర్‌కు తరలించేందుకు తాము నాలుగు వాహనాలను ఏర్పాటుచేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అందులో ఒక దాన్ని నిందితుడు నడిపినట్లు తెలిపారు. సోనమ్ తండ్రిని కూడా అతడు ఓదార్చినట్లు చెప్పారు. అరెస్టు తర్వాతనే అతడి గురించి తమకు తెలిసిందన్నారు. ఈ మర్డర్ లో తన ప్రమేయం ఉందనే విషయం బయటపడకుండా ఉండేందుకే కుశ్యాహా రఘువంశీ కుటుంబానికి విధేయుడిలా నటించినట్లు తెలుస్తోంది.
సీసీటీవీ ఫుటేజ్…
అయితే పోలీసుల విచారణలో సోనమ్ సీసీటీవీ ఫుటేజ్ బయటపడింది. అందులో ఆమె నిందితులతో మాట్లాడుతున్న దృశ్యాలు ఉన్నట్లు తేలింది. తర్వాత CDR, కాల్ ట్రేసింగ్ ఆధారంగా రాజ్ కుశ్వాహా అక్కడ ఉన్నట్లు తెలిసింది. అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే సోనమ్ తన ‘గేమ్’ ముగిసిందని అర్థం చేసుకుని, ఉత్తరప్రదేశ్‌లోని ఓ ఢాబాలోకి వెళ్లి లొంగిపోయింది.
చంపేయడానికి కుట్ర పన్నిన రాజ్ కుశ్వాహానే, రాజా అంత్యక్రియలో స్వయంగా పాల్గొని తతంగం జరిపించాడు. మృతుడి మామ దవీ సింగ్ ను ఓదారుస్తూ ఉండటం వీడియోల్లో కనిపించింది. ఇందులో అతడు తీవ్ర భావోద్వేగంలో ఉన్నట్లు కనిపించింది.
