Asianet News TeluguAsianet News Telugu

Trinamool Targets Centre: కేంద్ర‌లోని బీజేపీని టార్గెట్ చేసిన తృణ‌మూల్ కాంగ్రెస్‌.. ఘాటు విమ‌ర్శ‌లు !

Sukhendu Sekhar Ray: బీజేపీ ప్రభుత్వ నినాదం సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్ ఇప్పుడు సబ్‌కా సాత్, సబ్‌కా సర్వనాష్‌గా మారిందని టీఎంసీ జాతీయ అధికార ప్రతినిధి సుఖేందు శేఖర్‌రే అన్నారు.
 

What Happened To PMs Sabka Sath, Sabka Vikas: Trinamool Targets Centre
Author
Hyderabad, First Published May 14, 2022, 1:55 AM IST

Trinamool VS BJP : ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) ప్ర‌భుత్వాన్ని తృణ‌మూల్ కాంగ్రెస్ టార్గెట్ చేసింది. దేశ రాజ‌కీయాల్లో ఎలాగైనా పార్టీని విస్త‌రించాల‌ని ఆ పార్టీ అధినేత్రి, బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌త్యేక ప్రణాళిక‌లు ర‌చిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా.. తృణ‌మూల్ కాంగ్రెస్ నేతలు బీజేపీపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే భారత రూపాయి విలువ‌ ఆల్‌టైమ్ కనిష్ట స్థాయికి చేరుకోవడం మరియు దేశ ఫారెక్స్ నిల్వలు క్షీణించడంతో, ఆర్థిక దుర్వినియోగ అంశాల‌ను ఎత్తిచూపుతూ కేంద్రంపై విమ‌ర్శ‌లు గుప్పించింది తృణ‌మూల్ కాంగ్రెస్‌. ఆర్థిక పరిస్థితిని పునరుద్ధరించడానికి ప్రధాని నరేంద్ర మోడీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూనే.. ఆయ‌న పదవీవిరమణ చేయాలని పేర్కొంది. టీఎంసీ జాతీయ అధికార ప్రతినిధి సుఖేందు శేఖర్ రే మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ నినాదం 'సబ్కా సాత్, సబ్‌కా వికాస్' ఇప్పుడు  'సబ్కా సాత్, సబ్కా సర్వనాష్' గా మారిందని ఆరోపించారు. 

టీఎంసీ జాతీయ అధికార ప్రతినిధి సుఖేందు శేఖర్ రే మీడియాతో మాట్లాడుతూ "స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి దేశం ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు. బీజేపీ ప్రభుత్వ లోపభూయిష్ట విధానాల కారణంగా దేశం ఆర్థిక దివాలా దిశగా పయనిస్తోంది.. ఇది ఆర్థిక దుర్వినియోగం ఫలితంగానే ఏర్ప‌డింది" అని అన్నారు. ద్రవ్యోల్బణం ఆందోళనలు మరియు అమెరికన్ కరెన్సీ బలం స్థానిక యూనిట్‌పై ప్రభావం చూపడంతో రూపాయి తన ప్రారంభ లాభాలను తగ్గిస్తూ.. భారీగా ప‌త‌నం అయింది.  శుక్రవారం US డాలర్‌తో పోలిస్తే దాని తాజా జీవితకాల కనిష్టానికి 77.55 వద్ద స్థిరపడింది.

"రూపాయి ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరుకుంది. ఇది ఆర్థిక వ్యవస్థలోని ప్రతి అంశంపై క్యాస్కేడింగ్ ప్రభావాన్ని చూపుతుంది.. దిగుమతుల ఖర్చు పెరుగుతుంది, ఉత్పత్తి తీవ్రంగా దెబ్బతింటుంది. ఇది ద్రవ్యోల్బణంపై కూడా ప్రభావం చూపుతుంది. ఆల్ టైమ్ హై," అని ఆయ‌న చెప్పాడు. దేశం ఫారెక్స్ నిల్వల క్షీణత గురించి మాట్లాడుతూ, పరిస్థితిని రక్షించడానికి కేంద్ర ప్రభుత్వానికి ఏదైనా ప్రణాళిక ఉందా అని రే ప్ర‌శ్నించారు. "పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు అంతుచిక్కడం లేదు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు సంబంధించినంతవరకు, సమీప భవిష్యత్తులో విశ్రమించేది లేదనిపిస్తోంది. 'సబ్కా సాత్, సబ్కా వికాస్' అనే  బీజేపీ నినాదం మారింది. "సబ్కా సాత్, సబ్కా సర్వనాష్" అని TMC MP పేర్కొన్నారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ప్రధాన కరెన్సీ ఆస్తుల పతనం నేపథ్యంలో మే 6న ముగిసిన వారానికి భారత ఫారెక్స్ నిల్వలు 1.774 బిలియన్ డాలర్లు తగ్గి 595.954 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. "ప్రధానమంత్రి పరిస్థితిని నిర్వహించలేకపోతే మరియు ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోలేకపోతే, అతను వెంటనే పదవీ విరమణ చేయాలి. గత ఎనిమిదేళ్లుగా ఈ ఆర్థిక దుర్వినియోగాన్ని దేశం భరించింది" అని రే అన్నారు. ఇదిలావుండ‌గా, తృణ‌మూల్ పై బీజేపీ సైతం ఫైర్ అయింది. బెంగాల్ లోని టీఎంసీ ప్ర‌భుత్వం రాష్ట్ర దుర్భరమైన ఆర్థిక పరిస్థితికి కారణమైంద‌ని ఆరోపించింది. ‘‘ఆర్థిక నిర్వహణ లోపంపై కేంద్ర ప్రభుత్వానికి టీఎంసీ నేతలు సలహాలు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉంది.కేంద్రం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది. విచిత్రమైన ఆర్థిక విధానాలతో గత 11 ఏళ్లలో టీఎంసీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందన్నది వాస్తవం’’ అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సమిక్ భట్టాచార్య తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios