మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాహుల్ గాంధీ ఏమన్నారంటే ? గతంలో ప్రధానికి రాసిన లేఖ వైరల్..
మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో గతంలో రాహుల్ గాంధీ.. ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో మహిళా బిల్లుకు కాంగ్రెస్ షరతులు లేకుండా మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు.

మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. ఆ పార్టీ నాయకుడు జైరాం రమేష్ ఈ బిల్లు చరిత్రను తెలియజేస్తూ ఎక్స్ (ట్విట్టర్)లో ఓ పోస్టు పెట్టారు. అయితే గతంలోనే ఈ విషయంలో రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. 2018లో రాసిన ఈ లేఖను జైరాం రమేష్ తిరిగి పోస్టు చేశారు. కాగా.. ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.
ఆ లేఖలో ఏముందంటే ?
‘‘మహిళా సాధికారత కోసం పోరాడుతున్నానని మన ప్రధాని చెబుతున్నారా? ఆయన పార్టీ రాజకీయాలకు అతీతంగా నడవాల్సిన సమయం ఆసన్నమైంది. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ఆమోదించాలి. ఈ విషయంలో ఆయనకు కాంగ్రెస్ బేషరతుగా మద్దతు ఇస్తుంది’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
బీజేపీ మద్దతుతో ఎగువ సభలో ఈ బిల్లు ఆమోదం పొందిందని, అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న దివంగత కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ దీనిని చారిత్రాత్మకమైన, ముఖ్యమైనదిగా అభివర్ణించారని లేఖలో పేర్కొన్నారు. మహిళా సాధికారత విషయంలో అందరం కలిసి నిలబడదామని, పార్టీ రాజకీయాలకు అతీతంగా భారత్ కు మార్పుకు సమయం ఆసన్నమైందనే సందేశాన్ని పంపుదామని పిలుపునిచ్చారు.
మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలనేది కాంగ్రెస్ పార్టీ చిరకాల డిమాండ్ అని జైరాం రమేష్ పేర్కొన్నారు. కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, బిల్లు వివరాల కోసం ఎదురు చూస్తున్నామన్నారు. ప్రత్యేక సమావేశానికి ముందు జరిగిన అఖిలపక్ష సమావేశంలో దీనిపై బాగా చర్చించి ఉంటే బాగుండేదని, రహస్య ముసుగులో పనిచేయకుండా ఏకాభిప్రాయం సాధించి ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
కాగా.. 1996 నుంచి మహిళలకు చట్టపరమైన రిజర్వేషన్ల కోసం చట్టాన్ని రూపొందించడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. కానీ విఫలమయ్యాయి. 2010లో యూపీఏ ప్రభుత్వం రాజ్యసభలో ఈ బిల్లును ఆమోదించగలిగినప్పటికీ మిత్రపక్షాల ఒత్తిడి కారణంగా లోక్ సభలో ప్రవేశపెట్టలేకపోయింది. అయితే ప్రస్తుతం అనేక ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లు కోసం డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. కాబట్టి ఈ బిల్లు సునాయాసంగా సభ ఆమోదం పొందే అవకాశం ఉంది.