శ్రీరామ చంద్రుడు కొలువుదీరనున్న సుందర మందిరమిది.  

సరయూ నది తీరంలో అయోధ్య పురిలో దాదాపు రూ.300 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఆ ఆలయంలో అడుగడుగునా ఎన్నో ప్రత్యేకతలు. రామతత్వం మూర్తీభవించి ఉండే ఈ ఆలయం.. పటిష్ఠతకూ పర్యాయ పదంగా నిలవబోతోంది. వెయ్యేళ్లయినా దాని పటిష్ఠత దెబ్బతినదు. భూకంపాలు వచ్చినా చెక్కుచెదరదు. ఇక్కడి భూసారాన్ని 200 అడుగుల లోతు వరకు తవ్వి పరీక్షించారు. రిక్టరు స్కేలుపై 10 వరకు తీవ్రత ఉండే భూకంపం వచ్చినా ఏమీ కాకుండా ఉండేలా ఆలయ డిజైన్‌ను రూపొందించారని నిపుణులు చెబుతున్నారు.

ఇనుము ఉపయోగించకుండా..అయోధ్యలో ఆలయాన్ని రాజస్థాన్‌ నుంచి తెప్పించిన శాండ్‌ స్టోన్‌తో నిర్మించనున్నారు. ఇందుకోసం దాదాపు 1.75 లక్షల ఘనపుటడుగుల రాయి అవసరం అవుతుంది. నిర్మాణంలో ఇనుము ఉపయోగించకపోవడం మరో ప్రత్యేకత. ఈ ఆలయం ప్రధాన ద్వారం వద్ద ఎంత దూరంలో నిల్చున్నా.. రాముడి విగ్రహం కనిపించేలా తీర్చి దిద్దుతున్నారు. అబ్బురపరిచే ఆకృతిలో నిర్మించనున్న అయోధ్య రామ మందిరం నాణ్యతలోనూ దానికదే సాటిగా నిలవనుంది.

30 ఏళ్ల కిందటే డిజైన్‌

ప్రస్తుత రామమందిర డిజైన్‌ 1989లోనే రూపొందింది. దేవాలయాల ఆకృతులను రూపొందించడంలో చేయి తిరిగిన సోమ్‌పుర కుటింబీకులు రామమందిరానికి డిజైన్‌ అందించారు. 1989లో అప్పటి విశ్వ హిందూ పరిషత్‌ అధిపతి అశోక్‌ సింఘాల్‌.. బిర్లా కుటుంబం ద్వారా చంద్రకాంత్‌ సోమ్‌పుర (78)ను సంప్రదించి అయోధ్యలో రామమందిరానికి డిజైన్‌ అందించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దీంతో అయోధ్యకు వెళ్లి భూమిని పరిశీలించాలని ఆయన నిర్ణయించుకున్నారు. కానీ అక్కడ పెద్ద ఎత్తున భద్రత ఉంది. దీంతో ఆయన భక్తుడి వేషధారణలో వెళ్లి భూమిని తన కాలి అడుగులతో కొలిచారు. ఆ తర్వాత మందిర డిజైన్‌ను రూపొందించారు. ఆ తర్వాత అలహాబాద్‌ కుంభమేళా జరిగినప్పుడు సాధువులు, మఠాధిపతులు ఈ డిజైన్‌ను పరిశీలించి ఆమోదం తెలిపారు.

 

నాగర శైలిలో..

భారత్‌లో ఆలయాల నిర్మాణానికి ప్రధానంగా 3 రకాల శైలులను (నాగర, దక్షిణాది, మిశ్రమ) అనుసరిస్తారు. అయోధ్య రామాలయాన్ని నాగర శైలిలో నిర్మించనున్నారు. ఉత్తర, పశ్చిమ భారత్‌లో ఎక్కువగా ఈ శైలిని అనుసరిస్తారు. రామాలయ నిర్మాణంలో ఇనుము, సిమెంట్‌ వాడరు. కేవలం రాతి పలకలను వాడతారు. రాతిపలకను వేదికగా చేసుకుని ఆలయాన్ని నిర్మించడం నాగర శైలి ప్రత్యేకత. ఈ వేదికపైకి చేరుకోవడానికి మెట్లు ఉంటాయి. సాధారణంగా నాగర శైలిలో పెద్ద పెద్ద ప్రహరీలు ఉండవు.

మూడున్నరేళ్లలో పూర్తి

మూడు నుంచి మూడున్నర సంవత్సరాల్లో పూర్తిచేయాలని నిర్ణయించారు. స్తంభాలను, ఇతర పలకలను చెక్కే పనులు ఇప్పటికే దాదాపు 40 శాతం వరకు పూర్తయ్యాయి. ఎల్‌అండ్‌టీకి నిర్మాణ బాధ్యత అప్పగించారు.