స్వాతంత్ర్య పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఏమిటో చెప్పమనండి అంటూ బిహార్ సీఎం నితీశ్ కుమార్ విమర్శలు సంధించారు. ఆర్ఎస్ఎస్ పాత్ర ఏమిటో ప్రజలకు తెలిసిందే అని అన్నారు. దేశాన్ని బానిస సంకెళ్ల నుంచి రక్షించిన బాపును మరువరాదని స్పష్టం చేశారు.
పాట్నా: బిహార్ సీఎం నితీశ్ కుమార్ శనివారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్‌లపై దాడికి దిగారు. భారత స్వాతంత్ర్య సమరంలో వారి పాత్ర ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. ఈ మధ్య భారత దేశ నూతన జాతిపిత అని కొందరు మాట్లాడుతున్నారని, ఆయన నిరంతం వార్తల్లో ఉంటారని పరోక్షంగా ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించారు.
రాష్ట్రంలో కాలేజీ, స్కూల్స్‌కు రిక్రూట్ అయిన కొత్త ప్రిన్సిపాల్స్, టీచర్లకు అపాయింట్‌మెంట్ లెటర్లు అందించే కార్యక్రమంలో నితీశ్ కుమార్ మాట్లాడారు. పీఎం మోడీపై విమర్శలు సంధిస్తూ.. వారు దేశానికి ఏం చేశారు? ఇవాళ దేశం ఎక్కడ ఉన్నది? దేశంలో వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలేవీ? అని ప్రశ్నించారు. ఆయన టెక్నాలజీని రాజకీయ అవసరాలకు వాడుతున్నాడని ఆరోపించారు. అభివృద్ధి అనేది కేవలం యాడ్స్‌లోనే ఉన్నదని విమర్శించారు.
Also Read: 1947లో అక్షరాస్యత ఎంత? ఇప్పటి వరకు లిటరసీ రేటు తీరు ఎలా ఉన్నది?
దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఎంతమాత్రం పాత్ర పోషించనివారు.. ఇవాళ స్వాతంత్ర్యం గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. స్వాతంత్ర్య పోరులో ఆర్ఎస్ఎస్ పాత్ర ఏమిటో ప్రజలకు తెలుసు అని అన్నారు. తన తండ్రి స్వాతంత్ర్య సమర యోధుడు అని, ఆయన ఫ్రీడమ్ ఫైటర్ల సాహసాలను తనకు వివరించేవాడని తెలిపారు.
బానిస సంకెళ్ల నుంచి భారత దేశానికి విముక్తి కల్పించిన మహాత్మా గాంధీ పాత్రను ఎట్టి పరిస్థితుల్లో మరిచిపోవద్దని నితీశ్ కుమార్ వివరించారు. ఇదిలా ఉండగా కొందరు మాత్రం తామే నిజమైన దేశభక్తులమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
జనాభా నియంత్రణపై బీజేపీ రచ్చ చేస్తున్నదని పేర్కొన్నారు. తన అభిప్రాయం ప్రకారం, మహిళలను జాగృతం చేస్తే.. విద్యావంతులను చేస్తే జనాభా పెరుగుదల తగ్గిపోతుందని అన్నారు.
