కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ బుధవారం రోజున లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. ఈ అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభలో స్పీకర్ అనుమతించారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను మణిపూర్ అంశం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. మణిపుర్ అంశంపై పార్లమెంటులో ప్రధాని మోదీ సమగ్ర ప్రకటన చేయాలని విపక్ష కూటమి ‘‘ఇండియా’’ పట్టుబుడుతుంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వంపై ఇండియా కూటమికి తరఫున అస్సాంలోని కలియాబోర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ బుధవారం రోజున లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. ఈ అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభలో స్పీకర్ అనుమతించారు. అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపిన తర్వాత చర్చ తేదీ, సమయాన్ని నిర్ణయిస్తామని లోక్‌సభ స్పీకర్ తెలిపారు. ఇక, అవిశ్వాస తీర్మానం అనుమతి పొందాలంటే సభలో కనీసం 50 మంది సభ్యుల మద్దతు అవసరం.
అయితే ప్రస్తుతం లోక్‌సభలో మోదీ ప్రభుత్వానికి అనుకూలమైన మెజారిటీ ఉంది. అయితే మణిపూర్‌లో జరిగిన హింసాకాండతో సహా పలు అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ నుంచి సమాధానం కోరేందుకే లోక్‌సభలో అధికార పార్టీకి సంఖ్యాబలం ఎక్కువగా ఉన్నప్పటికీ అవిశ్వాస తీర్మానం ఒక మార్గమని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. దీంతో అసలు అవిశ్వాస తీర్మానం అంటే ఏమిటి? దీనిపై చర్చ ఏ విధంగా ఉంటుంది? ఓటింగ్ ఎలా జరుగుతుంది? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అవిశ్వాస తీర్మానం అంటే ఏమిటి?
అవిశ్వాస తీర్మానం అంటే సాధారణంగా ప్రతిపక్ష పార్టీ సభలో తన మెజారిటీని నిరూపించుకునేలా అధికారంలో ప్రభుత్వాన్ని బలవంతం చేసే చర్య అని చెప్పవచ్చు. అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందినట్లయితే.. ప్రభుత్వం రాజీనామా చేయాల్సి ఉంటుంది. అవిశ్వాస తీర్మానం తప్పనిసరిగా లిఖితపూర్వకంగా ఉండాలి. అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందాలంటే.. లోక్‌సభలో కనీసం 50 మంది సభ్యులు తీర్మానానికి మద్దతు ఇవ్వాలి. ఈ తీర్మానాన్ని స్పీకర్ అనుమతించినట్టయితే.. అధికారంలో ఉన్న పార్టీ తన మెజారిటీని సభలో నిరూపించుకోవాలి. సభలో బలపరీక్ష ద్వారా అధికార పక్షం తన బలాన్ని ప్రదర్శించినప్పుడే అధికారంలో కొనసాగుతుంది. లేకపోతే అధికారం కోల్పోవాల్సి వస్తుంది.
లోక్‌సభ విధివిధానాలు, ప్రవర్తనా నియమాలలోని రూల్ 198 ప్రకారం.. లోక్‌సభ అవిశ్వాస తీర్మానాన్ని అనుమతించడానికి ముందు దానిని అభ్యర్థించడానికి ప్రతిపక్షం కారణాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. ఇదిలా ఉంటే, ప్రతిపక్ష పార్టీలను ఎదుర్కోవడానికి విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ప్రభుత్వం తన మెజారిటీని నిరూపించుకోవచ్చు.
అవిశ్వాస తీర్మానాన్ని ఎవరు ప్రవేశపెట్టగలరు?
లోక్‌సభలో మాత్రమే అవిశ్వాస తీర్మానం పెట్టవచ్చు. దీనిని రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు వీలులేదు. లోక్‌సభ సభ్యులు ఎవరైనా అవిశ్వాస తీర్మానం పెట్టవచ్చు. అయితే ఈ తీర్మానానికి సభలో కనీసం 50 మంది సభ్యులు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది.
అవిశ్వాస తీర్మానం ఎలా ప్రవేశ పెడతారు?
అవిశ్వాస తీర్మానంపై సభ్యుడు సంతకం చేసి దానిని లోక్‌సభ స్పీకర్‌కు సమర్పించాలి. అప్పుడు లోక్‌సభ స్పీకర్ తీర్మానాన్ని చర్చకు అంగీకరించాలా వద్దా అని నిర్ణయిస్తారు. అంగీకరించినట్లయితే.. అన్ని పార్టీలతో చర్చించి చర్చకు తేదీ, సమయాన్ని నిర్ణయిస్తారు.
అవిశ్వాస తీర్మానంపై చర్చ, ఓటింగ్ ఎలా జరుగుతుంది?
లోక్‌సభలో దానిని సమర్పించిన సభ్యునిచే మోషన్ మూవ్ చేయబడుతుంది. ప్రభుత్వం ఆ తర్వాత మోషన్‌పై ప్రతిస్పందిస్తుంది. ఆ తర్వాత ఈ తీర్మానంపై ప్రతిపక్షాలు మాట్లాడే అవకాశం ఉంటుంది. చర్చ అనంతరం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరుగుతుంది. సభలోని మెజారిటీ సభ్యులు మద్దతు ఇస్తేనే తీర్మానం ఆమోదం పొందుతుంది. అవిశ్వాస తీర్మానం నెగ్గితే ప్రభుత్వం రాజీనామా చేయాలి.
అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌లో ప్రభుత్వం గెలిస్తే ఏమవుతుంది?
అవిశ్వాస తీర్మానంపై ప్రభుత్వం ఓటింగ్‌లో గెలిస్తే.. ఆ తీర్మానం వీగిపోయి ప్రభుత్వం అధికారంలో కొనసాగుతుంది.
లోక్‌సభలో ఇప్పటి వరకు ఎన్ని అవిశ్వాస తీర్మానాలు వచ్చాయి?
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి లోక్‌సభలో 27 అవిశ్వాస తీర్మానాలు వచ్చాయి. 1963లో ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూపై తొలి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రధాని ఇందిరా గాంధీ అత్యధికంగా 15 సార్లు అవిశ్వాస తీర్మానాలను ఎదుర్కొన్నారు. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా వచ్చిన 15 అవిశ్వాస తీర్మానాలలో నాలుగింటిని సీపీఎం నాయకుడు జ్యోతిర్మయి బసు ప్రవేశపెట్టారు.
లాల్ బహదూర్ శాస్త్రిపై మూడు, పీవీ నరసింహారావుపై మూడు, మొరార్జీ దేశాయ్‌పై రెండు, రాజీవ్ గాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయిపై ఒక్కొక్కటి చొప్పున అవిశ్వాస తీర్మానాలు వచ్చాయి. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం 1999 ఏప్రిల్‌లో ఒక ఓటు (269–270) తేడాతో అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయింది.
ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వంపై 2018 జూలై 20న లోక్‌సభలో తొలి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబడింది. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై ఎన్డీయే ప్రభుత్వం 195 ఓట్ల తేడాతో విజయం సాధించింది. ఎన్డీయే కూటమికి అనుకూలంగా 325 మంది ఎంపీలు ఓటు వేయగా.. 126 మంది మాత్రమే అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడంతో భారీ మెజారిటీతో గెలిచింది.
నరేంద్ర మోడీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2018లో ఇటీవల అవిశ్వాస తీర్మానం పెట్టారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై ఎన్డీయే ప్రభుత్వం 195 ఓట్ల తేడాతో విజయం సాధించింది. అయితే వ్యవసాయ కష్టాలు, ఆర్థిక వృద్ధి మందగించడం, మూకుమ్మడి హత్యల సంఘటనలు వంటి అనేక సమస్యలపై ప్రభుత్వంపై దాడి చేయడానికి ఈ చర్చ ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చింది.
