భారతదేశంలో కోవిడ్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజుకు నాలుగు లక్షల కేసులతో పాటు నాలుగు వేలమందికి పైగా మరణిస్తున్నారు. దీంతో దేశ ప్రజలు వణికిపోతున్నారు. వైరస్‌ను కంట్రోల్ చేయడానికి పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌, నైట్ కర్ఫ్యూ వంటివి విధిస్తున్నారు. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రయోజనం మాత్రం వుండటం లేదు. ఈ నేపథ్యంలో మరోసారి దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించాలన్న డిమాండ్ ఊపందుకుంది. 

అయితే వైరస్‌కు సంబంధించి పలు రకాల వేరియంట్ల కారణంగానే అవి వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.  భారత్‌లోనూ ప్రస్తుతం అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఓ ప్రమాదకరమైన వేరియంట్ ఉందని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్, భారత సంతతికి చెందిన సౌమ్య స్వామినాథ‌న్‌ అభిప్రాయపడ్డారు. దీని కారణంగానే  ఇండియాలో క‌రోనా సెకండ్‌ వేవ్‌ ఈ స్థాయిలో విజృంభిస్తోందని ఆమె చెబుతున్నారు.

ఈ వేరియంట్ వ్యాక్సిన్ల‌నూ బోల్తా కొట్టించే సామర్ధ్యం వుందని..ఓ ఇంట‌ర్వ్యూలో ఆమె ఈ విష‌యాల‌ను వెల్ల‌డించారు. క‌రోనాకు చెందిన‌ B.1.617 వేరియంటే ఈ విప‌త్తుకు కార‌ణ‌మ‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. దీనిని తొలిసారి భారత్‌లోనే గ‌తేడాది అక్టోబ‌ర్‌లో గుర్తించారు. దీనిని ఒక ప్ర‌త్యేక‌మైన వేరియంట్‌గా డ‌బ్ల్యూహెచ్‌వో కూడా ఈ మ‌ధ్య జాబితాలో చేర్చింది. 

Also Read:ఇండియాలో కరోనాది అదే జోరు: వరుసగా నాలుగో రోజు 4 లక్షలు దాటిన కరోనా కేసులు

ఇప్ప‌టి వ‌ర‌కూ క‌రోనా వ్యాప్తికి కారణమైన పలు రకాల వేరియంట్లను గుర్తించామని, ఇదీ కూడా అందులో ఒక‌ట‌ని సౌమ్య వెల్లడించారు. స‌హ‌జంగా లేదా వ్యాక్సిన్ల ద్వారా వ‌చ్చిన‌ యాంటీబాడీల‌ను కూడా తట్టుకునే కొన్ని మ్యుటేష‌న్లు ఈ B 1.617 వేరియంట్‌లో ఉన్నాయ‌ని సౌమ్య స్వామినాథ‌న్ పేర్కొన్నారు.

అందుకే ఈ వేరియంట్‌ వ్యాప్తి విషయంలో ఆందోళ‌న పడాల్సిన అవసరం ఉందని ఆమె హెచ్చరించారు. అయితే ఈ వేరియంట్‌దే మొత్తం బాధ్య‌త అని చెప్ప‌లేమ‌ని, క‌రోనా వ్యాప్తి తగ్గినా.. ప్రజలు బాధ్య‌తార‌హితంగా బయట తిరగడం, సామాజిక దూరాన్ని పాటించకపోవడం వంటి చర్యలను పాటించకపోవడం వల్లే భారత్‌లో ఈ పరిస్ధితి వచ్చిందని సౌమ్య అన్నారు.