హిందూ మతం ఎప్పుడు, ఎవరు పుట్టించారో కూడా ఎవరికీ తెలియదు - కర్ణాటక హోం మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
హిందూ మతంపై కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బౌద్ధం, జైన మతం భారతదేశంలో పుట్టాయని, ఇస్లాం, క్రైస్తవం బయటి దేశాల నుంచి వచ్చాయని అన్నారు. మరి హిందూ మతం ఎక్కడ పుట్టిందో ఎవరికీ తెలియదని చెప్పారు.
ఓ వైపు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతుండగానే మరో వైపు కర్ణాటక హోం మంత్రి జి.పరమేశ్వర కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. హిందూ మతం గురించి వ్యాఖ్యానించిన ఆయన అసలు హిందూయిజం మూలాలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు.
కర్ణాటకలోని తుమకూరు నగరంలో జరిగిన బహిరంగ సభలో మంత్రి పరమేశ్వర మాట్లాడుతూ.. ‘‘ప్రపంచ చరిత్రలో అనేక మతాలు పుట్టుకొచ్చాయి. కానీ హిందూ మతం ఎప్పుడు పుట్టిందో, ఈ మతాన్ని ఎవరు పుట్టించారో ఎవరికీ తెలియదు. దాని మూలాలు ప్రశ్నార్థకంగా ఉన్నాయి. ఈ ప్రశ్నకు ఎవరూ పరిష్కారం కనుగొనలేదు. బౌద్ధం, జైనమతం భారతదేశంలో ఉద్భవించాయి. ఇస్లాం, క్రైస్తవం విదేశాల నుంచి దేశంలోకి వచ్చాయి. వీటిన్నంటి (మతాలు) సమ్మేళనాలు మానవాళి మేలు కోసమే’’ అని అన్నారు.
మంత్రి పరమేశ్వర్ ప్రకటనపై బీజేపీ మండిపడింది. ఆ పార్టీ కర్ణాటక సంయుక్త అధికార ప్రతినిధి ఎస్ ప్రకాశ్ మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మెజారిటీ వర్గాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేయడంలో బిజీగా ఉంటుంది’’ అని చెప్పారు. అలాగే పరమేశ్వర అనే వ్యక్తి హిందూ మతం మూలాలను ప్రశ్నించడం ఆశ్చర్యంగా ఉందని విశ్వహిందూ పరిషత్ కు చెందిన వినోద్ బన్సాల్ అన్నారు.
సనాతన ధర్మంపై రాజకీయ వర్గాల్లో దుమారం చెలరేగుతున్న తరుణంలో మంత్రి పరమేశ్వర్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఉదయనిధి సనాతన ధర్మాన్ని వ్యాధులతో పోల్చారు. కొన్ని విషయాలను వ్యతిరేకించలేమని, వాటిని మాత్రమే రద్దు చేయాలన్నారు. ‘‘డెంగ్యూ, దోమలు, మలేరియా, కరోనాను మనం ఎదిరించలేం. దీన్ని మనం నిర్మూలించాలి. అలా సనాతనాన్ని నిర్మూలించాలి. సనాతనాన్ని వ్యతిరేకించే బదులు దాన్ని నిర్మూలించాలి’’ అని ఆయన ఓ కార్యక్రమంలో అన్నారు. దీనిపై పలు వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చింది. అయోధ్య పీఠాధిపతి మహంత్ పరమహంస దాస్ అయితే ఏకంగా ఉదయనిధి స్టాలిన్ తల నరికిన వారికి రూ.10 కోట్ల రివార్డు ఇస్తామని ప్రకటించారు.