కేరళ నరబలి కేసులో ప్రధాన నిందితుడు, ఘటనకు సూత్రధారి మహమ్మద్ షఫీ గురించి పోలీసులు సంచలన విషయాలు చెప్పారు. షఫీ లైంగిక ఉన్మత్తుడని, హింసతో ఆనందపడే సైకో అని వివరించారు. ఎలాంటి కథలైనా అల్లి ఎదుటి వారిని ట్రాప్ చేస్తాడని తెలిపారు. 

తిరువనంతపురం: కేరళలో నరబలి దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నరబలి కేసులు ఇద్దరు దంపతులు, మహమ్మద్ షఫీ అనే ‘మాంత్రగాడు’పై కేసు నమోదైంది. ఈ మహమ్మద్ షఫీనే నరబలికి మాస్టర్ మైండ్. దంపతుల మూఢ విశ్వాసాలను ఆసరాగా తీసుకుని తన కామేచ్ఛను తీర్చుకోవడంతోపాటు హింసలో ఆనందాన్ని వెతుక్కున్నాడు. ఆ మూఢత్వం ఆధారంగానే దంపతుల నుంచి డబ్బూ పొందాడు. నరబలి కేసులో ప్రధాన నిందితుడైన మహమ్మద్ షఫీ గురించి పోలీసులు ఏమంటున్నారు? ఆయన ఎలాంటి ప్రవృత్తి కలవాడో చూద్దాం.

నిజానికి ఆ దంపతులు అతి సామాన్యంగా కనిపించే వారే. కానీ, బయటకు కనపడని వారి విశ్వాసాలు మూఢత్వంలో పాతాళంలోకి జారిపోయాయి. వారి ఇరుగుపొరుగు కూడా ఈ దారుణాన్ని చూసి నమ్మలేకపోతున్నారు. భగవాల్ తండ్రి నుంచి అందిపుచ్చుకున్న సాంప్రదాయ మసాజ్ వృత్తితోనే జీవిస్తున్నారని, కానీ, వారు ఇంతటి దారుణానికి తెగబడతారని ఊహించలేదని తెలిపారు. కానీ, ఈ నరబలి ఘటనకు సూత్రధారి మహమ్మద్ షఫీ నేపథ్యం ఇందుకు విరుద్ధమైనది.

Also Read: నరబలికి ముందు రేప్.. భర్త కళ్లెదుటే భార్యపై షఫీ అత్యాచారం?

మహమ్మద్ షఫీపై 2006 నుంచి 2020 కాలంలో చాలా కేసులు ఉన్నాయి. ఆయన ఒక సైకోటిక్ డిజార్డర్ గల మనిషి. ఆయన చర్యలు అన్నీ దాన్ని ధ్రువీకరిస్తాయి. షఫీ లైంగిక విపరీత ధోరణి కలవాడని, హింసతో సంతృప్తి పొందే మనిషి అని కొచ్చి పోలీసు చీఫ్ సీహెచ్ నాగరాజు తెలిపారు. మహిళలపై అనేక రీతుల్లో ఉన్మాదరీతిలో లైంగిక చర్యలు చేశాడని, ఇలాంటి బలుల కోసమే పలువురికి మహిళలను సప్లై చేశారని కూడా వివరించారు. 

నరబలులకు సంబంధించినవి కాకుండా 8 కేసులు ఆయనపై ఉన్నాయని కొచ్చి డీసీపీ చెప్పారు.

Also Read: కేరళ నరబలి కేసు: ఇద్దరు మహిళలను ఏ విధంగా బలి ఇచ్చారు? ఎందుకు చేశారు?

షఫీ లైంగిక ఉన్మాది అని, సైకో కిల్లర్ అని నాగరాజు వివరించారు. స్కూల్ డ్రాపౌట్ అయిన షఫీ హింసతో ఆనందాన్ని వెతికే సైకో అని తెలిపారు. గతంలోనూ మహిళపై లైంగికదాడి ప్రయత్నించాడని వివరించారు. 75 ఏళ్ల మహిళపై అత్యాచారం, హత్యా ప్రయత్నం కింద కేసు నమోదైంది. ఇతరులకు హానీ తలపెట్టడం, చంపేయడమైనా సరే.. ఈ హింసంటే చాలా ఇష్టపడే మనస్తత్వం షఫీది అని వివరించారు. ఆయన ఎలాంటి కథలైనా అల్లగలడు.. ఎవరినైనా ట్రాప్ చేయగలడు అని తెలిపారు.