New Delhi: శ్రీరామ న‌వ‌మి నేప‌థ్యంలో బెంగాల్, బీహార్ లోని ప‌లు ప్రాంతాల్లో హింసాత్మ‌క ఘ‌ట‌న‌లో చోటుచేసుకున్నాయి. అయితే, పశ్చిమ బెంగాల్, బిహార్ హింసాకాండపై ప్రధాని న‌రేంద్రం మోడీ ఎందుకు మౌనంగా ఉన్నార‌ని కపిల్ సిబల్ ప్రశ్నించారు. 

Bengal, Bihar Violence: పశ్చిమ బెంగాల్, బీహార్ లో జరిగిన హింసాకాండపై ప్రధాని మోడీ మౌనం వహించడాన్ని రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ ప్రశ్నించారు. బెంగాల్, బిహార్ లను తగలబెట్టడం, విద్వేష బీజాలు నాట‌డం వంటి అంశాల ఆపాల‌నీ, ప్ర‌జలు వీటికి దూరంగా ఉండాల‌ని కోరారు. ఈ చ‌ర్య‌లు కేవ‌లం రాజకీయ నాయకులకు, రాజకీయ సిద్ధాంతాలకు మాత్రమే ప్రయోజనం చేకూర్చేలా ఉంటాయ‌ని హెచ్చ‌రించారు.

ప్ర‌ధాని ఈ అంశంపై మాట్లాడాలి.. 

ప్రధాని న‌రేంద్ర మోడీ ప‌శ్చిమ బెంగాల్, బీహార్ ల‌లో చోటుచేసుకుంటున్న హింస‌పై మాట్లాడాలని తాను కోరుకుంటున్న‌ట్టు క‌పిల్ సిబాల్ పేర్కొన్నారు. సామాన్యులు ఈ ద్వేషానికి బలైపోతున్నార‌ని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. "ప్రధాని (మోడీ) మాట్లాడాలని, హోంమంత్రి (షా) మాట్లాడాలని, హింసను ఖండించాలని నేను కోరుకుంటున్నాను. ఇంత జరుగుతున్నా వారిద్దరూ మాట్లాడకపోవడం దురదృష్టకరం.. వారు ఎందుకు మౌనంగా ఉంటున్నారు.." అని ప్ర‌శ్నించారు. 

2024 ఎన్నిక‌ల‌ కోస‌మే ఇది కాకూడ‌దు.. 

రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల క్ర‌మంలో రాజ‌కీయ పార్టీల కోసమే జ‌రిగే అంశ‌మ‌నే అనుమానాల‌ను సైతం వ్య‌క్తం చేస్తూ ఆందోళ‌న వ్య‌క్తంచేశారు. "ఉన్మాదానికి కారణమైన ఒక నిర్దిష్ట పార్టీ గురించి కాకపోవచ్చు. సృష్టిస్తున్న వాతావరణానికి దూరంగా దేశం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఇందుకు 2024 ఎన్నిక‌లు కారణం కాకూడదు' అని ఆయ‌న వ్యాఖ్యానించారు. చట్టబద్ధమైన‌ పాలన సాగేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని పేర్కొన్నారు. బీహార్ లో మతఘర్షణల ఘటనలపై హోంమంత్రి అమిత్ షా ఆదివారం ఆందోళన వ్యక్తం చేశారని, గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ తో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే, కేవ‌లం ఆందోళన వ్యక్తం చేస్తే సరిపోదని కపిల్ సిబల్ అన్నారు.

శ్రీరామ న‌వ‌మి క్ర‌మంలో మతఘర్షణలు..

శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా ససారం, బిహార్ షరీఫ్ పట్టణాల్లో మతఘర్షణలు చెలరేగిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ససారం, బీహార్ షరీఫ్ లలో జరిగిన మత ఘర్షణలకు సంబంధించి పోలీసులు శనివారం వరకు 100 మందికి పైగా అరెస్టు చేశారు. రెండు పట్టణాల్లో జరిగిన అల్లర్లలో వాహనాలు, ఇళ్లు, దుకాణాలు దగ్ధం కాగా, పలువురు గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్లోని హౌరాలోని షిబ్పూర్, కాజీపరా ప్రాంతాల్లో కూడా శ్రీరామనవమి ఊరేగింపు సందర్భంగా ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

యూపీఏ ఫ‌స్ట్, సెంకండ్ ప్రభుత్వాల హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన కపిల్ సిబల్ గత ఏడాది మేలో కాంగ్రెస్ ను వీడి సమాజ్ వాదీ పార్టీ మద్దతుతో స్వతంత్ర సభ్యుడిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే లక్ష్యంతో ఆయన ఇటీవల 'ఇన్సాఫ్' అనే నాన్ ఎలక్టోరల్ ప్లాట్ఫామ్ ను కూడా ప్రారంభించారు.