ప్రతిపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్ అల్వా ఎంపికయ్యారు. కర్ణాటకకు చెందిన ఈ నేత గురించి ఐదు కీలక విషయాలను తెలుసుకుందాం. అంతేకాదు, ఈమెకు ప్రత్యర్థి, ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధన్‌కర్‌కూ కొన్ని సారూప్యతలు ఉన్నాయి.  

న్యూఢిల్లీ: ప్రతిపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్ అల్వా ఎంపికయ్యారు. 17 ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు ఆమెను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. వచ్చే నెల 6వ తేదీన ఉప రాష్ట్రపతి ఎన్నిక జరుగుతంది. విపక్ష నేతలు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నివాసంలో భేటీ అయ్యారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా 80 ఏళ్ల మార్గరెట్ అల్వాను బరిలోకి దించుతున్నట్టు పవార్ వెల్లడించారు. తనను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ మార్గరెట్ అల్వా కూడా ఈ ఎంపికను ధ్రువీకరించారు. 

ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే ఇప్పటికే జగదీప్ ధన్‌కర్‌ను ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఉప రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించుకునే మెజార్టీ ఎన్డీయేకు ఉన్నది. తాజాగా, ప్రతిపక్షాలు తమ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్ అల్వాను ప్రకటించాయి. ఇంతకు ఈ మార్గరెట్ అల్వా ఎవరు? ఆమె నేపథ్యం ఏమిటి? అనే విషయాలపై ఆసక్తి నెలకొంది. ఆమె గురించి ఐదు కీలక విషయాలు తెలుసుకుందాం.

1. 1942 ఏప్రిల్ 14వ తేదీన మంగళూరులో జన్మించిన మార్గరెట్ అల్వా బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజీ నుంచి బీఏ, ప్రభుత్వ లా కాలేజీ నుంచి ఎల్ఎల్‌బీ పట్టా పొందారు. 1964లో నిరంజన్ అల్వాను పెళ్లి చేసుకున్న ఆమె కూతురు, ముగ్గురు కుమారులకు జన్మనిచ్చారు.

2. నాలుగు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1999లో ఒకసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 

3. 42 ఏళ్ల వయసులో ఆమె కేంద్ర మంత్రిగా సేవలు అందించారు. రాజీవ్ గాంధీ, పీవీ నరసింహా రావు హయాంలో ఆమె కేంద్ర మంత్రిగా చేశారు.

4. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, యువజన వ్యవహారాల శాఖలకు ఆమె బాధ్యతలు చేపట్టారు.

5. గోవా, రాజస్తాన్, గుజరాత్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలకు ఆమె గవర్నర్‌గా సేవలు అందించారు.

ప్రత్యర్థి జగదీప్ ధన్‌కర్‌తో ఆమెకు కొన్ని సారుప్యతలూ ఉన్నాయి. అవేంటో చూద్దాం.

1. ఇరువురూ గవర్నర్‌లుగా, కేంద్ర మంత్రులుగా చేశారు. ఇద్దరికీ కాంగ్రెస్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నది.

2. ఇద్దరికీ లా డిగ్రీ ఉన్నది. ఇరువురూ లోక్‌సభ, రాజ్యసభల్లో అనుభవం ఉన్న వారు.