:డీఎంకె చీఫ్ కరుణానిధి ఎప్పుడూ తన మెడలో పసుపుపచ్చ కండువాతో కన్పించేవారు. డీఎంకె నిర్వహించే ప్రతి బహిరంగ సభ వేదికలోనూ ఆ పార్టీ కార్యక్రమాల్లో పసుపుపచ్చ రంగును తప్పకుండా ఉపయోగిస్తారు
చెన్నై:డీఎంకె చీఫ్ కరుణానిధి ఎప్పుడూ తన మెడలో పసుపుపచ్చ కండువాతో కన్పించేవారు. డీఎంకె నిర్వహించే ప్రతి బహిరంగ సభ వేదికలోనూ ఆ పార్టీ కార్యక్రమాల్లో పసుపుపచ్చ రంగును తప్పకుండా ఉపయోగిస్తారు. ఇక అన్నాడీఎంకె అధినేత్రి జయలలిత ఆకుపచ్చరంగును ఇష్టపడతారు. అన్నాడీఎంకె పార్టీ కార్యక్రమాల్లో ఆకుపచ్చకు పెద్దపీట వేస్తారు.
డీఎంకె చీఫ్ కరుణానిధి నాస్తికవాదాన్ని విశ్వసిస్తారు. నాస్తికవాదాన్ని, సనాతన ఆచారాలకు వ్యతిరేకంగా ఆయన పోరాటం చేశారు. కరుణానిధితో పాటు ఆయన కుటుంబసభ్యులు కూడ దేవాలయాల చుట్టూ తిరగరు. అయితే తొలుత తెల్ల కండువా, తెల్లచొక్కాను ధరించే కరుణానిధి ఆ తర్వాత పసుపు కండువాను ఉపయోగించడం ప్రారంభించారు.
15 ఏళ్ళ క్రితం డీఎంకె బీజేపీతో పొత్తు పెట్టుకొన్న సమయంలో తెల్ల కండువాకు బదులుగా కరుణానిధి పసుపు పచ్చ కండువాను వేసుకొని సభల్లో పాల్గొన్నారు. పసుపు రంగు కండువాను ఉపయోగించడానికి గల కారణాలపై ఆయన విచిత్రమైన సమాధానం చెప్పారు. పసుపు రంగు వస్త్రం ధరిస్తే మెడ చుట్టూ కాస్త వేడిగా ఉండి చురుకుదనం కలిగిస్తుందంటూ సరైన సమాధానం ఇవ్వకుండా సమాధానాన్ని దాటవేశారు. అప్పటి నుండి ఆయన పసుపుపచ్చ రంగు కండువానే ఉపయోగిస్తారు. దీని వెనుక జ్యొతిష్యుల సూచనలు ఉన్నాయని అప్పట్లో మీడియాలో ప్రచారం సాగింది. అయితే నాస్తికవాదాన్ని విశ్వసించే కరుణానిధి ఎందుకు ఈ మాటలను విశ్వసిస్తారని కొట్టిపారేసేవారు కూడ లేకపోలేదు.
మరోవైపు అన్నాడీఎంకె అధినేత్రి జయలలిత ఆకుపచ్చ రంగును ఇష్టపడతారు. అన్నాడీఎంకె నిర్వహించే కార్యక్రమాల్లో ఆకుపచ్చ రంగు కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది. ఆకుపచ్చ రంగు ఐశ్వర్యానికి గుర్తుగా ఉంటుందని అన్నాడీఎంకె నేతలు చెబుతుంటారు.
పసుపు శుభసూచకంగా ఉన్నందున డీఎంకె నేత కరుణానిధి పసుపు కండువాను ఉపయోగిస్తారని చెబుతుంటారు. తమిళనాడులో ద్రవిడ పార్టీల్లో కీలకంగా ఉన్న ఇద్దరు నేతలు ప్రస్తుతం భౌతికంగా లేకపోయినా... బతికకున్నా సమయంలో వారు తమిళ రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు.
