వీల్ చైర్ లేకపోవడంతో ఆగ్రహించిన తండ్రి.. స్కూటర్ తో లిఫ్ట్ లోకి.. ఆపై డైరెక్ట్ గా వార్డులోకి .. వీడియో వైరల్..
ఆసుపత్రిలో వీల్‌ఛైర్ (WheelChair) అందుబాటులో లేకపోవడంతో ఓ తండ్రి గాయపడిన తన కుమారుడిని స్కూటర్‌పై ఎక్కించుకుని పై అంతస్తుకు తీసుకెళ్లాడు. ఈ ఘటన కోట (Kota) జిల్లాలో చోటు చేసుకుంది. గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అమీర్ ఖాన్,కరీనా కపూర్ జంటగా నటించిన త్రీడియట్స్ అందరికి తెలిసే ఉంటుంది. ఆ చిత్రంలోని ఓ సన్నివేశంలో హీరో అమీర్ ఖాన్ తన స్నేహితుడు ప్రమాదానికి గురికావడంతో అతడ్ని ఆస్పత్రికి తరలిస్తూ.. స్కూటీతోనే ఆసుపత్రిలోకి ప్రవేశిస్తారు. అచ్చు అలాంటి సన్నివేశమే రాజస్థాన్‌లోని కోటాలో ఓ ఆస్పత్రి చోటుచేసుకుంది. ఒక న్యాయవాది గాయపడిన 15 ఏళ్ల కుమారుడితో కలిసి చిక్సిత కోసం కోట నగరంలోని మహారావ్ భీమ్ సింగ్ ఆసుపత్రిలో తీసుకెళ్లాడు. తన కొడుకు కాలికి ఫ్రాక్చర్ అయ్యింది. అతడు నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. పైగా ఆర్ధోపెడిక్స్ వార్డేమో మూడో అంతస్తులో ఉంది. ఈ సమయంలో ఆసుపత్రి సిబ్బంది వీల్ చైర్ ఇవ్వాలని కోరగా.. అందుబాటులో లేవని చెప్పడంతో కోపోద్రిక్తుడైన న్యాయవాద తండ్రి తన కొడుకును స్కూటర్ పై ఎక్కించుకుని.. ఆసుపత్రిలోని లిఫ్ట్‌లోనే పై అంతస్థుకు తీసుకెళ్లాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకెళ్తే.. కోట ప్రాంతానికి చెందిన మనోజ్ జైన్ ఓ లాయర్. ఇటీవల తన 15 ఏండ్ల కుమారుడి కాలు ఫ్రాక్చర్ అయింది. దీంతో స్థానిక ఎంబీఎస్ ఆసుపత్రి (Hospital)కి తీసుకెళ్లి.. చిక్సిత అందించారు. తాజాగా కట్టు మార్పించేందుకు మరోసారి అదే ఆసుపత్రి (Hospital)కి తీసుకొచ్చారు. అయితే.. ఆర్థోపెడిక్ వార్డు మూడో అంతస్థులో ఉండటం. అలాగే.. అక్కడ వీల్ ఛైర్ అందుబాటులో లేకపోవడంతో మనోజ్ జైన్ కోపోద్రిక్తుడయ్యాడు. దీంతో ఆయన తన కుమారుడిని స్కూటర్‌పై ఎక్కించుకుని లిఫ్టులోనే మూడో అంతస్తుకు తీసుకెళ్లారు. కట్టు మార్పించుకుని మళ్లీ ఆయన అలాగే కిందకు వచ్చారు.ఈ క్రమంలో తండ్రీకొడుకులను వార్డు ఇన్‌ఛార్జ్ దేవకీనందన్ అడ్డుకుని స్కూటర్ తాళం తీసుకున్నారు. దీంతో ఆస్పత్రి తీరుపై అడ్వకేట్ మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ సందర్బంగా అడ్వకేట్ మనోజ్ మాట్లాడుతూ.. ఆసుపత్రికి చేరుకోగానే అక్కడి కార్మికులు ముఖేష్, సుఖ్‌లాల్‌లను వీల్‌చైర్ అడిగానని, అయితే.. వీల్‌చైర్ అందుబాటులో లేదని ఇద్దరూ చెప్పారని అడ్వకేట్ మనోజ్ జైన్ తెలిపారు. తన స్కూటర్‌ను వార్డుకు తీసుకెళ్లేందుకు వారిద్దరూ వార్డు సిబ్బంది నుంచి అనుమతి తీసుకున్నట్లు జైన్ పేర్కొన్నాడు. అయితే తిరిగి వస్తుండగా తండ్రీకొడుకులను వార్డు ఇన్‌ఛార్జ్ దేవకీనందన్ అడ్డుకుని స్కూటర్ తాళం తీసుకున్నారు. వీల్‌ఛైర్ లేకపోవడంతోనే తాను ఇలా చేయాల్సి వచ్చిందని ఆసుపత్రి ఇన్ చార్జీతో వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివాదాన్ని పరిష్కారించారు. ఇరువర్గాలు ఎలాంటి ఫిర్యాదు చేయకూడదని నిర్ణయించుకున్నాయని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో లాయర్ జైన్ తన కుమారుడిని స్కూటర్‌పై ఎక్కించుకుని 'లిఫ్ట్' వైపు వెళ్లే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అతడు మూడవ అంతస్తులోని లిఫ్ట్ నుండి దిగి, స్కూటర్‌ను నేరుగా వార్డుకు తీసుకెళ్లాడు.అక్కడ రోగులు, సందర్శకులు, ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు నోరు మెదపలేదు.
వీల్ చైర్ లేకపోవడాన్ని ఆసుపత్రి యంత్రాంగం అంగీకరించింది. ఇది చూసిన మరికొందరు తమ బంధువులను ద్విచక్రవాహనంపై ఆస్పత్రిలోని వార్డుకు తీసుకెళ్లేందుకు అనుమతి కోరారు. ఆ తర్వాత సందడి నెలకొంది. దీంతో ఆస్పత్రి అవుట్‌పోస్టు పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఇదిలా ఉండగా.. వార్డులో వీల్ చైర్ల కొరత ఉందని దేవకీనందన్ అంగీకరించాడు. ఈ వార్డుకు రోజుకు సుమారు 3 వేల మంది రోగులు వస్తున్నారని తెలిపారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి వీల్‌చైర్ల సరఫరా కోసం ఎదురుచూస్తున్నామని ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ కర్నేష్ గోయల్ తెలిపారు. వీల్ చైర్ల కొనుగోలుకు విరాళాలు ఇవ్వాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.