హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కమిటీని రద్దు చేస్తూ సుప్రీంకోర్ట్ సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అనంతరం ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఇకపై హెచ్‌సీఏ వ్యవహారాలను కమిటీ చూసుకుంటుందని సుప్రీంకోర్ట్ స్పష్టం చేసింది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నెలకొన్న సమస్యల ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నట్టుగా కనిపిస్తుంది. హెచ్‌సీఏలో పెండింగ్‌లో ఉన్న ఎన్నికలను పరిశీలించేందుకు సుప్రీం కోర్టు నియమించిన ఏకసభ్య కమిటీకి నేతృత్వం వహిస్తున్న మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నాగేశ్వర్‌రావు నేడు హైదరాబాద్‌కు రానున్నారు. త్వరలో జస్టిస్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలోనే హెచ్‌సీఏకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే జస్టిస్ ఎల్ నాగేశ్వరావు హైదరాబాద్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో భాగంగా హెచ్‌సీఏ ఆఫీసు బేరర్స్‌తో ఆయన సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వివరాలు సేకరించే అవకాశం ఉంది.
ఈ క్రమంలోనే హెచ్‌సీఏ ఎన్నికలపై మాజీలు దృష్టిసారించారు. ఇప్పటికే విడతల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ.. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పావులు కదపుతున్నారు. హెచ్‌సీఏలో మొత్తం 226 ఓట్లు ఉండగా.. అందులో క్లబ్ మెంబర్స్ ఓట్లు కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో మాజీలు.. క్లబ్ మెంబెర్స్‌తో వరుస సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే ఈసారి కూడా హెచ్‌సీఏ ఎన్నికలు రసవత్తరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా.. జస్టిస్ లావు నాగేశ్వరరావుకే సుప్రీంకోర్టు ఈ బాధ్యతలు ఎందుకు అప్పగించింది. ఇంతకీ ఆయన ఎవరు, ఎక్కడివారు అన్న దానిపై నెటిజన్లు ఇంటర్నెట్‌ను జల్లెడ పడుతున్నారు.
ALso REad: అజారుద్దీన్‌కు షాక్.. హెచ్‌సీఏ కమిటీ రద్దు : సుప్రీంకోర్ట్ సంచలన తీర్పు, ఇకపై ఆయన కనుసన్నల్లోనే
ఈ క్రమంలో జస్టిస్ లావు నాగేశ్వరరావు ప్రస్థానాన్ని ఒకసారి పరిశీలిస్తే. ఏపీలోని గుంటూరు జిల్లా పెదనందిపాడు గ్రామానికి చెందిన జస్టిస్ లావు నాగేశ్వరరావు గుంటూరులోని టీజేపీఎస్ కళాశాలలో బీకాం, ఏసీ కాలేజీలో లా చదివారు. అనంతరం 1982 నుంచి 84 వరకు గుంటూరు జిల్లా కోర్టులోనూ, తర్వాత 1994 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోనూ ప్రాక్టీస్ చేశారు. అనంతరం ఆయన మకాంను ఢిల్లీకి మార్చారు. 1995 జనవరి నుంచి సుప్రీంకోర్టు లాయర్ ప్రాక్టీస్ మొదలుపెట్టారు. తర్వాత ఏపీ హైకోర్టులో సీనియర్ లాయర్‌గా, 2003-04, 2013-14లలో అడిషినల్ సొలిసిటర్ జనరల్‌గా విధులు నిర్వర్తించారు.
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసును ఆమె తరుపున కర్ణాటక హైకోర్టులో వాదించారు నాగేశ్వరరావు. అలాగే సుప్రీంకోర్టులో తమిళనాడు ప్రభుత్వం, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ తరపున నీట్ కేసును సుప్రీంకోర్టులో వాదించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు.. భారత క్రికెట్‌ను కలవరపాటుకు గురిచేసిన ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, అవినీతి ఆరోపణలకు సంబంధించి సుప్రీంకోర్టు నియమించిన ముగ్గురు సభ్యుల స్వతంత్ర కమిటీ (ముద్గల్ కమిటీ)లో నాగేశ్వరరావు కూడా ఒకరు.
ALso REad: HCA: ‘డబ్బులు కొట్టు.. బ్యాట్ పట్టు.. హెచ్‌సీఏను భ్రష్టు పట్టిస్తున్న అజారుద్దీన్..’
ఇకపోతే.. 2016లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నాగేశ్వరరావు నియమితులయ్యారు. సాధారణంగా సుప్రీంలో జడ్జిగా అవకాశం దక్కాలంటే.. ముందుగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి వుండాలి. కానీ నాగేశ్వరరావు ఏ కోర్టులోనూ న్యాయమూర్తిగా పనిచేయలేదు. తద్వారా జడ్జిగా పనిచేయకుండా నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన తొలి తెలుగు వ్యక్తిగా నాగేశ్వరరావు రికార్డుల్లోకెక్కారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయన పలు సంచలన తీర్పులు వెలువరించారు. అభిరామ్ సింగ్ VS c.d కేసు, నరేంద్ర వర్సెస్ కె.మీనా కేసు, కృష్ణ కుమార్ సింగ్ వర్సెస్ బీహార్ ప్రభుత్వం వంటి ప్రతిష్టాత్మక కేసుల్లో తీర్పులు వెలువరించిన ధర్మాసనాల్లో జస్టిస్ నాగేశ్వరరావు వ్యవహరించారు.
ఇకపోతే.. సెప్టెంబర్ 22, 2022న జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం బెంచ్ .. జస్టిస్ నాగేశ్వరరావులు కలిసి భారత ఒలింపిక్ సంఘం రాజ్యాంగాన్ని సవరించారు. నవంబర్ 10 2022న ధర్మాసనం సవరించిన రాజ్యాంగాన్ని అధికారికంగా ఆమోదించాలని సుప్రీంకోర్టు ఐఓఏని ఆదేశించింది.
