‘ఇండియా’ను ఇక నుంచి ‘భారత్’ కాబోతోందని దేశ వ్యాప్తంగా చర్చ మొదలైంది. దీనిపై అనేక వర్గాల నుంచి భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ విషయంలో 2016లో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 

భారత్ పేరు మార్పు ప్రతిపాదనపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ మొదలైంది. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంపై కొన్ని వర్గాల నుంచి సానుకూల వైఖరి వెలువడుతుండగా.. మరి కొన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. అత్యవసరంగా ఈ పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రతిపక్షాలు కేంద్రంలోని అధికార బీజేపీపై మండిపడుతున్నాయి. ఇలా పేరు మార్పుపై ప్రస్తుతం వాడీ వేడీగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. 2016లో ఈ విషయంలో సుప్రీంకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలను మనం గుర్తుచేసుకోవాలి.

భారతదేశం పేరును కేవలం భారత్ గా మార్చాలని కోరుతూ ఆ సమయంలో అత్యున్నత న్యాయస్థానంలో ఈ పిటిషన్ దాఖలైంది. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ.. ‘‘భారత్ లేదా ఇండియా? మీరు ఈ దేశాన్ని ‘భారత్’ అని పిలవాలని అనుకుంటున్నారా ? అయితే పిలవండి. ఇంకెవరైనా దీనిని ‘ఇండియా’ అని పిలవాలని అనుకుంటే వారిని అలాగే పిలవనివ్వండి’’ అని పేర్కొంది. అన్ని ప్రయోజనాల కోసం దేశం పేరును ఇండియా బదులుగా భారత్ అని ఉపయోగించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని తోసిపుచ్చుతూ ఈ వ్యాఖ్యలు చేసింది. 

మహారాష్ట్రకు చెందిన నిరంజన్ భత్వాల్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిల్ ను చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ యూయూ లలిత్ లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో ఎలాంటి మార్పులు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1(1) ప్రకారం - ‘‘ఇండియా, అంటే భారత్, రాష్ట్రాల సమాఖ్యగా ఉంటుంది.’’

జీ20 సమ్మిట్ డిన్నర్ ఆహ్వానం కోసం రాష్ట్రపతి కార్యాలయం ముద్రించిన కార్డుపై ద్రౌపది ముర్మును ప్రెసిండెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొనడం రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపింది. అయితే అన్ని అధికారిక అవసరాల కోసం భారత్ పేరును 'రిపబ్లిక్ ఆఫ్ భారత్'గా మార్చాలని కోరుతూ ప్రభుత్వం ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయని ‘టైమ్స్ నౌ’ పేర్కొంది. సెప్టెంబర్ 18-21 మధ్య జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భారత్ పేరు మార్పు తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.