రాష్ట్రపతి ఎన్నికల్లో ఈ సారి ఎంపీ ఓటు విలువ తగ్గిపోయినట్టు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. 708 నుంచి 700కు పడిపోయినట్టుగా వివరించింది. దీనికి జమ్ము కశ్మీర్ కారణంగా ఉన్నది. ఇంతకీ ఎంపీ ఓటు విలువను ఎలా లెక్కిస్తారు? ఎంపీ ఓటు విలువ తగ్గిపోవడానికి జమ్ము కశ్మీర్ ఎలా కారణం అయింది?

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలోకి దిగారు. ఈ ఎన్నిక జులై 18వ తేదీన జరగనుంది. కౌంటింగ్ అవసరం పడితే.. జులై 21వ తేదీన జరుగుతుంది. ఈ మేరకు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ ప్రకటనలో మరో విషయాన్నీ గుర్తు చేసింది. ఈ ఏడాది ఎంపీల ఓటు విలువ తగ్గిపోతుందని వివరించింది. ఎంపీల ఓటు విలువ 708 నుంచి ఇప్పుడు 700గా ఉంటుందని తెలిపింది. అయితే, ఈ తగ్గింపునకు కారణం జమ్ము కశ్మీర్. ఎంపీ ఓటు విలువను ఎలా లెక్కిస్తారు? జమ్ము కశ్మీర్ ఎందుకు కారణమో చూద్దాం.

రాష్ట్రపతి ఎన్నిక ఎలక్టోరల్ కాలేజీలో లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు, అన్ని రాష్ట్రాలు, యూటీల అసెంబ్లీ సభ్యులు ఉంటారు. నామినేట్ చేసిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇందులో ఉండరు. అంటే, వీరు రాష్ట్రపతి ఎన్నికలో ఓటేసే అర్హత ఉండదు.

ఎంపీ ఓటు విలువ ఎలా లెక్కిస్తారు?
లోక్‌సభ, రాజ్యసభలలో 543 మంది, 233 మంది ఎన్నికైన ఎంపీలు ఉంటారు. భారత రాజ్యంగంలోని ఆర్టికల్ 55 ప్రకారం, ఎంపీ ఓటు విలువను లెక్కిస్తారు. దీని ప్రకారం, అన్ని రాష్ట్రాలు, యూటీల అసెంబ్లీ ఎమ్మెల్యేల ఓటు విలువల మొత్తాన్ని ఎన్నికైన ఎంపీల సంఖ్యతో భాగిస్తే.. వచ్చే విలువనే ఎంపీ ఓటు విలువగా నిర్ణయిస్తారు.

అంటే.. ఎంపీ ఓటు విలువ = మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య/ ఎన్నికైన మొత్తం ఎంపీల సంఖ్య

జమ్ము కశ్మీర్ ఫ్యాక్టర్
2019లో కేంద్ర ప్రభుత్వం జమ్ము కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని తొలగిస్తూ ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఇప్పటి వరకు అక్కడ మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగలేదు. ముందుగా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేసి.. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్రం తెలిపింది. త్వరలోనే ఇక్కడ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి.

జమ్ము కశ్మీర్ అసెంబ్లీ రద్దు కావడం మూలంగా.. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలు లేరు. దీంతో ఎంపీల ఓటు తగ్గిపోతున్నది. 

అయితే, మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత ఈ ఓటు విలువ యథాతథం అవుతుంది.