Asianet News TeluguAsianet News Telugu

Norovirus: నోరో వైరస్ అంటే ఏమిటి? లక్షణాలు.. నివారణ మార్గాలు ఇవే..!

కేరళలో రిపోర్ట్ అయిన నోరో వైరస్ కేసులు ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఈ వైరస్ వేగంగా ఇతరులకు సోకే అవకాశం ఉన్నది. జీర్ణకోశానికి సోకే ఈ వ్యాధి వాంతులు, విరేచనాలు కలిగించి పేషెంట్‌ను డీహైడ్రేట్ చేసి మరిన్ని ఆరోగ్య సమస్యల బారిన పడేస్తుంది. ఈ వైరస్ లక్షణాలు.. సోకకుండా తీసుకోవాల్సిన నివారణ మార్గాలు ఇలా ఉన్నాయి.
 

what is norovirus and how to prevent it?
Author
New Delhi, First Published Nov 13, 2021, 1:39 PM IST

న్యూఢిల్లీ: మన దేశంలో తొలిసారిగా కరోనా కేసులు Keralaలోనే నమోదయ్యాయి. రెండు వేవ్‌లలోనూ కేరళలో దుర్భర పరిస్థితులు ఎదురయ్యాయి. ఇప్పుడు తాజాగా నోరో వైరస్(Norovirus) కూడా ఇదే రాష్ట్రంలో కలకలం రేపుతున్నది. 13 మందికి నోరో వైరస్ సోకినట్టు వచ్చిన వార్తలు దేశమంతటా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కరోనా మహమ్మారి గుప్పిళ్ల నుంచి ఇప్పుడిప్పుడే విముక్తి పొందుతున్నామనే ఆశ వస్తుండగా.. ఇప్పుడు మరో వైరస్ కొత్త ఆందోళనలను తెచ్చింది. ఇంతకీ నోరో వైరస్ అంటే ఏమిటీ? దాని తీవ్రత ఎలా ఉన్నది. అది ఎలా సోకుతుంది? సోకితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి. అసలు ఆ వైరస్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేవి ఇప్పుడు అందరి మదిని తొలుస్తున్న ప్రశ్నలు.. ఆ వివరాలు తెలుసుకుందాం.

నోరో వైరస్ అంటే..
నోరో వైరస్ మన దేహంలో జీర్ణ కోశాన్ని ప్రభావితం చేస్తుంది. జీర్ణ వ్యవస్థపై దాడి చేస్తుంది. ముఖ్యంగా జీర్ణాశయం.. దాని తర్వాత కొనసాగింపుగా ఉండే పేగులపై అటాక్ చేస్తుంది. అందుకే ఇది సోకగానే కడుపులో మంటగా ఉంటుంది. వాంతులు వచ్చేలా కడుపులో తిప్పినట్టూ అవుతుంది. సాధారణంగా ఇది ఆరోగ్యవంతులకు సోకదు. చాలా వరకు పిల్లలు, వయోధికుల్లోనే ఈ కేసులు ఎక్కువగా కనిపిస్తాయి. సాధారణంగా ఈ వైరస్ సోకిన తర్వాత రెండు రోజులపాటు తీవ్రత అధికంగా ఉంటుంది. తర్వాత తగ్గుముఖం పడుతుంది. కానీ, వాంతులు విరేచనాలూ ఈ సమయంలో ఎక్కువగా కావడం వల్ల సదరు పేషెంట్లు డీహైడ్రేట్‌కు లోనయ్యే ముప్పు ఉన్నది. తద్వార ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. కలుషిత ఆహారం, నీటిని తీసుకోవడం, నోరో వైరస్ సోకిన వారి నుంచి ఇతరులకు ఈ వైరస్
సోకుతుంది. జంతువుల నుంచీ నోరో వైరస్ సోకవచ్చు.

Also Read: Norovirus : కేరళలో కలవరం సృష్టిస్తున్న మరో కొత్త వైరస్.. 13 మందికి ‘నోరో’ !

లక్షణాలివే..
నోరో వైరస్ సోకిన వారిలో వాంతులు, విరేచనలు కలుగుతాయి. పొట్ట నొప్పి, కడుపులో తిప్పినట్టు కావడం వంటి Symptoms కనిపిస్తాయి. తలనొప్పి, కాళ్లు, చేతుల నొప్పి.. అప్పుడప్పుడు ఒళ్లు నొప్పులూ వస్తాయి. కొందరిలో శరీర ఉష్ణోగ్రతలూ పెరుగుతాయి.

నివారణ మార్గాలు..
పరిశుభ్రంగా ఉండి నోరో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చు(Prevent). ఆహారం తీసుకోవడానికి ముందు చేతులు శుభ్రంగా సబ్బు, నీటితో కడుక్కోవాలి. టాయిలెట్ యూజ్ చేసిన తర్వాత కూడా సబ్బుతో కాళ్లు, చేతులు శుభ్రం చేసుకోవాలి. ఆల్కహాల్ బేస్డ్ లిక్విడ్స్‌ కరోనా వైరస్‌ను చంపినట్టు నోరో వైరస్‌ను చంపలేవు. కాబట్టి సబ్బు నీటిని ఉపయోగించడమే ఉత్తమం. ఇంటి అవసరాలకు బ్లీచింగ్ పౌడర్‌తో క్లోరినేట్ చేసిన నీటిని వినియోగించుకోవాలి. ఎప్పటికప్పుడు ఉపరితలాలను శుభ్రం చేసుకోవాలి. వేడి చేసి చల్లార్చిన నీటినే తాగడానికి వినియోగించి ఈ వైరస్ నుంచి తప్పించుకోవచ్చు. నోరో వైరస్ సోకిన వారి నుంచీ ఇది నేరుగా సోకే అవకాశముంది. కాబట్టి, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వారు ముట్టుకున్న వస్తువుల ఉపరితలాలపైనా వైరస్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి, అలాంటి చోట్లా జాగ్రత్తగా వ్యవహరంచాలి. 

Also Read: కాన్పూర్‌లో Zika Virus కల్లోలం.. భారీగా పెరిగిన కేసులు.. పిలల్లు కూడా ఉండటంతో టెన్షన్..

సాధారణంగా నోరో వైరస్ సోకడానికి సుమారు 100 వైరస్ కణాలు సరిపోతాయి. కానీ, నోరో వైరస్ సోకిన వ్యక్తి తుమ్మినా.. దగ్గినా.. వేల వైరస్ కణాలు బయటకు వస్తాయి. నోరో వైరస్ సోకిన పేషెంట్లు ఇంటికే పరిమితం చేయాలి.
నోరో వైరస్ లక్షణాలు కనిపిస్తే ఆ తర్వాత ఆరోగ్యం కుదుటపడ్డ 48 గంటల తర్వాత గానీ, వంట చేయడం, అందుకు సహకరించడం చేయవద్దు. ఇలాంటి జాగ్రత్తలతో నోరో వైరస్ మన దరి చేరకుండా చెక్ పెట్టవచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios