మరికొన్ని క్షణాల్లో పద్మ శ్రీ పురస్కారాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకోవాల్సి ఉన్నది. కానీ, ఇంతలోనే భార్య మరణ వార్త మలయాళ రచయిత బాలన్ పుతేరికి అందింది. పద్మ శ్రీ అవార్డు అందుకోవడం ఆయన భార్య శాంత కోరిక. దీంతో ఢిల్లీలోనే ఉండి అవార్డు అందుకున్నారు. ఇంతలో మలప్పురంలో ఆమె అంత్యక్రియలు జరిగాయి.
న్యూఢిల్లీ: సంతోష క్షణాలు వచ్చిన ప్రతిసారి.. విషాదాన్ని వెంటేసుకు వస్తాయి.. బరువెక్కిన గుండెతో ప్రముఖ మలయాళ రచయిత బాలన్ పుతేరి అన్నమాటలివి. మరికొన్ని గంటల్లో పద్మ శ్రీ అవార్డును President Ramnath Kovind చేతుల మీదుగా అందుకునే సమయంలో ఈ మాటలన్నారు. ఎందుకంటే ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక పురస్కారాల్లో Padma Shri ఒకటి. ఈ Awardను అందుకోవడానికి ఆయన ఢిల్లీ వచ్చారు. ఈ అవార్డు పొందాలనేది ఆయన సతీమణి కోరిక కూడా. అందుకే.. సంతోష క్షణాలను ఆమెకు బహుమతిగా ఇద్దామనుకున్నారు. కానీ, అవార్డు అందుకోవడానికి ముందే సతీమణి శాంత మరణ వార్తను ఆయన వినాల్సి వచ్చింది. ఆ వేదన నుంచే ఆయన పై మాటలన్నారు.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మ శ్రీ అవార్డును మలయాళ రచయిత Balan Putheri అందుకున్నారు. ఈ ఉన్నత గౌరవాన్ని అందుకోవడానికి క్షణాల ముందు ఆయన భార్య శాంత తుది శ్వాస విడిచారు. దీర్ఘకాలం క్యాన్సర్‌తో పోరాడిన ఆమె మరణించారు.
Also Read: Padma Awards: పద్మ అవార్డు గ్రహీతలను ఆత్మీయంగా పలకరిస్తున్న పీఎం మోదీ (ఫోటోలు)
పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న రచయిత బాలన్ పుతేరి కనీసం 210 పుస్తకాలను రాశారు. మలయాళ సాహిత్యంలో తనదైన ముద్ర వేసుకున్నారు. సాహిత్యం ఆయనలో ధైర్యాన్ని నూరిపోసినా.. ఆయన భార్య శాంతనే అసలైన బలం. రెండు దశాబ్దాల క్రితం ఆయన కంటి చూపు కోల్పోయారు. అయినప్పటికీ సాహిత్యంపై తన ప్రేమను కోల్పోలేదు. తన సాహిత్య కృషిని ఆమె సహకారంతో నిరాటంకంగా సాగించారు. అందుకే ఆయన అంధత్వాన్ని జయించారని అంటుంటారు.
1983లో పుతేరి తొలి పుస్తకాన్ని ప్రచురించారు. 1997లో తన 50వ పుస్తకం గురవయూర్ ఏకాదశిని పబ్లిష్ చేశారు. ఈ ఏడాది జనవరిలోనే ఆయనకు పద్మ శ్రీ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించారు.
ఈ అవార్డును అందుకోవాలని తన భార్య శాంత కోరుకున్నదని పుతేరి వివరించారు. ‘నేను నా జీవితంలో పెద్ద పెద్ద అవార్డులు పొందాలని ఒక్క రోజూ కలగనలేదు. ఈ పురస్కారాన్ని పొందినందుకు సంతోషిస్తున్నాను. ప్రతిసారి సంతోష గడియాలు వస్తున్నప్పుడు వాటి వెంటే విషాద చాయలూ వస్తుంటాయి’ అంటూ పుతేరి మాట్లాడారు.
‘నా భార్య శాంత కోరిక మేరకు పద్మ శ్రీ అవార్డు అందుకోవడానికి ఢిల్లీలోనే ఉండాలని నిశ్చయించుకున్నాను’ అని బాలన్ పుతేరి అన్నారు. బాలన్ పుతేరి ఢిల్లీలోనే ఉండటంతో ఆయన భార్య శాంత మృతదేహానికి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించారు. మలప్పురం జిల్లాలోని కరిపూర్‌లో అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
పుతేరికి పుట్టుకతోనే కుడి కంటి చూపులేదు. ఎడమ కంటి చూపు పరిధి మూడు మీటర్లు దాటదు. ఆ పరిమిత చూపుతోనే ఎన్నో పుస్తకాలను అవపోసాన పట్టారు. ఎంఏ హిస్టరీ పట్టా పుచ్చుకున్నాక 1983లో క్షేత్ర ఆరాధన అనే తొలి పుస్తకాన్ని రాశారు. 63 పుస్తకాలు రాసిన తర్వాత ఆయన ఎడమ కంటి చూపు కూడా మందగించడం మొదలైంది. తర్వాత పూర్తి చూపును కోల్పోయారు. అయినప్పటికీ నీతి కథలు, ఆధ్యాత్మిక కథలతో పుస్తకాలు రాశారు. అంటే ఆయన డిక్టేట్ చేస్తుంటే ఆయన భార్య, బంధు మిత్రులు రాసి పెట్టేవారు. 2011లో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను వికలాంగ ప్రతిభ అవార్డుతో సత్కరించింది.
