రాహుల్ గాంధీ మరోసారి అదానీ, మోడీల మధ్య సంబంధం ఏమిటనే ప్రశ్నను లేవదీశారు. ఈ రోజు రాయ్‌పూర్‌లో మాట్లాడుతూ వారిమధ్య సంబంధం ఏమిటని అడిగారు. వీరిద్దరూ ఒక్కటే అనే కంక్లూజన్ తెచ్చారు.
న్యూఢిల్లీ: అదానీ, ప్రధాని మోడీల మధ్య ఉన్న సంబంధం ఏమిటీ? అని కాంగ్రెస్ సీనియర్ లీడర్ రాహుల్ గాంధీ మరోసారి అడిగారు. వారిద్దరూ ఒకటే అని పునరుద్ఘాటించారు. కాదంటే.. బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు ఎందుకు అదానీని కాపాడటానికి వస్తున్నారని అడిగారు. ఎందుకంటే.. అదానీ, ప్రధాని మోడీ ఒక్కటే అని వివరించారు.
దేశంలోని సంపద అంతా ఒక్కరి చేతిలోకే వెళ్లుతున్నదని, పోర్టులు, ఎయిర్ పోర్టులు, మౌలిక సదుపాయాలు, ఇతర కీలకమైన ప్రాజెక్టులు అన్నీ అదానీ చేతికే వెళ్లుతున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. ఆస్ట్రేలియాలో కూడా అదానీతో ప్రధాని మోడీ ఫొటోలు నిరసనల్లో కనిపించాయని గుర్తు చేశారు. అక్కడ ఎస్‌బీఐ అదానీకి భారీ మొత్తంలో రుణం ఇవ్వడానికి అంగీకరించిందని తెలిపారు. వీరి మధ్యకు మోడీ ఎందుకు వెళ్లారని అడిగారు. అక్కడ మోడీ అవసరం ఏమిటని ప్రశ్నించారు. అదానీ విమానంలో సేద తీరుతున్న మోడీ ఫొటోలు బయటకు వచ్చాయని కూడా పేర్కొన్నారు.
ఇవన్నింటి గురించి తాను ప్రశ్నలు వేయలేదని, కేవలం అదానీతో మోడీకి ఉన్న సంబంధం ఏమిటని పార్లమెంటులో అడిగానని తెలిపారు. కానీ, ఒక వేళ ప్రధాని చెప్పాలనుకుంటే.. ఏమీ లేదనే సింపుల్ ఆన్సర్ చెప్పవచ్చునని, కానీ, సమాధానం చెప్పలేదని వివరించారు. ఈ ప్రశ్న అడిగినందుకు తన వ్యాఖ్యలు, ఖర్గే వ్యాఖ్యలను పార్లమెంటు రికార్డుల్లో నుంచి తొలగించారని అన్నారు. ఎందుకంటే.. ప్రధాని మోడీకి అదానీతో సంబంధం ఉన్నది అని వివరించారు. వారిద్దరూ ఒక్కటే అని చెప్పారు. అందుకే అదానీ గురించి విచారణకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించలేదని తెలిపారు. అదానీని, ప్రధాని మోడీనే కాపాడుతున్నాడనేది విస్పష్టం అని అన్నారు.
