Asianet News TeluguAsianet News Telugu

ముషారఫ్‌ అంటే అసహ్యమైతే బీజేపీ ప్రభుత్వం 2004లో ఆ ఒప్పందంపై సంతకం ఎందుకు చేసింది ? - శశి థరూర్

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడి మరణానికి సంతాపం తెలుపుతూ కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ చేసిన ట్వీట్ పై బీజేపీ మండిపడిన నేపథ్యంలో సోమవారం ఆయన స్పందించారు. పర్వేజ్ ముషారఫ్ అంటే అసహ్యం అయితే బీజేపీ 2003లో ఆయనతో కాల్పుల విరమణ చర్చలు ఎందుకు జరిపిందని, 2004లో ఒప్పందం ఎందుకు చేసుకుందని ప్రశ్నించారు. 

Why did the BJP government sign the agreement in 2004 if Musharraf is abominable? - Shashi Tharoor
Author
First Published Feb 6, 2023, 4:44 PM IST

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, మాజీ ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషారఫ్ మృతిపై కాంగ్రెస్ నేత, ఎంపీ శశిథరూర్ ట్వీట్ పై ఆదివారం బీజేపీ విరుచుకుపడింది. అయితే దీనిపై తాజాగా థరూర్ స్పందించారు. పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు దేశభక్తులైన భారతీయులందరికీ అసహ్యమైతే అప్పటి బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం 2003లో అతడితో కాల్పుల విరమణ చర్చలు జరిపి 2004 లో సంయుక్త ప్రకటనపై ఎందుకు సంతకం చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ సోమవారం ప్రశ్నించారు.

టర్కీకి భారత్ నుంచి ఎన్‌డీఆర్ఎఫ్ టీమ్‌లు, వైద్య బృందాలు: వెల్లడించిన ప్రధాని కార్యాలయం

కాంగ్రెస్‌ను ‘‘పాకిస్తాన్ పరస్తీ (ఆరాధన)’’ అని పలువురు బీజేపీ నాయకులు ఆరోపించిన తర్వాత థరూర్ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతల విమర్శలపై ఘాటుగా స్పందిస్తూ.. ‘‘బీజేపీ నాయకులకు నోరు మెదపని ప్రశ్న : దేశభక్తులైన భారతీయులందరికీ ముషారఫ్ అసహ్యంగా కనిపిస్తే బీజేపీ ప్రభుత్వం 2003లో ఆయనతో కాల్పుల విరమణ ఒప్పందంపై ఎందుకు చర్చలు జరిపి 2004 నాటి వాజ్ పేయి-ముషారఫ్ ఉమ్మడి ప్రకటనపై సంతకం చేసింది?. అప్పుడు ఆయనను విశ్వసనీయమైన శాంతి భాగస్వామిగా చూడలేదా ’’ అని ఆయన ప్రశ్నించారు.

అసలేం జరిగిందంటే ? 
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ అనారోగ్యంతో బాధపడుతూ దుబాయ్‌లో 79 ఏళ్ల వయసులో ఆదివారం కన్నుమూశారు. అయితే ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతూ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో “పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ అరుదైన వ్యాధితో మరణించారు. అతడు ఒకప్పుడు భారతదేశానికి బద్ధ శత్రువు. కానీ అతడు 2002-2007లో శాంతి కోసం నిజమైన శక్తిగా ఉద్భవించాడు. ఆ రోజుల్లో నేను ప్రతీ సంవత్సరం ఐక్యరాజ్యసమితిలో అతడిని కలిసేవాడిని. నేను అతడి వ్యూహాత్మక ఆలోచనలో తెలివి ఉన్నట్టు  స్పష్టంగా గుర్తించాను. ఆర్ఐపీ’’ అని పేర్కొన్నారు.

ఈ ట్వీట్ పై బీజేపీ మండిపడింది. ఆయనను టార్గెట్ చేసింది. బీజేపీ అధికార ప్రతినిధి షాజాద్ పూనావాలా మాట్లాడుతూ.. శశి థరూర్ ను పాకిస్తాన్ సానుభూతిపరుడని అన్నారు. పర్వేజ్ ముషారఫ్ కార్గిల్ యుద్ధానికి రూపశిల్పి అని, నియంత అని, క్రూరమైన నేరాలకు పాల్పడ్డారని ఆయన ట్వీట్ చేశారు. “తాలిబాన్, ఒసామాలను సోదరులు, హీరోలుగా భావించిన వారిని - చనిపోయిన సొంత సైనికుల మృతదేహాలను తిరిగి తీసుకోవడానికి నిరాకరించిన వారిని కాంగ్రెస్ స్వాగతిస్తోంది! కాంగ్రెస్‌లో పాక్‌వాదం మళ్లీ కనిపించింది’’ అని ఆయన ట్వీట్ చేశారు.

మరో ట్వీట్‌లో “ ఒకప్పుడు ముషారఫ్ రాహుల్ గాంధీని పెద్దమనిషి అని కొనియాడారు. బహుశా కాంగ్రెస్ ముషారఫ్‌ను ఇష్టపడుతోందా ? ఆర్టికల్ 370 నుంచి సర్జికల్ స్ట్రైక్ వరకు, బాలాకోట్‌ను అనుమానించిన కాంగ్రెస్ పాక్ లైన్‌ను ప్రతిధ్వనించింది. ముషారఫ్‌ను అభినందించింది. కానీ మన సొంత చీఫ్ ను 'సడక్ కా గుండా' అని పిలిచింది. ఇది కాంగ్రెస్!’’ అని ఆయన పేర్కొన్నారు. అయితే బీజేపీ ఆదివారం చేసిన ఈ ఆరోపణలకు తాజాగా శశి థరూర్ ఈ విధంగా స్పందించారు.

Follow Us:
Download App:
  • android
  • ios