దారుణం.. సెల్ఫీ మోజులో పడి ప్రాణాలు కోల్పోయిన యువకుడు
ఉత్తరప్రదేశ్‌లోని మధురలో 18 ఏళ్ల యువకుడు తన స్నేహితులతో సెల్ఫీ తీసుకుంటుండగా రైలు ఢీకొట్టాడు. దీంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.

సెల్పీ తీసుకుంటుండగా ఒక యువకుడ్ని రైలు ఢీకొట్టింది. దీంతో ఆ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదఘటన ఉత్తరప్రదేశ్‌లోని మథురలో రైల్వే బ్రిడ్జీ వద్ద చోటుచేసుకుంది. మృతుడ్ని 18 ఏళ్ల వంశీగా పోలీసులు గుర్తించారు. వంశీ అనే యువకుడు ఆదివారం తన స్నేహితులతో కలిసి ధీష్ ఆలయాన్ని దర్శించారు.
అనంతరం.. తివారిపురం రైల్వేస్టేషన్ సమీపంలో నిర్మించిన వంతెన వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో వంశీ తన స్నేహితులతో కలిసి నిల్చుని మొబైల్‌తో సెల్ఫీ దిగుతున్నాడు. రైల్వే ట్రాక్‌పైనే నిల్చున్నారు. ఇంతలో ఓ రైలు ఆ బ్రిడ్జీ మీదుగా వచ్చింది. ఈ విషయాన్ని గమనించిన ముగ్గురు యువకులు బ్రిడ్జీ చివరకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇద్దరు యువకులు తప్పించుకోగా.. వంశీ మాత్రం ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయాడు. దీంతో రైలు ఢీకొని దుర్మరణం పాలయ్యాడు.
వంశీ మృతి చెందిన వెంటనే అతని స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వంశీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అదే సమయంలో ఆయన మృతితో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. సెల్ఫీలు, ఫోటోలు, వీడియోల కోసం యమునా నది ఒడ్డు, రైల్వే గేట్ వద్దకు వెళ్లవద్దని ఎస్‌ఎస్‌పి శైలేష్ కుమార్ పాండే హెచ్చరించారు. భవిష్యత్‌లో ఎవరైనా ఇలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సెల్ఫీ తీసుకుంటూ నీటమునిగిన యువకుడు
అంతకుముందు.. బిజ్నోర్‌లోని ఛజ్‌లాట్ ప్రాంతంలో ఒక యువకుడు సెల్ఫీ తీసుకుంటూ నదిలో పడిపోయాడు. నది ప్రవాహం వేగంగా ఉండటంతో మునిగి చనిపోయాడు. సమాచారం మేరకు.. నగరంలోని మొహల్లా మిల్కియాన్‌కు చెందిన ముజమ్మిల్(18) తన స్నేహితులతో కలిసి వాకింగ్‌కు వెళ్లాడు.
ముజమ్మిల్ , అతని ఇద్దరు స్నేహితులు ఛజ్లాట్ చేరుకున్నారు, అక్కడ ముగ్గురు సెల్ఫీ తీసుకుంటుండగా నదిలో పడిపోయారు. సంఘటనా స్థలానికి చేరుకున్న వ్యక్తులు ఇద్దరు యువకులను రక్షించగా.. ముజమ్మిల్ నీటిలో మునిగి చనిపోయాడు.
మరోవైపు ఒక అధ్యయనం ప్రకారం.. సెల్ఫీ మరణాల జాబితాలో భారత్ అగ్రస్థానంలో ఉంది. సెల్ఫీలు తీసుకుంటూ .. వందలాది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ వ్యాప్తంగా 2011 నుంచి 2017 మధ్య కాలంలో 259 సెల్ఫీ మరణాలు నమోదు కాగా.. వాటిలో 159 సెల్ఫీ మరణాలు భారత్‌లో సంభవించాయి.