చంద్రయాన్ 3 మిషన్ జాబిల్లిపై ఈ నెల 23వ తేదీన సాయంత్రం 6.04 గంటలకు ల్యాండ్ కాబోతున్నది. చంద్రుడి దక్షిణ ధ్రువంలో ల్యాండర్ సాఫ్ట్‌గా ల్యాండ్ అవుతుంది. ఈ ప్రక్రియను ఇస్రో అధికారిక వెబ్ సైట్, యూట్యూబ్ చానెల్, ఫేస్ బుక్ పేజీ లేదా డీడీ నేషనల్ టీవీలో లైవ్‌లో చూడవచ్చు.
న్యూఢిల్లీ: చంద్రయాన్ 3 ఈ రోజు జాబిల్లికి మరింత చేరువైంది. రెండో, తుది డీబూస్టింగ్ ఆపరేషన్ విజయవంతంగా చేపట్టారు. దీంతో ఈ మిషన్ చంద్రుడికి అత్యంత సమీప కక్ష్యలోకి చేరుకుంది. ఈ కక్ష్య చంద్రుడికి 25 కిలోమీటర్ల అతి దగ్గర, 134 కిలోమీటర్ల దూరంలో(ఎత్తులో) ఉంటుందని ఇస్రో ఆదివారం వెల్లడించింది. ప్రస్తుతం ఈ మాడ్యుల్‌లో ఇంటర్నల్ చెక్‌లు చేపడుతారు. సూర్యోదయం కోసం ల్యాండర్ ఎదరుచూస్తున్నది.
ల్యాండింగ్ ఎప్పుడు? ఎక్కడ?
ఆగస్టు 23వ తేదీన మిషన్ చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అవుతుంది. ఆగస్టు 23వ తేదీన సాయంత్రం 6.04 గంటలకు ఈ మిషన్ ల్యాండ్ కావాల్సి ఉన్నదని ఇస్రో ప్రకటించింది. ఈ సారి సాఫ్ట్‌గా ల్యాండ్ కావడానికి ప్రయత్నాలు జరుగుతాయని వివరించింది. ఈ మిషన్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అవుతుంది. ల్యాండర్ చంద్రుడిపై ల్యాండ్ అయిన తర్వాత కూడా ప్రొపల్షన మాడ్యూల్ మాత్రం చంద్రుడి చుట్టూ కక్ష్యలో తిరుగుతుందని ఇస్రో వెల్లడించింది. ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ భూ వాతావరణాన్ని అధ్యయనం చేస్తుందని తెలిపింది.
ఈ ల్యాండింగ్ ప్రక్రియను లైవ్‌లో చూడవచ్చు. ఇస్రో అధికారిక వెబ్ సైట్‌లో లేదా యూట్యూబ్‌లో ఇస్రో అధికారిక చానెల్, లేదా ఫేస్‌బుక్‌లో ఇస్రో పేజీలో చంద్రయాన్ 3 మిషన్ ల్యాండింగ్ లైవ్‌లో వీక్షించవచ్చు. ఆగస్టు 23వ తేదీన సాయంత్రం 5.27 గంటల నుంచే డీడీ నేషనల్ టీవీలో లైవ్ తిలకించవచ్చునని ఇస్రో ట్వీట్ చేసి వెల్లడించింది.
