ఇటీవలి కాలంలో చిన్న చిన్న కారణాలకే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడం.. అవి చివరికి విడాకులకు దారి తీయడం నిత్యకృత్యమయ్యాయి. తాజాగా తనను మద్యం తాగొద్దన్నందుకు భర్తతో తాను కాపురం చేయలేనంటూ భార్య నానా రాద్ధాంతం చేసింది.

వివరాల్లోకి వెళితే.. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ నిర్ణయ్ నగర్‌కు చెందిన ఓ వ్యక్తికి 2018లో మాధాపూరాకు చెందిన ఓ యువతితో పెళ్లయ్యింది. వివాహం తర్వాత కొత్తజంట తమ స్నేహితులతో కలిసి ఇండోనేషియాలోని బాలీ ద్వీపానికి హానీమూన్‌కు వెళ్లింది.

అక్కడ భర్తతో మద్యం తాగుదామని చెప్పింది. దీనికి భర్త నిరాకరించాడు. అంతే భార్య కోపం కట్టలు తెంచుకుంది. వారున్న హోటల్‌ గది తలుపులు బాదింది. అందరినీ పిలిచి తన భర్త తనను మద్యం తాగనివ్వడం లేదని.. ఇలా అయితే జీవితం సజావుగా సాగదని ఆవేదన వ్యక్తం చేసింది.

తనకు విడాకులు కావాలని డిమాండ్ చేసింది. హానీమూన్ నుంచి భారత్ తిరిగి వచ్చిన తర్వాత ఆమె తన సామానుతో పుట్టింటికి వెళ్లిపోయింది. అనంతరం భర్త నుంచి విడాకులు కోరుతూ రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.

డబ్బులు ఇవ్వని పక్షంలో తనపై తప్పుడు కేసులు పెడతానంటూ తన భార్య బెదిరింపులకు దిగుతోందని... బాధితుడు పోలీసులను ఆశ్రయించాలని భావిస్తున్నాడు.